విశాఖ కొత్తగా ముస్తాబు అవుతోంది. సహజ సిద్ధమైన ప్రకృతి అందాలకు తోడు మరింతగా సింగారించుకుంటోంది. విశ్వవేదిక మీద తనను తాను చూసుకోవడానికి ఈ ముస్తాబు అని చెప్పాలి. అత్యంత ప్రతిష్టాత్మకకంగా ప్రతీ రెండేళ్లకు భారత నావికాదళం మిలాన్ పేరిట నిర్వహించే అంతర్జాతీయ నౌకాదళ విన్యాసాలకు విశాఖ సిద్ధమైంది.
వారం రోజుల పాటు విశాఖలో జాతరే జాతరగా ఉంటుంది. అదే విధంగా ఈ నెల 27న జరిగే అతి ముఖ్యమైన కార్యక్రమమైన అంతర్జాతీయ కవాతు ప్రత్యేక ఆకర్షణగా ఉంటోంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హాజరవుతున్నారు.
మొత్తం నలభై దేశాలకు చెందిన నావికాదళ సిబ్బంది విశాఖ బీచ్ రోడ్డులో నిర్వహించే అంతర్జాతీయ కవాతుని జగన్ నేరుగా వీక్షిస్తారు. ఇక అదే రోజున నావికాదళ సత్తాను చాటే అద్భుత విన్యాసాలు కూడా సాగుతాయి. కేవలం భారత్ మాత్రమే కాకుండా ఇతర దేశాల నుంచి వచ్చే యుద్ధ నౌకలు, హెలికాప్టర్లు, విమానాలు వంటివి సాగర తీరంలోనూ గగన తళంలోనూ సాహసాలు చేస్తూ కనువిందు చేస్తాయి.
ఇతర దేశాలతో కలసి భారత నావికాదళం నిర్వహించే సంయుక్త విన్యాసాలు అందరికీ ఆకట్టుకుంటాయి. వీటిని వీక్షించేందుకు విశాఖ సాగరతీరం లక్షలాది మంది జనంతో పోటెత్తనుంది. మొత్తానికి విశాఖలో మిలాన్ నిర్వహించడం కాదు కానీ ఎక్కడ లేని కళలూ కాంతులూ నగరంలో కనిపిస్తున్నాయి.