జగన్ కు, ఉద్యోగులకు మధ్య ఇప్పటికే ఓసారి జగడం జరిగింది. పీఆర్సీ కోసం ఏకంగా ఉద్యోగులంతా రోడ్డెక్కారు. తర్వాత జగన్ మెజారిటీ ఉద్యోగులకు ఆమోదయోగ్యమైన ప్యాకేజీని ప్రకటించి వాళ్లను సంతృప్తి పరిచారు. అయితే ఇప్పుడు అదే ఉద్యోగులను మరోసారి అసంతృప్తికి గురిచేస్తున్నారు ముఖ్యమంత్రి.
జిల్లాల విభజన దాదాపు పూర్తయిన నేపథ్యంలో.. అనివార్యంగా ఉద్యోగుల్ని బదిలీ చేయాల్సి వస్తోంది. ఎప్పట్లానే సీనియారిటీ ప్రాతిపదికన తీసుకొని కొత్త జిల్లాలకు ఓ సీనియర్ ను, ఓ జూనియర్ ను ఎలాట్ చేస్తున్నారు.
ఇప్పటివరకు కుటుంబంతో సెటిల్ అయిన ఉద్యోగులు, ఇప్పుడు జగన్ నిర్ణయంతో కొత్త జిల్లా కేంద్రాలకు వెళ్లాల్సిన పరిస్థితి. అంతా సెట్ అయిందని అనుకునేలోపు, మళ్లీ కొత్త ప్రాంతం, కొత్త ఇల్లు వెదుక్కోవడం, పిల్లల స్కూల్స్ మార్పించడం.. ఇలా ఉద్యోగులు జగన్ నిర్ణయంతో మరోసారి డిస్టర్బ్ అవుతున్నారు.
బదిలీలతో నష్టపోయేది ఎవరు..?
జిల్లా స్థాయి కేడర్ల విషయంలో ఇప్పటికే స్పష్టంగా మార్గదర్శకాలున్నాయి. వాటిని పాటిస్తూ స్థానిక బదిలీలపై ఉత్తర్వులు ఇవ్వబోతున్నారు. ప్రస్తుతం డివిజన్ పరిధిలోనే బదిలీలు జరుగుతాయి. పూర్తి స్థాయి ఉత్తర్వులు వచ్చాక ఉద్యోగులు జిల్లాలు మారాల్సి వస్తుంది. తెలంగాణలో ఇప్పటికే ఇలాంటి బదిలీలతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. కానీ ఏపీలో మాత్రం ఆ ఇబ్బందిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ముందడుగు వేయడానికి సిద్ధమైంది.
కొత్త జిల్లాలకు ఉద్యోగుల బదిలీ విషయంలో జగన్ ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఉద్యోగులకు ఆమోదయోగ్యమైన నిర్ణయాల్నే తీసుకుంటున్నారు. లిస్ట్ లో అందరికంటే జూనియర్లకే ఎక్కువ స్థానచలనం ఉంటోంది. అది ఎలాగూ తప్పనిసరి.
ఇక సీనియర్ల బదిలీలకు సంబంధించి వాళ్లు పుట్టిన ప్రాంతం చూసి బదిలీలు చేస్తున్నారు. ఉదాహరణకు ఓ వ్యక్తి పార్వతీపురంలో పుట్టాడు అనుకుందాం. అతడు విజయనగరంలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇప్పుడు పార్వతీపురం జిల్లా కేంద్రంగా మన్యం అనే కొత్త జిల్లా ఏర్పాటైంది. పార్వతీపురంలో పుట్టిన సీనియర్ ఉద్యోగిని మన్యంకు బదిలీ చేస్తారన్నమాట.
ఇలా చేయడం వల్ల ఉద్యోగుల్లో అసంతృప్తి కొంతమేర తగ్గే అవకాశం ఉంది. తమ సొంత ఊరికి మరింత దగ్గరగా వెళ్లేందుకు వారికి అవకాశం కూడా ఉంటుంది. అదే సమయంలో భార్యా భర్త చెరో జిల్లాకు వెళ్లాల్సి వస్తే మాత్రం ఇబ్బందులు ఎదురైనట్టే.
ఏప్రిల్-2 నాటికి కొత్త జిల్లాలతో పాలన మొదలైనా.. వేసవి సెలవలు పూర్తయ్యే నాటికి బదిలీల ప్రక్రియ కూడా పూర్తి చేస్తామంటున్నారు అధికారులు. బదిలీపై వెళ్లే ఉద్యోగులకు ప్రత్యేక అలవెన్సు ఇచ్చే ఆలోచనలో కూడా ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది.