చేచేతులా చేసుకుంటున్న థమన్?

తెలుగులో ఎంత మంది మ్యూజిక్ డైరక్టర్లు వున్నా, పక్క భాషల నుంచి ఎంత మంది వస్తున్నా కూడా థమన్ మార్కెట్ ఏమీ పడిపోలేదు. థమన్ ఫుల్ బిజీగానే వున్నారు. కానీ అదే సమయంలో థమన్…

తెలుగులో ఎంత మంది మ్యూజిక్ డైరక్టర్లు వున్నా, పక్క భాషల నుంచి ఎంత మంది వస్తున్నా కూడా థమన్ మార్కెట్ ఏమీ పడిపోలేదు. థమన్ ఫుల్ బిజీగానే వున్నారు. కానీ అదే సమయంలో థమన్ తన వర్క్ మీద గట్టిగా దృష్టి పెట్టడం లేదని ఇండస్ట్రీ సర్కిళ్లలో విపరీతంగా వినిపిస్తోంది. సోషల్ మీడియా లో కూడా థమన్ గట్టిగా ట్రోలింగ్ కు గురవుతున్నారు. నిర్మాతలు కూడా రాను రాను థమన్ వ్యవహారశైలితో కిందా మీదా అవుతున్నారు.

ప్రతి ట్రయిలర్ అవుట్ పుట్ లాస్ట్ మినిట్ వరకు ఇవ్వడం లేదు. ఇంకా చెప్పాలంటే కాస్త ఆలస్యంగానే ఇస్తున్నారు. దాంతో పోని క్వాలిటీ కోసం సర్దుకోవచ్చు అనుకుంటే, అలా ఇచ్చిన ప్రొడెక్ట్ మీద కాపీ మార్క్ పడుతోంది. నిన్నటికి నిన్న భగవంత్ కేసరి విషయంలో అలాగే జరిగింది. 

విక్రమ్ సినిమా ను ప్రభావితమై బ్రో సినిమాకు ఆర్ఆర్ అందించడానికి విమర్శ వినిపిస్తే, అది బ్రో మ్యూజిక్ ను అటు ఇటు చేసి భగవంత్ కేసరి ట్రయిలర్ కు అందించాడని వీడియోలు కట్ చేసి మరీ రుజవుచేసారు.

స్కంద‌ సినిమాకు బ్యాక్ గ్రవుండ్ స్కోర్ విషయంలో థమన్ మీద గట్టి క్రిటిసిజమ్ వచ్చింది. బోయపాటి కూడా ఈ విషయంలో స్పందించారు. థమన్ వర్క్ అప్ టు ది మార్క్ లేదని తన దృష్టికి కూడా చాలా మంది తీసుకువచ్చారని అన్నారు. ఆర్ఆర్ చేయడానికి ముందో, తరువాతో స్కంద‌ నిర్మాత చిట్టూరి శ్రీను కు థమన్ కు మధ్య చిన్న గడబిడ కూడా జరిగిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇది వర్క్ గురించి కాదని, థమన్ ఎక్కడో ఏదో అన్నారనే వార్తలు రావడంతో ఇలా జరిగిందని టాక్ వుంది.

ఇప్పుడు థమన్ చేతిలో భగవంత్ కేసరి వుంది. ఆ తరువాత గుంటూరు కారం వుండనే వుంది. ఈ రెండింటి విషయంలో ప్రూవ్ చేసుకోవాలి. ఇవి కాక ఆ తరువాత వచ్చే భారీ సినిమా గేమ్ ఛేంజర్ వుంది. ఇంకా చాలా వున్నాయి. కానీ భగవంత్ కేసరి, గుంటూరు కారం ప్రూవ్ చేసుకోక ట్రోలింగ్ గు గురయితే మాత్రం, చేతిలోకి వచ్చిన సినిమాల సంగతి సరే, ఆ తరువాత ఇక టాలీవుడ్ మొహం చాటేసే ప్రమాదం వుంది. ఇప్పటికే చాలా మంది హీరోలు థమన్ ను పక్కన పెట్టేసారు.

ఇదంతా థమన్ చేజేతులా చేసుకుంటున్నట్లు కనిపిస్తోంది. ఎందుకంటే థమన్ మనసు పెట్టి వర్క్ చేస్తే ఎలా వుంటుందో ఇప్పటికే చాలా సార్లు ప్రూవ్ అయింది. కానీ ఇప్పుడు అలాంటి మంచి అవుట్ పుట్ రావడం లేదు అంటే, థమన్ లోపం తప్ప వేరెవరిదీ కాదనే అనుకోవాలి.