ఏపీని మరోసారి మేనిఫెస్టో పేరుతో వెన్నుపోటు పొడిచేందుకు టీడీపీ కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా ఈ నెల 27 నుంచి రాజమండ్రిలో నిర్వహించే మహానాడులో తొలి మేనిఫెస్టో విడుదలకు టీడీపీ సిద్ధం చేస్తోంది. ఈ మేనిఫెస్టోలో మహిళలు, రైతులు, యువతకు అగ్రస్థానం కల్పించేందుకు, వారికి మేలు కలిగించే అంశాల్ని చేరుస్తారని సమాచారం. గెలుపోటములను మహిళలు, యువత, రైతులు డిసైడ్ చేస్తారని చంద్రబాబు నమ్ముతున్నారు.
ఈ నేపథ్యంలో తొలి మేనిఫెస్టోలో ఈ మూడు వర్గాల సమస్యలు, వాటి పరిష్కారానికి టీడీపీ ప్రభుత్వం వస్తే ఏం చేయనుందో అన్ని రకాలుగా ఆలోచించి ముసాయిదా పత్రం రూపొందించే పనిలో టీడీపీ మేనిఫెస్టో కమిటీ మునిగితేలుతోంది. అయితే 2014లో టీడీపీ మేనిఫెస్టో, ఆ తర్వాత ఆ పార్టీ వెబ్సైట్ నుంచి తొలగించడం తదితర అంశాలు తెరపైకి వచ్చాయి.
గతంలో కూడా ఇలాగే అన్ని వర్గాలకు ఆచరణ సాధ్యం కాని హామీలను ఇచ్చి, చివరికి చేతులెత్తేసిన సంగతి తెలిసిందే. రైతుల రుణమాఫీ, అలాగే బ్యాంకుల్లో కుదవపెట్టిన బంగారాన్ని సైతం తీసుకొస్తానని అప్పట్లో చంద్రబాబు నమ్మబలికారు. ఐదు విడతల్లో రైతుల రుణమాఫీ చేస్తానని చెప్పి, మూడు విడతలు వేసి, ఆ తర్వాత ఎగనామం పెట్టారు. ఇక బ్యాంకుల్లో కుదవ పెట్టిన బంగారాన్ని ఇంటికి తీసుకురావడం గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది.
ఇక మహిళలకు సంబంధించి డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తానని చెప్పి, వారిని ముంచారు. అలాగే వనజాక్షి లాంటి మహిళా అధికారులతో పాటు సామాన్య స్త్రీలపై దాడులు పెచ్చుమీరాయి. బాబు పాలనంటే మహిళలు వణికిపోయే పరిస్థితి. బాబు వస్తే జాబొస్తుందని పెద్ద ఎత్తున టీడీపీ ప్రచారం చేసింది. చివరికి బాబు అధికారంలోకి వచ్చినప్పటికీ, ఆయన కుమారుడు లోకేశ్‌కు మాత్రమే మంత్రిత్వ జాబొచ్చింది. ఒకవేళ ఉద్యోగాలు ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అది కూడా అమలుకు నోచుకోలేదు.
ఎన్నికలకు కేవలం ఐదారు నెలల ముందు నిరుద్యోగులకు నెలకు రూ.1000 చొప్పున, అది కూడా 10 లక్షల మందికి మాత్రమే ఇచ్చారు. ఇదంతా నాటి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో జరిగింది. ఉద్యోగాలు ఇవ్వండయ్యా సామి అంటే నెలకు రూ.వెయ్యి చొప్పున తెలుగుదేశం కార్యకర్తలకు ఇచ్చి మమ అనిపించారు.
ఇవే చంద్రబాబు ఘోర పరాజయానికి కారణాలయ్యాయి. ఇప్పుడు మళ్లీ మహిళలు, యువత, రైతులంటూ మోసగించడానికి టీడీపీ సిద్ధమవుతోంది. మేనిఫెస్టోలో ఆకర్షణీయమైన నినాదాలతో మోసగించడానికి ఏపీ ప్రజానీకం ముందుకొస్తోంది. అప్రమత్తంగా ఉండాల్సింది ప్రజలే. లేదంటే మరోసారి గతంలో చంద్రబాబు పాలనలో ఎదుర్కొన్న కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది.