ఒకసారి ఫిక్స్ అయిన తర్వాత, నేను కదలను

ఒక్కసారి ఫిక్స్ అయితే నా మాట నేనే వినను అంటాడు పండుగాడు. నేను ఒక్కసారి చెబితే వందసార్లు చెప్పినట్టే అంటాడు బాద్షా. అయితే ఇవన్నీ సినిమా డైలాగులు. వీటిని నిజజీవితంలో చేసి చూపిస్తున్నారు నిర్మాత…

ఒక్కసారి ఫిక్స్ అయితే నా మాట నేనే వినను అంటాడు పండుగాడు. నేను ఒక్కసారి చెబితే వందసార్లు చెప్పినట్టే అంటాడు బాద్షా. అయితే ఇవన్నీ సినిమా డైలాగులు. వీటిని నిజజీవితంలో చేసి చూపిస్తున్నారు నిర్మాత అభిషేక్ అగర్వాల్.

టైగర్ నాగేశ్వరారవు సినిమా తీశాడు ఈ నిర్మాత. కెరీర్ లో తొలిసారి సోలో ప్రొడ్యూసర్ గా మారి, భారీగా డబ్బు పెట్టి, రవితేజను హీరోగా పెట్టి, సక్సెస్ లేని దర్శకుడితో సినిమా తీశారు. రవితేజతో సినిమా అంటే రిస్క్ అనే విషయం అందరికీ తెలిసిందే. ధమాకాలా ఆడితే వంద కోట్లు వస్తాయి, ఆడకపోతే మరో రావణాసుర అవుతుంది.

కాబట్టి ఇలాంటి హీరో సినిమాను పోటీకి దూరంగా రిలీజ్ చేయాలని ఎవరైనా అనుకుంటారు. కానీ అభిషేక్ మాత్రం, తన సినిమాను బాలయ్య చిత్రానికి పోటీగా నిలబెట్టారు. ఎందుకింత పోటీ? చాలా డేట్స్ ఉన్నాయిగా అనే ప్రశ్నకు ఆయన చెప్పే సమాధానం ఒకటే. “నేను ఒకసారి ఫిక్స్ అయిన తర్వాత ఇక కదలను” అనేది ఆయన సమాధానం.

పెద్ద సినిమా పోటీలో ఉన్నప్పటికీ, తన సినిమా రిలీజ్ డేట్ మార్చకపోవడానికి తన మెంటాలిటీనే కారణమని పరోక్షంగా వెల్లడించారు అభిషేక్. గ్రేట్ ఆంధ్రకు ప్రత్యేకంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ఈ నిర్మాత.. సినిమా కంటెంట్ పై నమ్మకంతో, కోట్లు ఖర్చుపెట్టి బాలీవుడ్ లో కూడా రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు. రిస్క్ చేయడం తనకు 16 ఏట నుంచే అలవాటని, టైగర్ నాగేశ్వరరావును బాలీవుడ్ లో రిలీజ్ చేసి, ఓ ప్రయత్నం చేస్తున్నానని అన్నారు.