టికెట్ రూ.250.. స్నాక్స్ కు రూ.120

ప్రేక్షకుడి జేబుకు చిల్లు పెట్టడానికి థియేటర్ యాజమాన్యాలు రకరకాల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. ఓవైపు నిర్దేశించిన రేట్లకు మాత్రమే టికెట్లు అమ్మాలని ప్రభుత్వం నోటీసులు ఇచ్చినప్పటికీ ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. శ్రీకాకుళం నుంచి అనంతపురం…

ప్రేక్షకుడి జేబుకు చిల్లు పెట్టడానికి థియేటర్ యాజమాన్యాలు రకరకాల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. ఓవైపు నిర్దేశించిన రేట్లకు మాత్రమే టికెట్లు అమ్మాలని ప్రభుత్వం నోటీసులు ఇచ్చినప్పటికీ ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ఎక్కడా, ఏ థియేటర్ లో చెప్పిన రేటుకు టికెట్లు అమ్మడం లేదు. 

గోడపై గవర్నమెంట్ చెప్పిన రేటు ఉంటుంది, అమ్మేది మాత్రం ఎగ్జిబిటర్ నిర్ణయించిన ధరకే. టికెట్ పై 50 రూపాయలు మాత్రమే అని ముద్రించి ఉంటుంది, దాన్ని అమ్మేది మాత్రం 150 రూపాయలకు. కొంటే కొనమంటున్నారు, లేదంటే పొమ్మంటున్నారు. మరోవైపు కొన్ని థియేటర్ యాజమాన్యాలు, ప్రభుత్వం చెప్పిన రేటుకు అన్ని టికెట్లు అమ్ముడుపోయాయని పైకి చెబుతూ, అవే టికెట్లను తమ మనుషులతో బయట బ్లాక్ లో అమ్మిస్తున్నాయి.

భీమ్లానాయక్ విడుదల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న అవకతవకలు ఇలా చెప్పుకుంటూ పోతే కోకొల్లలు. ఇప్పుడు వీటికి మరో కొత్త ఎత్తుగడ తోడైంది. స్నాక్స్ టోకెన్ కొంటేనే, టికెట్ ఇస్తాం లేదంటే టికెట్ ఇవ్వం అంటోంది ఏపీలోని ఓ థియేటర్ యాజమాన్యం.

నెల్లూరులోని ఎస్2 సినిమాస్ లో ఓ కొత్త దోపిడీకి తెరతీసింది యాజమాన్యం. మల్టీప్లెక్స్ మాల్ కాబట్టి టికెట్ ధర కాస్త ఎక్కువే ఉంది. కానీ అది కూడా థియేటర్ యాజమాన్యానికి సరిపోవడం లేదు. 250 రూపాయల భీమ్లానాయక్ టికెట్ కావాలంటే, అదనంగా 120 రూపాయల టోకెన్ తీసుకోవాల్సిందే. ఆ టోకెన్ చూపిస్తే ఇంటర్వెల్ లో  స్నాక్స్ ఇస్తారంట.

ఇలా ఇంటర్వెల్ లో స్నాక్స్ కు ముందుగానే బిల్లు ఫిక్స్ చేసి మరీ టికెట్ అమ్ముతున్నారు ఎస్2 మల్టీప్లెక్స్ జనాలు. ఇంటర్వెల్ లో అందరూ స్నాక్స్ తినరు. నచ్చినవాళ్లు తింటారు, లేదంటే లేదు. మరికొంతమంది కేవలం  కూల్ డ్రింక్ తో సరిపెట్టుకుంటారు. కానీ ఈ మల్టీప్లెక్స్ యాజమాన్యం మాత్రం టోకెన్ కొంటేనే టికెట్ అంటూ నిబంధన పెట్టింది.

ఇలా చెప్పుకుంటూపోతే ఒకటి కాదు, రెండు కాదు.. భీమ్లానాయక్ రిలీజ్ సందర్భంగా రాష్ట్రంలోని ప్రతి థియేటర్ లో నిబంధనల ఉల్లంఘన జరుగుతోంది. ఓవైపు థియేటర్ యాజమాన్యాలు ఇంతలా బరితెగిస్తుంటే, మరోవైపు పవన్ అభిమానులు మాత్రం తమ హీరో సినిమాను ఏపీ ప్రభుత్వం తొక్కేస్తుందంటూ బీద అరుపులు అరుస్తున్నారు.