పబ్లిసిటీ కాదు… క్వాలిటీ కంటెంట్ కావాలి

మన తెలుగు సినిమాలకు పబ్లిసిటీ అంటే ఓ డీఫాల్ట్ ట్రంప్లెట్ రెడీగా వుంటుంది. ఏవో కొన్ని సినిమాలకు తప్ప మిగిలిన అన్ని సినిమాలకు అదే నమూనా. సినిమా విడుదలకు నెల రోజులు ముందుగా మొదలుపెడతారు.…

మన తెలుగు సినిమాలకు పబ్లిసిటీ అంటే ఓ డీఫాల్ట్ ట్రంప్లెట్ రెడీగా వుంటుంది. ఏవో కొన్ని సినిమాలకు తప్ప మిగిలిన అన్ని సినిమాలకు అదే నమూనా. సినిమా విడుదలకు నెల రోజులు ముందుగా మొదలుపెడతారు. యూనిట్ లో ఎవరు వుంటే వాళ్లను పట్టుకొచ్చి ఇంటర్వూ పేరంటాలు పెడతారు. ఇవన్నీ యూ ట్యూబ్ లోకి వస్తాయి. ఒకటి రెండు చానెళ్లలో చూస్తారు. మిగిలిన చానెళ్లలో జస్ట్ కంటెంట్ యాడ్ అయింది అన్నట్లు వుంటుంది.

ఆ తరువాత జిల్లాల పర్యటన వుంటుంది. అలవాటైపోయిన కాలేజీలు, మాల్స్, మధ్యలో వీలైతే ఒకటి రెండు గుళ్లు గోపురాలు. వీటి వార్తలు పెద్దగా కనిపించవు. లోకల్ ఏ మూలో ప్లేస్ సంపాదించుకుంటాయి.

తరువాత ప్రీ రిలీజ్ ఫంక్షన్. అయితే వేరే ఊరు. లేదంటే సిటీలో. నీ భుజం నేను నొక్కుతా..నా భుజం నువ్వు నొక్కు అనే టైపులో వుంటాయి ప్రసంగాలు అన్నీ. యాంకర్ మారరు..మాటలు మారవు కానీ హీరో పేరు మాత్రం మారుతుంటుంది అంతే.

ఈ స్టీరియో టైప్ ప్రచారాన్ని జనం జస్ట్ ఎంటర్ టైన్ మెంట్ గా తీసుకుంటున్నారు తప్ప సినిమా మీద సీరియస్ బజ్ రావడానికి ఉపయోగపడడం లేదు అన్నది పచ్చి నిజం. అది తెలుగు రాష్ట్రాలైనా, ఇతర రాష్ట్రాలైనా. దసరా సినిమాకు నార్త్ లో ఏ రేంజ్ ప్రచారం సాగించారు. కోట్లు ఖర్చు చేసారు. ట్విట్టర్ లో మోత, యూ ట్యూబ్ లో మోత. కానీ ఓపెనింగ్ చూస్తే తెలుస్తుంది ఇదెంత వృధా ఖర్చు అన్నది.

ప్రచారం అన్నది ఓపెనింగ్ తేవాలి. లేదంటే వృధా. సినిమా కంటెంట్ బాగా లేకపోతే సినిమా నిలబడదు. అది వాస్తవం కానీ ఓపెనింగ్ రావాలి కదా..ఇంత ప్రచారం చేసినపుడు. అంటే ప్రచారంలో తేడా వుంది. బోర్ కొట్టేస్తోంది. కొత్తగా ఏదన్నా చేయడం అన్నది మానేసారు. ఓ ఫార్మాట్ కు అలవాటు పడిపోతున్నారు. మేము ఫేమస్ కు కొత్తగా ట్రయ్ చేసారు. అంతకు ముందు కూడా ఇలా డిఫరెంట్ గా చేసినవి వున్నాయి.

సినిమా బాగుంటే ధైర్యంగా జనాలకు ముందుగా చూపించడం కన్నా ఉత్తమ పబ్లిసిటీ మరోటి లేదు. మేజర్, రైటర్ పద్మభూషణ్, పెళ్లి చూపులు మరి కొన్ని సినిమాలు ఇలా చేసాయి. కానీ అలా చేయాలంటే సినిమాలో దమ్ము వుండాలి. దాని మీద నమ్మకం వుండాలి. లేదూ అలా లేనపుడు ఓపెనింగ్ తేవడానికి కొత్త పుంతలు తొక్కాలి ప్రచారం.

కానీ ఇక్కడే అసలు విషయం వుంది. కోవిడ్ తరువాత ప్రేక్షకుల వైనం మారింది. దానికి సవాలక్ష కారణాలు వున్నాయి. జీవన వ్యయం పెరిగిపోవడం అన్నది కూడా ఓ కీలకమైన విషయం. అన్ని సినిమాలకు డబ్బు పెట్టే రోజులు మారిపోయాయి. క్లాప్ కొట్టినప్పుడే ప్రేక్షకుడు డిసైడ్ అయిపోతున్నాడు. ఆ తరువాత ఆ సినిమా పోగ్రెస్ తో ప్రయాణిస్తూ, ఆ నిర్ణయాన్ని మరింత బలోపేతం చేసుకుంటున్నాడు. ఈ క్రమంలో సోషల్ మీడీయానే బలమైన పాత్ర పోషిస్తోంది తప్ప, రెగ్యులర్ మీడియా లో చేసే ప్రచారం పాత్ర అంతంత మాత్రమే.

ప్రస్తుతం టాలీవుడ్ చేస్తున్న సంప్రదాయ, రెగ్యులర్ ఫార్మాట్ ప్రచారం మహా అయితే హైదరాబాద్ టాలీవుడ్ సర్కిల్ లో వున్న ఓ పదివేల మందికి, కాదూ అంటే ఫ్యాన్స్ కమ్యూనిటీ వరకు రీచ్ అవుతోంది. కానీ వారు కూడా దీన్ని రెగ్యులర్ కార్యక్రమంగానో, ఎంటర్ టైన్ మెంట్ గానో చూస్తున్నారు తప్ప వేరు కాదు. ప్రతి శుక్రవారం సినిమా చూసే అలవాటు వున్నవారికి అస్సలు ఏ అప్ డేట్, ఏ ఇంటర్వూ, ఏ ప్రచారం అక్కరలేదు.

బిజీ బిజీ బతుకులు అయిపోయిన కాలంలో సినిమా ప్రచారం కింద వరకు వెళ్లడం లేదు. ప్రేక్షకుల హృదయాలను తాకడం లేదు. రెండు రకాల సినిమాలు మాత్రమే ఆడుతున్నాయి. ముందుగానే ఈ సినిమా చూడాలని ప్రేక్షకులు వారంతట వారు డిసైడ్ అయినవి. లేదా విడుదలయిన తరువాత బాగుంది అని టాక్ తెచ్చుకున్నవి. యావరేజ్..ఓకె..చల్తా ఇలాంటి సినిమాలకు శనివారం నాడే భవిష్యత్ వుండడం లేదు. ఓటిటి కి ఫిక్స్ అయిపోతున్నారు.

విక్రమ్ లాంటి సినిమా ఏ హడావుడి లేకుండా వచ్చింది తెలుగు లోకి. బిచ్చగాడు2 సినిమా అయితే అస్సలు ఏ కలర్ లేకుండా వచ్చింది తెలుగులోకి. సర్ సినిమాను తెలుగు మీడియా పెదవి విరిచింది. ధనుష్ తెలుగులో ఒక్క ఇంటర్వూ ఇచ్చింది లేదు. కానీ సినిమా ఆడేసింది.

అంటే ఇక్కడ మూడు పాయింట్లు.

1.ప్రాజెక్టు మీద ప్రేక్షకులకు మొదటి నుంచీ ఆసక్తి వుండాలి.

2.ఆ ప్రాజెక్ట్ కచ్చితంగా బాగా వస్తోందన్న ఫీల్ జనరేట్ కావాలి.

3. సినిమా కచ్చితంగా బాగుండాలి. వంకలు చెప్పుకుంటూ, తమని తాము డిఫెండ్ చేసుకుంటే సరిపోదు. మనం కాదు ప్రేక్షకులు కన్విన్స్ కావాలి.

ఇలా అయితే తప్ప భవిష్యత్ లో సినిమాలు బతికి గట్టెక్కడం కష్టం. కేవలం ట్రంప్లెట్ ప్రచారంతో, డీఫాల్ట్ ఎజెండా పబ్లిసిటీతో జనాలను థియేటర్ కు రప్పించలేరు.