తమ రాష్ట్రంలో అవసరానికి తగ్గట్టుగా బీఫ్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని బీఫ్ వ్యాపారంలోని ఏజెంట్లకు ఆదేశించారు గోవా సీఎం ప్రమోద్ సావంత్. రాష్ట్రంలో అవసరానికి తగ్గట్టుగా గొడ్డు మాంసం లభ్యత ఉండాల్సిందేనని ఆయన స్పష్టతను ఇచ్చారు.
ఇందుకు సంబంధించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పక్క రాష్ట్రం కర్ణాటక నుంచి గోవాకు రెగ్యులర్ గా బీఫ్ ఎగుమతి ఉండేది. అయితే కర్ణాటకలో బీఫ్ ఎగుమతి పట్ల కఠినంగా వ్యవహరిస్తూ ఉన్నారు.
ఈ నేపథ్యంలో గోవాకు బీఫ్ లభ్యత తగ్గిందట. ప్రస్తుతం కేరళ నుంచి కొంత, ఢిల్లీ నుంచి మరికొంత బీఫ్ దిగుమతి అవుతోందట గోవాకు. అయితే ఆ రాష్ట్రాల నుంచి వస్తున్న స్టాక్ సరిపోవడం లేదని.. డిమాండ్ కు అనుగుణంగా బీఫ్ లభ్యత పెంచేందుకు సీఎంగారు ప్రణాళికలు రచిస్తూ ఉన్నారు.
మాంసం ఎగుమతికి వేరే రాష్ట్రాల నుంచి ఆంక్షలు ఉన్న నేపథ్యంలో.. బతికి ఉన్న జంతువులనే తీసుకురావాలని కూడా బీఫ్ అమ్మకం దార్లకు ముఖ్యమంత్రే సలహా ఇస్తున్నారు. బతికి ఉన్న జంతువులనే బయటి రాష్ట్రాల నుంచి తెచ్చి, గోవాలో బీఫ్ సిద్ధం చేయాలనేది ఈ బీజేపీ ముఖ్యమంత్రి సలహా! తమ రాష్ట్రంలో బీఫ్ కొరతను తీర్చేందుకు తను కట్టుబడి ఉన్నట్టుగా ఆయన స్పష్టం చేశారు.