కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టడంతో సినిమా షూటింగులు ఊపందుకుంటున్నా.. కొన్ని సినిమాలకు అర్ధాంతర బ్రేకులు అయితే తప్పడం లేదు. ఇప్పుడు ఈ జాబితాలో చేరింది తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా. రాజకీయల్లోకి ఎంట్రీ ముందే ఈ సినిమా షూటింగును పూర్తి చేయాలన్న టార్గెట్ పెట్టుకున్న రజనీకాంత్ కు అనూహ్యంగా బ్రేక్ పడింది.
ఈ సినిమా యూనిట్ లో పలువురు కరోనా బారిన పడినట్టుగా సమాచారం. వారికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో రజనీకాంత్ కూడా సెల్ఫ్ ఐసొలేషన్ కు వెళ్లినట్టుగా తెలుస్తోంది. కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిన వ్యక్తులు షూటింగ్ సమయంలో రజనీకి దగ్గర దగ్గరగానే మెలిగారట. ఈ నేపథ్యంలో రజనీకాంత్ కూడా ఐసొలేషన్ లోకి వెళ్లినట్టుగా తెలుస్తోంది.
ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లోనే జరుగుతూ ఉంది. ఇప్పుడు కరోనాతో బ్రేక్ తో ఈ సినిమా షెడ్యూల్ పై ప్రభావం పడే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ సినిమాకు సంబంధించి ఏకంగా నెలన్నర పాటు షూటింగ్ చేసి, ఆ తర్వాత పొలిటికల్ యాక్టివిటీస్ వైపు వెళ్లేలా ప్లానేసుకున్నట్టున్నారు రజనీకాంత్. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ఐదు నెలల వరకూ సమయం ఉంది. ఈ లోపే ఈ సినిమా షూటింగ్ ను రజనీ పూర్తి చేయాల్సి ఉన్నట్టే.
అందుకే కరోనా పరిస్థితులు పూర్తి స్థాయిలో సద్దుమణగకపోయినా రజనీకాంత్ సెట్స్ మీదకు వచ్చారు. యూనిట్లో ఇప్పుడు కొందరు కరోనాకు గురి కావడంతో సినిమా షూటింగ్ మొత్తం ఆగిపోయే పరిస్థితి వచ్చినట్టుంది. ఈ బ్రేక్ తో ఆటు సినిమా షూటింగ్ లేట్ కావడమే కాదు, రజనీకాంత్ పొలిటికల్ యాక్టివిటీస్ కూడా కాస్త లేటయ్యేలా ఉన్నట్టున్నాయి.