బాబు ప్ర‌క‌టించిన ఐదు ప‌థ‌కాల బ‌డ్జెట్ ఎంతంటే!

మ‌హానాడు వేదిక‌గా టీడీపీ మేనిఫెస్టోను చంద్ర‌బాబును ప్ర‌క‌టించారు. సంక్షేమ ప‌థ‌కాల‌ను అమ‌లు చేయ‌డంతో ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ కంటే తానే పెద్ద తోపు అని నిరూపించుకోడానికి చంద్ర‌బాబు త‌హ‌త‌హ‌లాడుతున్నారు. సంక్షేమ ప‌థ‌కాల ల‌బ్ధిదారులు ఎన్నిక‌ల్లో…

మ‌హానాడు వేదిక‌గా టీడీపీ మేనిఫెస్టోను చంద్ర‌బాబును ప్ర‌క‌టించారు. సంక్షేమ ప‌థ‌కాల‌ను అమ‌లు చేయ‌డంతో ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ కంటే తానే పెద్ద తోపు అని నిరూపించుకోడానికి చంద్ర‌బాబు త‌హ‌త‌హ‌లాడుతున్నారు. సంక్షేమ ప‌థ‌కాల ల‌బ్ధిదారులు ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ వైపు నిల‌బ‌డుతార‌నే భ‌యం చంద్ర‌బాబును వెంటాడుతున్న‌ట్టే క‌నిపిస్తోంది. జ‌గ‌న్‌కు సంక్షేమ ప‌థ‌కాల ల‌బ్ధిదారులు భారీ ఓటు బ్యాంక్‌గా మారార‌ని చంద్రబాబు గ్ర‌హించ‌డం వ‌ల్లే, తాను కూడా అదే మార్గం ప‌ట్టాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింద‌నే చ‌ర్చ న‌డుస్తోంది.

ఇదిలా వుండ‌గా చంద్ర‌బాబు ప్ర‌ధానంగా మ‌హిళ‌లు, నిరుద్యోగులు, రైతులను టార్గెట్ చేశారు. ప్ర‌స్తుతం ప్ర‌క‌టించిన ప‌థ‌కాల్లో ఐదింటికి అయ్యే బ‌డ్జెట్‌పై వివిధ వేదిక‌ల‌పై పెద్ద ఎత్తున లెక్క‌లేస్తున్నారు. పులివెందుల వివేక్ అనే యాక్టివిస్ట్ త‌న ఫేస్‌బుక్ ఖాతాలో వేసిన లెక్క‌ల‌ను ఒక‌సారి ప‌రిశీలిద్దాం. 18-59 ఏళ్ల మ‌ధ్య మ‌హిళ‌ల‌కు నెల‌కు రూ.1500 చొప్పున ఏడాదికి రూ.18 వేలు ఇస్తాన‌ని చంద్ర‌బాబు ప్ర‌క‌టించారు. బాబు చెప్పిన ప్ర‌కారం చంద్ర‌బాబు అధికారంలోకి వ‌స్తే ఏపీలో 1.25 కోట్ల మంది ల‌బ్ధి పొందుతారు.

నెల‌కు రూ.1500 చొప్పున లెక్కేస్తే సుమారు రూ.1900 కోట్లు నెల‌కు అవ‌స‌ర‌మ‌వుతుంది. ఈ లెక్క‌న ఏడాదికి రూ.22,500 కోట్ల బ‌డ్జెట్ కేటాయించాల్సి వుంటుంది. ఇక ఏడాదికి మూడు గ్యాస్ సిలిండ‌ర్ల విష‌యానికి వ‌స్తే కోటిన్న‌ర మంది తెల్ల‌రేష‌న్‌కార్డుదారుల‌కు సాయం అందించాల్సి వుంటుంది. సిలిండ‌ర్ రూ.850 చొప్పున మూడింటికి రూ.2500 చొప్పున రూ.3,750 కోట్లు భ‌రించాల్సి వుంటుంది.

నిరుద్యోగ భృతి కింద నెల‌కు రూ.3 వేలు చొప్పున ఇస్తామ‌ని చంద్ర‌బాబు ప్ర‌క‌టించారు. టీడీపీ గ‌ణాంకాల ప్ర‌కారం రాష్ట్రంలో 10 ల‌క్ష‌ల మందికి ప్ర‌తినెలా భృతి చెల్లించాల్సి వుంటుంది. నిరుద్యోగుల‌కు ఏడాదికి రూ.3,600 కోట్ల బ‌డ్జెట్ కేటాయించాల్సి వ‌స్తుంది. అలాగే మ‌హిళ‌ల‌కు ఆర్టీసీ బ‌స్సుల్లో ఉచిత ప్ర‌యాణ సౌక‌ర్యానికి ఏడాదికి సుమారు రూ.5 వేల కోట్లు ఖ‌ర్చు అవుతుంది. ముఖ్యంగా రైతులను ఆక‌ట్టుకునేందుకు చంద్ర‌బాబు ప్ర‌య‌త్నించారు. ప్ర‌తి రైతుకు ఏడాదికి రూ.20 వేల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా  82 లక్షల మంది రైతుల‌కు సాయం అందించాల్సి వుంటుంది. ఈ ప‌థ‌కం కింద ఏడాదికి రూ.16,500 కోట్లు ఖ‌ర్చు చేయాలి. 

గ‌తంలో చంద్ర‌బాబు ఐదేళ్ల పాల‌న‌లో రైతుల రుణాల కింద కేవ‌లం రూ.16 వేల కోట్లు మాత్ర‌మే చెల్లించారు. అలాంటిది ఇప్పుడు ఏడాదికే అంత మొత్తంలో ఇస్తాన‌ని చంద్ర‌బాబు న‌మ్మ‌బ‌లుకుతున్నారు. ఈ ఐదింటికి చంద్ర‌బాబుకు ఏడాదికి కావాల్సిన బ‌డ్జెట్ రూ.50వేల కోట్లు. ఇది కేవ‌లం మొద‌టి విడ‌త మేనిఫెస్టో మాత్ర‌మే. ద‌స‌రాకు రెండో విడ‌త మేనిఫెస్టో రిలీజ్ చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. అది ఒక రూ.50 వేల బ‌డ్జెట్‌కు త‌క్కువ కాకుండా ప‌థ‌కాల‌ను ప్ర‌క‌టిస్తారు.

అంటే సంక్షేమ ప‌థ‌కాల‌కు ప్ర‌తి ఏడాది రూ.ల‌క్ష కోట్లు చొప్పున చంద్ర‌బాబు ఖ‌ర్చు చేయ‌డానికి నిర్ణ‌యించారు. ఇవే కాకుండా ఆల్రెడీ అమ‌ల్లో ఉన్న సంక్షేమ ప‌థ‌కాల‌కు అయ్యే ఖ‌ర్చు మాటేంట‌నే ప్ర‌శ్న త‌లెత్తుతోంది. పెండింగ్ బిల్లులు, అభివృద్ధి ప‌నులు, రోడ్లు, అమ‌రావ‌తి, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం త‌దిత‌ర వాటిని ఇక శాశ్వతంగా మ‌రిచిపోవాల్సిందేనా అని వివేక్ పులివెందుల ప్ర‌శ్నిస్తూ పెట్టిన పోస్టు ఆలోచ‌న‌ల్ని రేకెత్తిస్తోంది.