సినిమా విడుదలైన నాడే ఇంట్లో సినిమా చూసేయచ్చు అంటున్నారు ఆంధ్ర ప్రభుత్వ ఫైబర్ నెట్ చైర్మన్ గౌతమ్ రెడ్డి. ఇది ఎంత వరకు పాజిబుల్ అవుతుందో కాదో తెలియదు కానీ ఆయన మాత్రం ఆల్ మోస్ట్ అంతా ఫైనల్ అయిపోయిందన్న రేంజ్ లో చెప్పేసారు.
విశాఖ నుంచి ఈ కొత్త విధానం స్టార్ట్ చేస్తున్నామన్నారు. అయితే నిర్మాతలతో మాట్లాడామని చెప్పారు తప్ప విధి విధానాలు ఏమిటి అన్నది వివరించలేదు. అలాగే పెద్ద సినిమాల సంగతి తరువాత చూసుకుంటా మన్నారు తప్ప ఏ రేంజ్ సినిమాలు వుంటాయన్నది చెప్పలేదు.
ఫైబర్ నెట్ ను ఆ రోజు రీ చార్జ్ చేసుకోవాల్సి వుంటుంది. వన్ డే పాటు సినిమా అందుబాటులో వుంటుంది అంటున్నారు. ఇంకా..ఇంకా చాలా క్లారిటీ అయితే రావాల్సి వుంది. కానీ ఇప్పటికే థియేటర్ల పరిస్థితి అంతంత మాత్రంగా వుంది. కొన్ని సీజన్ లలో జీతాలు ఇవ్వడం కూడా కష్టంగా వుందని ఎగ్జిబిటర్లు గోలపెడుతున్నారు.
ఓటీటీ నే బాగా అలవాటు అయింది. ఓటీటీ లో కూడా శుక్రవారం నాడు సినిమాలు విడుదలవుతున్నాయి. శుక్రవారం నాడు థియేటర్ కు వెళ్లే అలవాటు నుంచి అదే రోజు ఓటిటి లో సినిమాలు చూసే అలవాటుకు మళ్లిపోతున్నారు చాలా మంది. సిటీల్లో థియేటర్లు వచ్చే వారి సంఖ్య నానాటికీ తగ్గుతోంది. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు తొలి రోజే ఇంట్లోనే సినిమా అంటే అది టాలీవుడ్ కు ప్లస్ అవుతుందో..మైనస్ అవుతుందో?