ఇష్క్ ఎందుకు హిట్ అయింది..మాచర్ల..ఎందుకు డిజాస్టర్ అయింది. మజిలీ ఎందుకు హిట్ అయింది… కస్టడీ ఎందుకు ఫ్లాప్ అయింది. జెర్సీ ఎందుకు మంచి పేరు తెచ్చుకుంది…దసరా ఎందుకు మూడో రోజే పడుకునిపోయింది. తొలిప్రేమ ఎందుకు బాగుంది…ఘని ఎక్కడ విఫలమయింది. మజ్ఙు, బ్యాచులర్ ఓకె అనిపించుకుంటే ఏజెంట్ ఎందుకు కిందపడిపోయింది? గీతగోవిందం ఎందుకు బ్లాక్ బస్టర్..లైగర్ ఎందుకు డిజాస్టర్? మళ్లీ మళ్లీ రాని రోజు, శతమానం భవతి ఎందుకు మంచి హిట్ లు..రణరంగం ఎందుకు ఫెయిల్యూర్? సోగ్గాడే..బంగార్రాజు సూపర్ అయితే వైల్డ్ డాగ్, ఘోస్ట్, మన్మధుడు 2 ఎందుకు బకెట్ తన్నేసాయి.
ఇలా ప్రతి హీరో సినిమాల హిట్, ఫ్లాప్ లను డీ కోడ్ చేస్తే ఓ లైనూ, లెంగ్తూ తెలుస్తుంది. ఆ లైనూ..లెంగ్తూ పట్టుకుంటే సక్సెస్ కు కాస్తయినా సూత్రం కనిపిస్తుంది.
కానీ మన యంగ్ హీరోలకు ఆ సూత్రం అక్కరలేదు. ఫైట్లు విరగదీయాలి. పవర్ ఫుల్ డైలాగులు చెప్పాలి. నాగ్ లాంటి సీనియర్లకు 60 ఏళ్లు దాటేసినా ఇంకా 18ఏళ్ల అమ్మాయిలతో రొమాన్స్ చేయాలి. యాక్షన్ సీన్లు వుండాలి. రోజులు మారాయి అని, జనాలకు ఓ అభిరుచి వుంటుంది. ఒక్కో హీరోను ఒక్కో విధంగా చూస్తారని అస్సలు అనుకోరు. సల్మాన్, వెంకీ అండ్ కో లుంగీలు కట్టుకుని తొడలు చూపించుకుంటే ఎంత వికారంగా వుందో, ప్రేక్షకులకు ఎంత వాంతి వచ్చిన ఫీలింగ్ ఇచ్చిందో ఆ సినిమాను జనాలు తిప్పి కొట్టిన వైనం చెబుతుంది.
యంగ్ హీరోలు విభిన్నమైన ప్రేమకథలు చేసినపుడల్లా ప్రేక్షకులు నెత్తిన పెట్టుకున్నారు. నితిన్ ఎంత మంది పెద్ద పెద్ద దర్శకులతో ఎన్ని మాస్ సినిమాలు చేసాడు. అన్నీ తిప్పి తిప్పి కొట్టారు. రాజమౌళి సినిమాను తప్పిస్తే. అలాంటి టైమ్ లో ఇష్క్ అలాగే ఆ తరువాత వచ్చిన రెండు మూడు సినిమాలు అద్భుతాలు చేసినా చేయకున్నా మాచర్ల రేంజ్ డిజాస్టర్లు కాలేదు. కానీ ఒకటి రెండు హిట్ లు పడేసరికి మళ్లీ మనసు మాస్ వైపు లాగేస్తుంది. వరుసపెట్టి ఫ్లాపులే ఫ్లాపులు.
ఏమాయచేసావె, ప్రేమమ్, మజిలీ రారండోయ్ వేడుక చూద్దాం, లవ్ స్టోరీ, మజిలీ ఇలా ఎన్ని హిట్ లు హిట్. సవ్యసాచి, సాహసం శ్వాసగా, యుద్దం శరణం, వెంకీ మామ ఇవన్నీ నాగ్ చైతన్యకు ఫ్లాపులే. ఇక్కడ తెలియడం లేదా తనను జనం ఏ తరహా సినిమాల్లో చూడాలని కోరుకుంటున్నారో? అవే జోనర్ లో విభిన్నమైన కథలు సంపాదించాలి. చైతూ హిట్ అయిన సినిమాలు అన్నీ జానర్ ఒకటే. పాయింట్లు వేరు.
వరుణ్ తేజ ఫిదా, తొలిప్రేమ, ఎఫ్ 2, ఎఫ్ 3 ఇలాంటి యూత్ ఫుల్ లేదా ఫ్యామిలీ సినిమాల్లో క్లిక్ అయ్యారు. వాటిని వదిలేసి లోఫర్, మిస్టర్, గని చేస్తే పక్కన పెట్టారంటే అర్థం కావడం లేదా, మనకు మాస్ సెట్ కాదని. అయినా దాన్నే పట్టుకుని వేలాడతారు.
ఇలా రాసుకుంటూ పొతే ప్రతి హీరోకి సెట్ అయిన జానర్ వుంటుంది. సెట్ కాని సినిమాలు వుంటాయి. అయినా హీరోలు వినరు. దానికి వాళ్లు ఒకటే సమాధానం కన్విన్సింగ్ గా చెబుతారు. ఇలా ప్రయత్నించకపోతే ఒకే జానర్ కు ఫిక్స్ అయిపోతాము. దాంతో అలా మెల్లగా ఫేడవుట్ అయిపోతాం. అందుకే ప్రయోగాలు చేయాల్సిందే. ఎప్పడో ఒకప్పుడు సక్సెస్ అవుతాము అంటారు.
అదీ నిజమే. కానీ ఈ ప్రయోగాలు నిర్మాతల పాలిట కాస్ట్ లీ ప్రయోగాలు కాకూడదు. అంత సరదా వుంటే హీరోలు మధ్య మధ్యలో తమ స్వంత డబ్బులతో ఇలాంటి సినిమాలు తీసుకోవాలి. లేదా పూర్తిగా రెమ్యూనిరేషన్ వదులుకుని ఇలాంటి సినిమాలు చేయాలి. జెర్సీ, శ్యామ్ సింగరాయ్, దసరా నిర్మాతలకు మిగిలింది ఏమీ లేదు. నానికి డబ్బు, పేరు మూటగట్టి ఇవ్వడం తప్ప. మిగిలిన హీరోలకు పేరూ రాలేదు, నిర్మాతలకు పైసలూ రాలేదు.
ఇకనైనా హీరోలు ఈ మాస్ ప్రయోగాల విషయంలో కాస్త ముందు వెనుక ఆలోచించాలి. నిర్మాతలను బలి చేయడం ఆపాలి.