ప‌వ‌న్ పై మంచి పాయింట్ ను రైజ్ చేసిన కొడాలి!

ఉన్న‌ఫ‌లంగా రైతుల మీద ప‌వ‌న్ క‌ల్యాణ్ కు ప్రేమ పుట్టుకొచ్చింది. ఆ ప్రేమ విలువ ఎక‌రాకు ముప్పై వేలు ఇవ్వాల‌న‌డం. రాష్ట్రంలో అటు ఇటుగా 80 ల‌క్ష‌ల మంది రైతులున్నారు. వారిలో 90 శాతం…

ఉన్న‌ఫ‌లంగా రైతుల మీద ప‌వ‌న్ క‌ల్యాణ్ కు ప్రేమ పుట్టుకొచ్చింది. ఆ ప్రేమ విలువ ఎక‌రాకు ముప్పై వేలు ఇవ్వాల‌న‌డం. రాష్ట్రంలో అటు ఇటుగా 80 ల‌క్ష‌ల మంది రైతులున్నారు. వారిలో 90 శాతం మంది వేసిన పంట‌లు తుఫాన్ల‌కు, భారీ వ‌ర్షాల‌కు ప్ర‌భావితం అయ్యాయి.

మ‌రి అంత‌మందికి త‌లా ముప్పై వేలు ఇవ్వ‌డం అయినా సాధ్యం అవుతుందా?  పెట్టుబ‌డులు పెట్టింది నిజం, న‌ష్టం జ‌రిగింది వాస్త‌వం. అలాగ‌ని ప్ర‌భుత్వం వంద‌కు వంద శాతం ప‌రిహారాలు ఇవ్వ‌డం చ‌రిత్ర‌లో ఎన్న‌డూ జ‌ర‌గ‌లేదు. బ‌హుశా జ‌ర‌గ‌దు కూడా. ఎలాగూ జ‌ర‌గ‌ద‌నే ప‌వ‌న్ క‌ల్యాణ్ ఎక‌రాకో, రైతుకో ముప్పై వేల రూపాయ‌ల చొప్పున ప‌రిహారం ఇవ్వాల‌నే ఒక డిమాండ్ చేసేశారు.

అయితే జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఎంతో కొంత‌మేర రైతుల‌కు సాయం అందిస్తూ ఉంది. ఉదాహ‌ర‌ణ‌లు తీసుకుంటే.. రాయ‌ల‌సీమ‌లో వేరుశ‌న‌గ పంట భారీ వ‌ర్షాల‌కు తీవ్రంగా న‌ష్ట‌పోగా.. అక్క‌డ దున్నేసిన రైతుల‌కు ఎక‌రాకు ఆరు వేల రూపాయ‌ల చొప్పున వ‌ర‌కూ పంపిణీ జ‌రిగింది. అలాగే కోస్తాంధ్ర‌లో భారీ వ‌ర్షాల‌కు, తుఫాన్ల‌కు పంట న‌ష్ట‌పోయి రైతుల‌కు కొంత మేర ప‌రిహారాన్ని ప్ర‌భుత్వం చెల్లించింది.

పంట న‌ష్ట‌ప‌రిహారాలు, ఇన్ పుట్ స‌బ్సిడీల లెక్క‌ల‌ను తీస్తే.. అటు ఇటుగా గ‌త మూడు నెల‌ల్లోనే రెండు నుంచి మూడు వేల కోట్ల రూపాయ‌ల మొత్తాల‌ను రాష్ట్ర ప్ర‌భుత్వం రైతుల అకౌంట్ల‌లోకి బ‌దిలీ చేసింది. ఇది రైతులు న‌ష్ట‌పోయిన మొత్తాల‌తో స‌మానం కాక‌పోవ‌చ్చు. కానీ.. ఏ ప్ర‌భుత్వం అయినా ఎక‌రాకు ఐదారు వేల రూపాయ‌ల ప‌రిహారం ఇవ్వ‌డం నిజంగా అభినందించ‌ద‌గిన చ‌ర్య‌.

మ‌రోవైపు ఇదే స‌మ‌యంలో రైతు భ‌రోసా మొత్తాల‌ను కూడా ప్ర‌భుత్వం బ‌దిలీ చేసింది. ప్ర‌భుత్వం ఇచ్చే స‌బ్సిడీ విత్త‌నాలు, ఇలాంటి సాయాలు రైతుల‌కు వేన్నీళ్ల‌కు చ‌న్నీళ్లు త‌ర‌హాలోనే ఉప‌యోగ‌ప‌డ‌తాయి. ప‌వ‌న్ క‌ల్యాణ్ డిమాండ్ చేసిన‌ట్టుగా ఎక‌రాకో, రైతుకో ముప్పై వేలు చెల్లించాలంటే.. మాత్రం రాష్ట్ర ప్ర‌భత్వం రాత్రికి రాత్రి దివాళా తీయాలి!

అయినా త‌న సినిమాను కొని దివాళా తీసిన డిస్ట్రిబ్యూట‌ర్ల‌కు ప‌వ‌న్ క‌ల్యాణ్ ఎన్ని కోట్ల రూపాయ‌ల‌ను చెల్లించారో..అని ఎవ‌రైనా ప్ర‌శ్నిస్తే ఎలా ఉంటుందో, ప‌వ‌న్ క‌ల్యాణ్ చేస్తున్న ముప్పై వేల డిమాండ్ కూడా అలానే ఉంది.

ఆ సంగ‌త‌లా ఉంటే.. మంత్రి కొడాలి నాని మ‌రోసారి ప‌వ‌న్ క‌ల్యాణ్ విష‌యంలో స్పందించారు. ఘాటుగానే అయినా కొడాలి మంచి పాయింట్ ను రైజ్ చేశారు. ఇప్పుడు  రైతుల మీద ఉచితంగా ఇంత సానుభూతిని ప్ర‌ద‌ర్శిస్తున్న ప‌వ‌న్ క‌ల్యాణ్.. తెలుగుదేశం హ‌యాంలో ఏం చేశార‌నేది, అందులో కూడా అప్ప‌ట్లో చంద్ర‌బాబు నాయుడు రుణ‌మాఫీ హామీని ఇచ్చారు.

ఎన్నిక‌ల స‌మ‌యంలో చంద్ర‌బాబుతో వేదిక‌ను పంచుకున్న ప‌వ‌న్ క‌ల్యాణ్.. చంద్ర‌బాబు ఇచ్చిన హామీల త‌ర‌ఫున త‌ను పూచీ అని చెప్పుకున్నారు. తీరా అధికారంలోకి వ‌చ్చాకా చంద్ర‌బాబు నాయుడు రుణ‌మాఫీని అట‌కెక్కించారు. విడ‌త‌ల‌ వారీగా మాఫీ అంటూ అనేక మందిని ల‌బ్ధిదారులు కాద‌ని తేల్చి, మూడు సంవ‌త్స‌రాల పాటు వ‌డ్డీ మొత్తాల స్థాయిలో జ‌మ చేసి.. చేతులు దులుపుకున్నారు!

నాడు రైతుల‌కు ఎన్నిక‌ల హామీగా ఇచ్చిన విష‌యంలోనూ ఏనాడూ ప్ర‌శ్నించిన పాపాన పోలేదు ప‌వ‌న్ క‌ల్యాణ్. అలాగే అప్పుడు రైతు ఇన్ పుట్ స‌బ్సిడీలకు, పంట న‌ష్ట‌ప‌రిహారాల‌కూ పంగ‌నామాలే పెట్టినా ప‌వ‌న్ క‌ల్యాణ్ స్పందించిన దాఖ‌లాలు లేవు.

త‌ను పూచీ ప‌డ్డ ప్ర‌భుత్వం విష‌యంలో కిక్కురుమ‌న‌క‌పోవ‌డం, ఎంతో కొంత చేస్తున్న ప్ర‌భుత్వం విష‌యంలో మాత్రం ప‌వన్ క‌ల్యాణ్ క‌స్సుమంటున్నాడు.  ఈ విష‌యాల‌నే నాని ప్ర‌స్తావించారు. మ‌రి ఇలాంటి ప్ర‌శ్న‌ల‌కు ప‌వ‌న్ స‌మాధానం ఇవ్వ‌గ‌ల‌రా?