భీమ్లా.. ఫ్యాన్స్ కొట్టుకుంటున్నారిక్కడ

భీమ్లా కోసం ఫ్యాన్స్ వెయిటింగేమో కానీ, కొన్నిచోట్ల మాత్రం ఫ్యాన్స్ కొట్టుకునే పరిస్థితి వచ్చేసింది. అసలైన అసోసియేషన్ మాదే, కాదు మాదే.. టికెట్లన్నీ ఆ అసోసియేషన్ కి ఇచ్చేశారు, మేమేం చేయాలంటూ ఫ్యాన్స్ మధ్య…

భీమ్లా కోసం ఫ్యాన్స్ వెయిటింగేమో కానీ, కొన్నిచోట్ల మాత్రం ఫ్యాన్స్ కొట్టుకునే పరిస్థితి వచ్చేసింది. అసలైన అసోసియేషన్ మాదే, కాదు మాదే.. టికెట్లన్నీ ఆ అసోసియేషన్ కి ఇచ్చేశారు, మేమేం చేయాలంటూ ఫ్యాన్స్ మధ్య వార్ మొదలైంది. చాలా ప్రాంతాల్లో ఇలా అసోసియేషన్ల మధ్య ఒరిజినల్, డూప్లికేట్ అనే గొడవలు జరుగుతున్నాయి. నెల్లూరు జిల్లాలో మాత్రం ఇలాంటి వ్యవహారం ఒకటి పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది.

చాన్నాళ్లుగా తాము పవన్ ఫ్యాన్స్ అసోసియేషన్ నడుపుతున్నామని, కానీ కొత్తగా వైసీపీ నుంచి వచ్చిన ఓ వ్యక్తి పవన్ ఫ్యాన్స్ అంటూ పోస్టర్ వేసుకున్నాడని, వారికే థియేటర్ వాళ్లు అన్ని టికెట్లు ఇచ్చేశారని కావలిలో ఓ వర్గం గొడవకు దిగింది. సినిమా రిలీజ్ రోజు టికెట్ల కోసం ఇలాంటి డ్రామాలు కూడా ఆడతారా అంటూ ప్రశ్నిస్తున్నారు. అనుకోకుండా ఇక్కడ ఫ్యాన్స్ మధ్య పొలిటికల్ వార్ మొదలైంది కూడా. వైసీపీ వాళ్లు పవన్ ఫ్యాన్స్ అసోసియేషన్లో ఉండాలా ఉండకూడదా అనే చర్చ ఊపందుకుంది.

రానా ఫ్యాన్స్ హర్టయ్యారు..

నెల్లూరు నగరంలో రానా ఫ్యాన్స్ టికెట్ల కోసం గొడవ చేస్తున్నారు. అన్ని టికెట్లు పవన్ ఫ్యాన్క్ కేనా.. దగ్గుబాటి ఫ్యాన్స్ ఏం పాపం చేశారంటూ డిస్ట్రిబ్యూటర్లను నిలదీస్తున్నారు. గతంలో అరణ్య సినిమా వచ్చినప్పుడు రానా ఫ్యాన్స్ అసోసియేషన్ తరపున టికెట్లన్నీ బల్క్ గా కొనేశామని, థియేటర్ ఓనర్ కి కలెక్షన్ల కష్టం లేకుండా చేశామని చెప్పుకుంటున్నారు ఫ్యాన్స్. 

ఇప్పుడు భీమ్లా నాయక్ టైమ్ లో ఐదు టికెట్లు మా మొహాన కొడతారా అంటూ నిలదీస్తున్నారు. డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ ఓనర్లు.. పవన్ ఫ్యాన్స్ కి ఇచ్చిన ప్రయారిటీ తమకు ఇవ్వడంలేదంటున్నారు రానా ఫ్యాన్స్.

థియేటర్ దగ్గర హుండీలా.. మీ పిచ్చి కాకపోతే..

ఇక మరికొన్ని జిల్లాల్లో ఏకంగా థియేటర్ల దగ్గర హుండీలు పెట్టి మరీ ఓవర్ యాక్షన్ చేస్తున్నారు ఫ్యాన్స్. బెనిఫిట్ షో లు లేకపోవడం, టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం లేకపోవడంతో డిస్ట్రిబ్యూటర్లకు నష్టాలు వచ్చే అవకాశముందని, ఫ్యాన్స్ స్వచ్ఛందంగా ఆ హుండీల్లో డబ్బులేస్తున్నారట. ఇంతకంటే పిచ్చి, చాదస్తం ఇంకోటి ఉంటుందా..?

నిర్మాతలు సినిమాలు తీసేది, డిస్ట్రిబ్యూటర్లు, సినిమా ఓనర్లు సినిమాలు ఆడించేది డబ్బుల కోసమే, లాభాల కోసమే. లాభాలు బాగా వచ్చినప్పుడు ఆస్తులు కొనుక్కుంటారు కానీ, పోన్లే పాపం అని ఎవరూ టికెట్ రేట్లు తగ్గించరు. మరి టికెట్ రేట్లు తక్కువగా ఉన్నాయని అభిమానులే అతి చేస్తూ హుండీ పెట్టారంటే.. కచ్చితంగా వాళ్లని పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ అని మాత్రమే అనాలి. 

మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా థియేటర్ యాజమాన్యాలు, నిబంధనలు తుంగలో తొక్కారు. అందినకాడికి రేట్లు పెంచి టికెట్లు అమ్ముకుంటున్నారు.