లైకాపై ఈడీ కన్ను.. కోలీవుడ్ లో టెన్షన్

మొన్నటికిమొన్న మైత్రీ మూవీ మేకర్స్ ఆఫీసులు, ఇళ్లపై ఐటీ దాడులు చేసింది. ఇప్పుడు లైకా ప్రొడక్షన్స్ వంతు. భారీ చిత్రాలు నిర్మించే ఈ సంస్థపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్-ఈడీ కన్నేసింది. ఈరోజు ఉదయం నుంచి…

మొన్నటికిమొన్న మైత్రీ మూవీ మేకర్స్ ఆఫీసులు, ఇళ్లపై ఐటీ దాడులు చేసింది. ఇప్పుడు లైకా ప్రొడక్షన్స్ వంతు. భారీ చిత్రాలు నిర్మించే ఈ సంస్థపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్-ఈడీ కన్నేసింది. ఈరోజు ఉదయం నుంచి అన్ని లైకా ఆఫీసులతో పాటు, వాళ్లకు సంబంధించిన ఇళ్లపై ఈడీ అధికారులు దాడులు చేశారు.

రీసెంట్ గా పొన్నియన్ సెల్వన్-2 చిత్రాన్ని రిలీజ్ చేసింది లైకా ప్రొడక్షన్స్ సంస్థ. తమిళనాట, ఓవర్సీస్ లో ఆ సినిమాకు భారీ వసూళ్లు వచ్చాయి. మరోవైపు కమల్ హాసన్ హీరోగా ఇండియన్-2, రజనీకాంత్ అతిథి పాత్రలో లాల్ సలామ్ చిత్రాల్ని నిర్మిస్తోంది. మరో 2 సినిమాలు కూడా లైన్లో ఉన్నాయి.

ఇలా భారీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన లైకాపై ఈడీ ఆకస్మికంగా దాడులు చేసింది. మనీ లాండరింగ్ కు సంబంధించి ఈ కంపెనీపై ఆరోపణలు ఉన్నాయని చెబుతున్నారు ఈడీ అధికారులు. చెన్నైలోని లైకా ప్రొడక్షన్స్ ఆఫీసులతో పాటు.. మరో 8 నివాసాలపై ప్రస్తుతం ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.

ప్రస్తుతం ఇండియన్-2 సినిమా సెట్స్ పై ఉంది. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి నిన్ననే కొత్త షెడ్యూల్ మొదలైంది. అటు లాల్ సలామ్ సినిమా కూడా షూటింగ్ జరుపుకుంటోంది. తాజా దాడుల ప్రభావం ఈ రెండు సినిమాలపై పడనుంది. ఈడీ సోదాలకు అసలైన కారణాలేంటనేది ప్రస్తుతానికి తెలియరాలేదు.