మంటల మిస్ట‌రీని ఛేదించారు!

తిరుప‌తి జిల్లా చంద్ర‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలోని శానంబ‌ట్ల‌లో కొన్ని రోజులుగా ఇళ్ల‌లో, గ‌డ్డివాముల‌కు మంట‌లు వ్యాపించ‌డం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళ‌న రేకెత్తించింది. శానంబ‌ట్ల‌లో మంట‌ల‌కు వివిధ చాన‌ళ్లు అశాస్త్రీయంగా, మూఢ విశ్వాసాల‌ను పెంచిపోషించేలా ఆజ్యం పోసే…

తిరుప‌తి జిల్లా చంద్ర‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలోని శానంబ‌ట్ల‌లో కొన్ని రోజులుగా ఇళ్ల‌లో, గ‌డ్డివాముల‌కు మంట‌లు వ్యాపించ‌డం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళ‌న రేకెత్తించింది. శానంబ‌ట్ల‌లో మంట‌ల‌కు వివిధ చాన‌ళ్లు అశాస్త్రీయంగా, మూఢ విశ్వాసాల‌ను పెంచిపోషించేలా ఆజ్యం పోసే క‌థ‌నాలు ప్ర‌సారం చేశాయి. దీంతో శానంబ‌ట్ల‌లో అస‌లేం జ‌రుగుతున్న‌దో అర్థం కాక‌పోవ‌డంతో అధికారులు దిక్కుతోచ‌ని స్థితిలో త‌ల‌లు ప‌ట్టుకున్నారు.

ఈ నేప‌థ్యంలో శానంబ‌ట్ల మంట‌ల వెనుక మిస్ట‌రీని ఛేదించేందుకు పోలీసులు గ‌ట్టి ప్ర‌య‌త్నం చేశారు. పోలీసుల ప్ర‌య‌త్నం ఎట్ట‌కేల‌కు ఫ‌లించింది. ఇది మొద‌ట ఆక‌తాయిల ప‌నిగా మొద‌లై, ఆ త‌ర్వాత వ్య‌క్తిగ‌త క‌క్ష‌ల‌ను తీర్చుకునేందుకు దారి తీసిన‌ట్టు పోలీసులు నిగ్గు తేల్చారు. శానంబ‌ట్ల‌లో మొద‌ట గ‌డ్డివామికి ఆకతాయిలు మొద‌ట నిప్పు పెట్టారు. అస‌లే ఎండా కాలం కావ‌డంతో మంట‌లు పెద్ద ఎత్తున చేల‌రేగి ప‌శువుల మేత బుగ్గిపాలైంది.

ఈ నేప‌థ్యంలో త‌న త‌ల్లి బంధువుల‌పై ప్ర‌తీకారేచ్ఛ‌తో ర‌గిలిపోతున్న కీర్తి అనే మ‌హిళ ఎదురింట్లో గ‌డ్డివామికి నిప్పు పెట్టింది. ఆ త‌ర్వాత ఎవ‌రూ గుర్తించ‌లేర‌నే ఉద్దేశంతో వ‌రుస‌గా బంధువుల ఇళ్ల‌లో నిప్పు రాజేయ‌డం కొన‌సాగించింది. ఇదే క్ర‌మంలో న‌ష్ట‌పోయిన బాధితుల‌కు ప్ర‌భుత్వం న‌ష్ట‌ప‌రిహారం అంద‌జేసింది.

దీనికి ఆశ‌ప‌డి గ్రామంలోని మ‌రో ఇద్ద‌రు త‌మ ఇళ్ల‌లో నిప్పు పెట్టుకుని ఏదో జ‌రిగిపోతోంద‌న్న‌ట్టు భ‌యాందోళ‌న‌ను క్రియేట్ చేశారు. పోలీసుల విచార‌ణ‌లో వాస్త‌వాలు వెలుగు చూడ‌డంతో కీర్తి అనే మ‌హిళ‌తో పాటు మ‌రో ఇద్ద‌రిని పోలీసులు సోమ‌వారం అరెస్ట్ చేసి మీడియా ఎదుట హాజ‌రుప‌రిచారు. మొత్తానికి శానంబ‌ట్ల మంట‌ల వెనుక ప‌గ‌, విద్వేషం దాగి ఉంద‌ని తేలిపోయింది.