ఏపీ అసెంబ్లీలో 2022-23 వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ప్రవేశ పెడుతున్న సందర్భంగా గందరగోళం నెలకుంది. టీడీపీ సభ్యులు అడ్డు తగలడంతో ఆర్థిక మంత్రితో పాటు స్పీకర్ తమ్మినేని సీతారాం సీరియస్ అయ్యారు.
చిన్న పిల్లలకు సంబంధించి బడ్జెట్ వివరాలను వెల్లడించే సమయంలో టీడీపీ సభ్యులు అడ్డుకోవడంతో ఆర్థిక మంత్రి మండిపడ్డారు. గవర్నర్ బిశ్వభూషణ్ ప్రసంగాన్ని అడ్డుకున్నారని, ఇప్పుడు ఎంతో ప్రాధాన్యం కలిగిన ఆర్థిక బడ్జెట్ ప్రవేశాన్ని అడ్డుకుంటున్నారని ఆక్షేపించారు.
బడ్జెట్ ప్రసంగాన్ని అడ్డుకోవడం ఎప్పుడూ లేదన్నారు. కనీసం వినే ఓపిక కూడా లేకపోతే ఎలా అని నిలదీశారు. స్పీకర్ తమ్మినేని సీతారాం జోక్యం చేసుకుంటూ ఎందుకు గందరగోళం సృష్టిస్తున్నారని ప్రశ్నించారు. బడ్జెట్ అంతా అబద్ధాలమయం అని టీడీపీ సభ్యులు అన్నారు.
బడ్జెట్‌పై అభ్యంతరాలు ఉంటే ప్రధాన ప్రతిపక్షంగా ఆ విషయాల్ని సభ దృష్టికి తేవచ్చన్నారు. బడ్జెట్‌పై మాట్లాడే సందర్భంలో అభ్యంతరం ఏంటో తెలియజేయాలే తప్ప, మధ్యలో అడ్డుకోవడం తగదని హితవు పలికారు. బడ్జెట్ అంతా తప్పులమయం అంటూ ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా ఆర్థిక మంత్రి జోక్యం చేసుకుంటూ బడ్జెట్ ప్రసంగాన్ని అడ్డుకోవద్దని, ఒకవేళ ఇష్టం లేకపోతే సభ నుంచి వెళ్లిపొమ్మని చెప్పాలని స్పీకర్‌ను కోరారు. కొంతసేపటికీ సభ సర్దుమణిగింది. దీంతో యధాప్రకారం బడ్జెట్ ప్రసంగాన్ని ఆర్థిక మంత్రి కొనసాగించారు.