తిరుప‌తిపై వెన‌క్కి త‌గ్గిన సోము వీర్రాజు

జ‌న‌సేన దెబ్బ‌కు బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు సోము వీర్రాజు వెన‌క్కి త‌గ్గారు. తిరుప‌తి పార్ల‌మెంట్ అభ్య‌ర్థి ఎవ‌ర‌నే విష‌యంలో సోము వీర్రాజు తాజాగా బీజేపీనే అని ధైర్యంగా చెప్ప‌లేక‌పోతున్నారు. బీజేపీ అంటే అధికారంలో ఉన్న…

జ‌న‌సేన దెబ్బ‌కు బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు సోము వీర్రాజు వెన‌క్కి త‌గ్గారు. తిరుప‌తి పార్ల‌మెంట్ అభ్య‌ర్థి ఎవ‌ర‌నే విష‌యంలో సోము వీర్రాజు తాజాగా బీజేపీనే అని ధైర్యంగా చెప్ప‌లేక‌పోతున్నారు. బీజేపీ అంటే అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు భ‌య‌ప‌డు తుంటే, జ‌న‌సేన మాత్రం లెక్క‌చేయ‌డం లేదు.

ప‌ది రోజుల క్రితం తిరుప‌తిలో బీజేపీ అగ్ర‌నాయ‌కులు శోభాయాత్ర నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆ పార్టీ రాష్ట్ర ర‌థ‌సార‌థి సోము వీర్రాజు మాట్లాడుతూ తిరుప‌తి ఉప ఎన్నిక‌లో బీజేపీనే నిలుస్తుంద‌ని ప్ర‌క‌టించారు. 

జ‌న‌సేన బ‌ల‌ప‌రిచే త‌మ అభ్య‌ర్థికే ఓటు వేయాల‌ని ఆయ‌న అభ్య‌ర్థించారు. బీజేపీ పోటీ చేస్తుంద‌ని, జ‌న‌సేన మ‌ద్ద‌తు ఇస్తుంద‌ని క‌లియుగ దైవం శ్రీ‌వేంక‌టేశ్వ‌ర స్వామి పాదాల చెంత సోము వీర్రాజు ప్ర‌క‌టించి, ఇప్పుడేమో ఆ ఊసే ఎత్త‌డం లేదు.

బీజేపీనే తిరుప‌తిలో పోటీ చేస్తుంద‌ని సోము వీర్రాజు ప్ర‌క‌ట‌న‌పై తిరుప‌తి జ‌న‌సేన నాయ‌కులు మండిప‌డ్డారు. తిరుప‌తిలో క‌నీసం నోటాకు వ‌చ్చిన‌న్ని ఓట్లు కూడా బీజేపీకి రాలేద‌ని జ‌న‌సేన నాయ‌కులు అవ‌హేళ‌న చేశారు. 

బీజేపీనే పోటీ చేస్తుంద‌నేది సోము వీర్రాజు వ్య‌క్తిగ‌త అభిప్రాయ‌మ‌ని జ‌న‌సేన నాయ‌కులు అన్నారు. తిరుప‌తిలో అభ్య‌ర్థి ఎవ‌ర‌నేది ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు న‌డ్డి క‌లిసి నిర్ణ‌యిస్తార‌ని జ‌న‌సేన నేత‌లు తేల్చి చెప్పారు.

ఈ నేప‌థ్యంలో చిత్తూరు జిల్లా ప‌ర్య‌ట‌న‌లో ఉన్న సోము వీర్రాజు వైఖ‌రిలో స్ప‌ష్ట‌మైన మార్పు క‌నిపిస్తోంది.  మ‌ద‌న‌ప‌ల్లెలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ తిరుప‌తి ఉప ఎన్నిక‌పై త‌మ పార్టీ, జ‌న‌సేన ఇంకా మాట్లాడుకుంటున్నాయ‌న్నారు. 

త‌మ‌లో ఎవ‌రో ఒక‌రు అభ్య‌ర్థిగా ఉంటార‌ని ఆయ‌న చెప్పారు. ఎవ‌రో ఒక‌రు మాత్ర‌మే పోటీలో ఉంటార‌ని సోము వీర్రాజు ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేద‌ని, అది అంద‌రికీ తెలుసున‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

కానీ ప‌ది రోజుల క్రితం జ‌న‌సేన‌ను అస‌లు ప‌రిగ‌ణ‌లోకి తీసుకోకుండా ఏకంగా తామే పోటీ చేస్తామ‌ని ప్ర‌క‌టించిన బీజేపీ ర‌థ‌సా ర‌థి, తాజాగా యూట‌ర్న్ తీసుకోవ‌డంపై చ‌ర్చ జ‌రుగుతోంది. జ‌న‌సేన‌కు బీజేపీ భ‌య‌ప‌డిందా? అనే అనుమానాలు త‌లెత్తు తున్నాయి. 

ఏది ఏమైనా త‌మ దెబ్బ‌కు సోము వీర్రాజు వెన‌క్కి త‌గ్గి మాట్లాడ్డంపై జ‌న‌సేన శ్రేణులు ఆనందం వ్య‌క్తం చేస్తున్నాయి. కాగా జ‌న‌సేన ఇగోను సంతృప్తిప‌ర‌చ‌డానికే త‌మ నాయ‌కుడు అలా మాట్లాడుతున్నారే త‌ప్ప‌, పోటీ చేసేది మాత్రం బీజేపీనే అని ఆ పార్టీ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు తేల్చి చెబుతుండ‌డం గ‌మ‌నార్హం. 

ప‌చ్చ మీడియా ప‌గ‌టి క‌ల‌లు