తమిళంలో 1993లో వచ్చిన సినిమా చిన్న మాప్పిళ్లై. సంతాన భారతి దర్శకత్వంలో ప్రభు హీరోగా రూపొందిన ఈ సినిమా ఆ తరానికి తగ్గట్టైన కమర్షియల్ ఎంటర్ టైనర్. దాన్నే తెలుగులో చిన్నల్లుడు పేరుతో రీమేక్ చేశారు.
తెలుగులో సుమన్ హీరోగా నటించగా శరత్ దర్శకత్వంలో దాసరి నారాయణ రావు మరో ముఖ్య పాత్రలో నటించగా ఈ సినిమా రూపొందింది. తెలుగులో కూడా మ్యూజికల్ గా హిట్టైంది. కమర్షియల్ గా కూడా బాగానే ఆడిన సినిమా.
ఈ సౌత్ హిట్ సినిమాను అప్పట్లోనే బాలీవుడ్ లో గోవింద రీమేక్ చేశారు. కూలీ నంబర్ వన్ పేరుతో అప్పట్లో ఈ సినిమా రూపొందింది. తెలుగులో మరో కూలీ నంబర్ ఉంది. దాంట్లో వెంకటేష్ హీరో. తెలుగు కూలీ నంబర్ వన్ కూ హిందీ కూలీ నంబర్ వన్ కూ సంబంధం లేదు. చిన్నల్లుడు సినిమాను హిందీలో కూలీ నంబర్ వన్ గా తీశారు.
అప్పట్లో హిందీలో బ్లాక్ బస్టర్ గా నిలిచింది గోవింద నటించిన కూలీ నంబర్ వన్. పాతికేళ్ల తర్వాత దాన్ని హిందీలో రీమేక్ చేశారు. ఇప్పటికే ఎప్పుడో విడుదల కావాల్సిన ఆ సినిమా కరోనా ఆటంకంతో ఎట్టకేలకూ విడుదల అయ్యింది.
హిందీ సినిమా జనాలు కథల కొరతతో పాత సినిమాల మీద పడుతున్నారు. వాటిని రీమేక్ చేసే ట్రెండ్ కొనసాగుతూ ఉంది. అప్పటికే వేరే భాషల నుంచి రీమేక్ అయిన సినిమాలను ఇప్పుడు రీమేక్ చేస్తూ ఉండటంతో.. రెండోసారి రీమేక్ చేసినట్టుగా అవుతూ ఉంది. ప్రత్యేకించి డేవిడ్ ధావన్ కు ఇదే పని అయినట్టుంది.
90లనాటి రీమేక్ ల రాజా అయిన ఈ డేవిడ్ ధావన్ తన తనయుడిని పెట్టి అప్పటి రీమేక్ లను మళ్లీ రీమేక్ చేస్తున్నాడు. ఆ మధ్య జుద్వా రీమేక్ అయిపోయింది, ఇప్పుడు కూలీ నంబర్ వన్ రీమేక్ వచ్చింది. ఈ సినిమా పట్ల రివ్యూయర్ల నుంచి పెదవి విరుపులు తప్పడం లేదు.
ఒరిజినల్ లాగా ఉందని, అయితే దాని కన్నా దారుణంగా ఉందంటూ కొందరు చమత్కరిస్తున్నారు. అయితే .. బాలీవుడ్ లో ఈ పక్కా కమర్షియల్, మాస్, కామెడీ మసాలాలకు కాలం కొనసాగుతూ ఉంది. 90లనాటి ఈ తరహా కామెడీని ఎంజాయ్ చేసే ప్రేక్షకులు అక్కడ పుష్కలంగా కనిపిస్తున్నారు. కాబట్టి.. ఈ సినిమా కూడా హిట్ గా పరిగణ పొందే అవకాశాలు లేకపోలేదు!