ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు బీజేపీలో జోష్ పెంచాయి. బీజేపీ ప్రత్యర్థులకు మాత్రం తీవ్ర నిరాశనిస్పృహలను నిన్నటి ఫలితాలు మిగిల్చాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్‌పై ఆ రాష్ట్ర బీజేపీ మాటల దాడి పెంచింది. తర్వాత టార్గెట్ కేసీఆర్ అని, ఇప్పటికే ఆయన పని అయిపోయిందని, వచ్చే ఏడాది టీఆర్ఎస్ దుకాణం బంద్ అవుతుందని బీజేపీ నేతలు విరుచుకు పడుతున్నారు.
శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వెళ్లిన బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మీడియా మాట్లాడుతూ కేసీఆర్‌పై మండిపడ్డారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వమే ఏర్పడుతుందని స్పష్టం చేశారు. మోదీకి ప్రత్యామ్నాయ అంటూ దేశ వ్యాప్తంగా పర్యటిస్తున్న కేసీఆర్ ఆశలు నెరవేరవన్నారు. పంజాబ్ మినహా మిగిలిన నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ సాధించిన ఫలితాలే కేసీఆర్‌కు సమాధానమన్నారు.
తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని తెలిపారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం పట్టు కోల్పోయిందని చెప్పుకొచ్చారు. కేసీఆర్ పథకాలు అట్టర్ ప్లాప్ అయ్యాయని ఆమె అన్నారు. తెలంగాణలో కూడా ప్రజలు బీజేపీని కోరుకుంటున్నారని డీకే అరుణ తెలిపారు.
రాబోవు ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ దుందుబీ మోగిస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. బీజేపీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని ప్రచారం చేశారని… మోదీ చేసిన అభివృద్ధే బీజేపీని తిరిగి అధికారంలోకి తీసుకొచ్చిందని చెప్పుకొచ్చారు.