అమరావతిలో పేద ప్రజలకు ఇళ్ల పట్టాలు ఇచ్చుకోవచ్చు. కానీ తుది తీర్పునకు లోబడి వుంటుంది. విక్రయ హక్కులు తుది తీర్పునకు లోబడే వుంటాయి.
ఇదీ స్థూలంగా కోర్టు తీర్పు.
వైకాపా అనుకూల మీడియా సహజంగానే జగన్ కు అనుకూలంగా వచ్చిందని సంబరపడింది.
తేదేపా అనుకుల మీడియా సహజంగానే ఏ హక్కులు లేని పట్టాలు ప్రజలకు ఎందుకు అంటూ పెదవి విరిచింది.
కానీ ఈ తీర్పు ను సూక్ష్మంగా పరిశీలిస్తే జగన్ నెత్తిన పాలు పోసినట్లే. ఎందుకు? తేదేపా అనుకుల మీడియా ఏమంటోంది? 48 వేల మందిని మంగళగరి నియోజకవర్గంలోకి తీసుకువచ్చి లోకేష్ ను ఓడించడానికి కుట్ర పన్నుతున్నారు అంటోంది. అంతే కాదు, కీలకమైన ఎలక్ట్రానిక్ సిటీ కోసం కేటాయించిన చోట పేదలకు పట్టాలు ఇస్తున్నారు, దాని వల్ల అమరావతి అందం పోతుంది అంటోంది.
తీర్పు వచ్చిన తరువాత ఏం జరుగుతుంది. 48 వేల మందికి పట్టాలు ఇస్తారు. జగన్ పంతం కోసం అయినా సిమెంట్ రూపేణా లేదా నగదు రూపేణా సహాయం అందించి ఇళ్లు నిర్మింపచేస్తారు. కానీ ఆ జనాలందరికీ ఓ భయం వెన్నాడుతూనే వుంటుంది. కోర్టు తీర్పు తమకు అనుకూలంగా రాకపోతే ఆ ఇళ్లన్నీ ఖాళీ చేసి వెళ్లిపోవాలనే భయం. కోర్టు తీర్పు సంగతి అలా వుంచితే తెలుగుదేశం ప్రభుత్వం వస్తే తమను వెళ్లగొడుతుందేమో అన్న భయం. అందువల్ల కచ్చితంగా ఆ ఓట్లు వైకాపాకు అనుకూలంగానే వుంటాయి.
అదే కనుక కోర్టు తీర్పు మరోలా వుండి, ఈ 48వేల మందికి శాశ్వత హక్కులు వస్తే, వారికి నచ్చిన వారికి ఓటు వేసుకుంటారు. జగన్ కే వేయాలని లేదు. చంద్రబాబుకు కూడా వేసుకోవచ్చు. జగన్ తో పని అయిపోతుంది కదా? కానీ ఇప్పుడు ఈ తీర్పు అటు ఇటు కాకుండా వారిని ఆపుతుంది. తమ ఇళ్ల కోసం జగన్ వెంటే వుండి తీరాలి. తేదేపా అనుకూల మీడియా ఆరోపిస్తున్నట్లు జగన్ నిజంగా లోకేష్ ఎన్నిక కుట్ర పన్ని వుంటే అది పక్కా సక్సెస్ అవుతుంది ఈ తీర్పు వల్ల.
పైగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఏమీ మాట్లాడలేదు. ఎన్నికల టైమ్ లో కూడా ఈ నలభై ఎనిమిది వేల మందికి ఎలాంటి హామీ ఇవ్వలేదు. అందువల్ల ఈ తీర్పు జగన్ కు భలే కలిసి వస్తుంది. ఒక వేళ జగన్ పవర్ లోకి రాలేదు అనుకుందాం. అప్పుడు కూడా తెలుగుదేశం ఏమీ చేయలేదు. ఇళ్లు కట్టేసుకున్న 48వేల మందిని అక్కడి నుంచి తరలించడం అంటే ఆషా మాషీ విషయం కాదు. కోర్టులో వీరికి అనుకూలంగానే తేదేపా పోరాడాల్సి వుంటుంది.