అవును.. ఏపీ ప్రభుత్వం పరువు తీస్తున్నారు!

భీమ్లా నాయక్ సినిమా రిలీజైంది. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ మినహా మిగతావారికి ఇదేమంత పెద్ద విశేషం కాదు. మిగతా వారంతా ఎవరి పనికి వారు వెళ్తారు. పోలీసులు, రెవెన్యూ ఉద్యోగులు, ఇతర అధికారులు అంతా…

భీమ్లా నాయక్ సినిమా రిలీజైంది. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ మినహా మిగతావారికి ఇదేమంత పెద్ద విశేషం కాదు. మిగతా వారంతా ఎవరి పనికి వారు వెళ్తారు. పోలీసులు, రెవెన్యూ ఉద్యోగులు, ఇతర అధికారులు అంతా ఎవరి పని వారు చేసుకుంటుంటారు. కానీ ఈసారి మాత్రం లెక్క తప్పింది. పోలీసులు సినిమా థియేటర్ల వద్ద కాపలాకి వచ్చారు. 

ఎమ్మార్వో, రెవెన్యూ ఇన్స్ పెక్టర్, వీఆర్వో.. ఇలా రెవెన్యూ ఉద్యోగులు కూడా 2 రోజుల మందుగానే థియేటర్ల దగ్గరకు వచ్చి టికెట్ రేట్లు పెంచి అమ్మకూడదంటూ వార్నింగ్ ఇచ్చి వెళ్లారు. అక్కడితో ఆగలేదు. సినిమా విడుదల రోజు కూడా వీరి హంగామా ఓ రేంజ్ లో ఉంది. ఎమ్మార్వోలకి, వీఆర్వోలకి, పోలీసులకు అసలు సినిమా థియేటర్ల వద్ద ఏం పనంటూ జనం అసహ్యించుకునే వరకు వెళ్లింది పరిస్థితి.

సోషల్ మీడియాలో ఉతికి ఆరేశారు..?

సీఎం జగన్ నేరుగా అధికారులకు చెప్పారా..? లేదా అధికారులే తమకి పవన్ కల్యాణ్, ఆయన అభిమానులు శత్రువులు అనుకున్నారో తెలియదు కానీ.. భీమ్లా నాయక్ కి వ్యతిరేకంగా పనిచేయడమే తమ పని అనుకున్నట్టు ఉన్నారు రెవెన్యూ, పోలీస్ డిపార్ట్ మెంట్ ఉద్యోగులు. సినిమా థియేటర్ల వద్ద టికెట్ రేట్లు పెంచి అమ్మితే మాకు తెలియజేయండి అంటూ ఎమ్మార్వో, వీఆర్వో ఫోన్ నెంబర్లు రాసి మరీ వెళ్లారు.

ఎక్కడైనా అన్యాయం, అవినీతి జరిగితే మాకు తెలియజేయండి అంటూ ఏనాడైనా వీఆర్వో కానీ, ఎమ్మార్వో కానీ ఫోన్ నెంబర్ రాసి వెళ్లిన ఉదంతాలు ఉన్నాయా..? మరీ చీప్ గా సినిమా థియేటర్ ముందు ఈ సీన్ ఏంటి..? సోషల్ మీడియా దీన్ని నిలదీసింది, కడిగేసింది, చెడామడా వాయించేసింది, ప్రభుత్వాన్ని ఏకి పారేస్తోంది.

ఉక్రెయిన్ వెళ్లిన విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందొద్దంటూ ప్రభుత్వం ఓ హెల్ప్ డెస్క్ ని ప్రారంభించి దానికి సంబంధించిన ఓ ట్వీట్ వేస్తే… రిప్లై ఏమొచ్చిందో తెలుసా..? అయ్యా మా ఊరి థియేటర్ కి ఇంకా వీఆర్వో, ఎమ్మార్వో రాలేదు, అర్జెంట్ గా పంపించండి, ఉక్రెయిన్ సమస్య మనకి ముఖ్యమా..? భీమ్లా నాయక్ సంగతి చూడండి అంటూ ఓ నెటిజన్ ఆటాడేసుకున్నాడు. రెవెన్యూ శాఖ ఉద్యోగులు ఆఫీస్ లో అందుబాటులో లేకపోతే ఆందోళన చెందకండి.. నేరుగా సినిమా థియేటర్ దగ్గరకు రండి, క్యూలైన్లు చెక్ చేస్తున్న మీ ఎమ్మార్వో మీకు అందుబాటులోకి వస్తారు.. సామాన్య ప్రజానీకానికి ఓ నెటిజన్ ఇచ్చిన సలహా ఇది.

ఎమ్మార్వో గారూ.. మా సీట్లో నల్లులున్నాయి, వీఆర్వో గారూ, కూల్ డ్రింక్ చల్లగా లేదని, ఫ్యాన్ గాలి రావడం లేదని.. ఇలా రకరకాలుగా కంప్లయింట్లు ఇస్తున్నట్టు.. వారి కంప్లయింట్ లకి రెవెన్యూ అధికారులు తలలు పట్టుకున్నట్టు మీమ్స్ వదులుతున్నారు. అసలు పని వదిలేసి థియేటర్ల దగ్గర మనకీ ఖర్మ ఏంటని రెవెన్యూ, పోలీస్ అధికారులు తలలు పట్టుకున్నట్టు, జగన్ ని తిట్టుకుంటున్నట్టు కార్టూన్లు క్రియేట్ చేస్తున్నారు. అందులోనూ సినిమాకి హిట్ టాక్ రావడంతో అభిమానులు మరింత ఉత్సాహంగా అధికారులకు వ్యతిరేకంగా ట్రోలింగ్ మొదలు పెట్టారు.

సినిమా హాల్లోకి పోలీసులు రావడం, థియేటర్ల ముందు పోలీసులు బందోబస్తు నిర్వహించడం.. ఇవన్నీ దేనికి సంకేతాలు. ఇలాంటి వాటిని అడ్డు పెట్టుకుని అటు చంద్రబాబు, లోకేష్ కూడా ట్వీట్లతో విరుచుకుపడుతున్నారు. అంతెందుకు థియేటర్ల వద్ద కూడా చాలామంది ప్రభుత్వ అధికారుల్ని తిట్టుకుంటున్నారు. బ్యానర్లు కట్టనివ్వలేదని, పాలాభిషేకాలు అడ్డుకున్నారని, కనీసం గుంపులుగా చేరనివ్వడంలేదని చెబుతున్నారు. ఇప్పటికే సినిమా టికెట్ రేట్లు తగ్గించి, బెనిఫిట్ షో లు ఆపేసి.. ప్రభుత్వం సగం పరువు తీసేసుకుంది. రేట్లు పెంచుతాం, పెద్ద సినిమాలకి బెనిఫిట్ షో అవకాశం ఇస్తామని చెబుతూనే.. భీమ్లా నాయక్ కి మాత్రం ఆ ఛాన్స్ లేకుండా చేశారు.

ఎంత చేసినా ప్రయోజనం శూన్యం

బాక్సాఫీస్ వద్ద టికెట్ రేట్లు తగ్గించింది కానీ, బ్లాక్ మార్కెట్ ని మాత్రం ప్రభుత్వం ఆపలేకపోయింది. మరీ ముఖ్యంగా అధిక ధరలకు టికెట్లు విక్రయిస్తున్న థియేటర్ల వద్ద పోలీసులు, అధికారులు లేకపోవడం మరింత విమర్శలకు తావిచ్చింది. మరికొన్ని థియేటర్ల వద్ద సీన్ ఎలా ఉందంటే.. రెవెన్యూ అధికారి థియేటర్ లోని ఆఫీస్ గదిలో ఏసీ వేసుకొని కూర్చున్నాడు, బయట యధేచ్ఛగా టికెట్లు తెగనమ్ముకున్నారు. 

ఈ మొత్తం వ్యవహారంలో పంచాయతీ పరిథిలో ఉన్న కొన్ని థియేటర్లు మాత్రం దారుణంగా బుక్కయ్యాయి. అటు లాబీయింగ్ చేసుకోలేక, ఇటు తక్కువ రేట్లకు టికెట్ అమ్మలేక తెగ సతమతమయ్యారు. అలా అని థియేటర్లు క్లోజ్ చేస్తే, ప్రేక్షకుల నుంచి వ్యతిరేకత, పవన్ ఫ్యాన్స్ నుంచి దాడులు తప్పలేదు. ఇంత గందరగోళ పరిస్థితులు, మరీ ఇంత నెగిటివ్ ఇమేజ్ తో ప్రభుత్వం ఏం చేయాలనుకుంటున్నట్టో పెద్దలకే తెలియాలి.