ఆయన తీరు చూసినప్పుడు ఎవ్వరికైనా ఈ సందేహం కలగక మానదు. ఆయన పేరు పయ్యావుల కేశవే గానీ.. మాటలు విన్న తర్వాత కుంభకర్ణుడి అంశ ఏ కొంచెమైనా ఆవహించి ఉన్నదా? అనే సందేహం కలుగుతుంది. కుంభకర్ణుడి తరహాలో.. ఆరునెలలపాటు నిద్రపోయి.. జస్ట్ ఇప్పుడే నిద్రలేచి.. చుట్టూ ఏం జరుగుతున్నదో కనీసం చెక్ చేసుకోకుండా.. నిద్రకు ముందు గుర్తున్న సంగతుల గురించే మాట్లాడుతూ ఉంటే.. ఇంకేం అనుకోవాలి.
అవును మరి – తెలుగుదేశానికి చెందిన ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్, తిరుమల తిరుపతిని ఉద్ధరించేసేలా ఏదో నాలుగు మాటలు మాట్లాడేయాలని అనుకున్నారు. ఆయన ప్రతిపక్షంలో ఉన్నారు గనుక.. ప్రభుత్వం ఏం చేసినా సరే.. బురద చల్లడం తన డ్యూటీ అని భావించే పొజిషన్ లో ఉన్నారు గనుక.. టీటీడీ బోర్డు తీసుకున్న నిర్ణయాలను కూడా తప్పుపట్టాలనుకోవడం వరకు ఓకే.
కానీ.. వాస్తవాలు తెలుసుకోకుండా.. ప్రాక్టికల్ అవగాహన లేకుండా.. ఎలా పడితే అలా మాట్లాడితే పోయేది తన పరువే అని ఎందుకు తెలుసుకోలేదో అర్థం కాదు.
టీటీడీ ధరలు పెంచింది అని మాత్రమే సోషల్ మీడియా వేదికగా కుట్రపూరిత ప్రచారం జరుగుతోంది. అలాంటి ప్రచారాన్ని నమ్మి.. తెలుగుదేశం పార్టీలో మేధావిగా గుర్తింపు ఉన్న పయ్యావుల కేశవ్ కూడా బుట్టలో పడిపోయినట్టుగా ఉంది. గాలివాటు మాటలు మాట్లాడుతున్నారు. టీటీడీ టికెట్ ధరలు ఎవరికి పెంచింది..? ఎందుకు నిందలు వేయాలి.. కనీసం ఆలోచించారో లేదో కూడా తెలియదు.
సామాన్య భక్తులకు ఉచితంగా కల్పించే సర్వదర్శనం ఎత్తివేస్తేనో, ఆ కోటా దర్శనాల సంఖ్యను భారీగా తగ్గిస్తేనో టీటీడీని నిందించాలి. 300 రూపాయల సుపథం దర్శన కోటాల ధర పెంచినా కూడా నిందిస్తే పరవాలేదు. వీవీఐపీలము అని చెప్పుకుంటూ సిఫారసు ఉత్తరాలు తెచ్చుకుని పైరవీల ద్వారా దేవుడిని దర్శించాలని అనుకునే వారికి కేటాయించే టికెట్ ధరలు పెంచితే తప్పేమిటి? దానికి కూడా కేశవ్ గగ్గోలు పెడితే ఎలా?
భక్తుడికి దేవుడిని దూరం చేస్తున్నారని, కోవిడ్ నిబంధనల పేరుతో దర్శనం టికెట్ ఉంటే తప్ప తిరుమలకు భక్తులను రానివ్వడం లేదని కేశవ్ పాపం వాపోయారు. సరిగ్గా ఇక్కడే ఆయనను కుంభకర్ణుడు ఆవహించాడని అనిపిస్తోంది. తిరుమలలో నిన్నటిదాకా దర్శనాలు పరిమితంగానే జరుగుతున్నాయి. కొవిడ్ కారణంగా పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతిస్తున్నారు.
కొవిడ్ తగ్గుముఖం పట్టి, ప్రభుత్వమే ఆంక్షలను సడలించిన నేపథ్యంలో దర్శనాల సంఖ్య కూడా పెంచారు. నిన్నటిదాకా అధికారికంగా టీటీడీ వెల్లడిస్తున్న గణాంకాల ప్రకారం.. రోజుకు 38 వేల వరకు భక్తులు దర్శించుకుంటుండగా, నిబంధనలు సడలించిన తర్వాత.. శుక్రవారం నుంచి 60 వేల దాకా దర్శనాల సంఖ్య పెరగనున్నాయి. మరి.. ఈ సమయంలో కేశవ్ నిద్ర మేలుకుని, నిజాలు తెలుసుకోకుండా భక్తులను దూరం చేస్తున్నారని అనడమే తమాషా.
దర్శనం టికెట్ లేకపోతే తిరుమలకు రానివ్వకపోవడం కూడా త్వరలో సడలించే నిర్ణయమే. ఒక్కొక్కటిగా ఆంక్షలు ఎత్తివేస్తున్న నేపథ్యంలో ఇది కూడా జరుగుతుంది. కాకపోతే.. దర్శనం కోసం కాకుండా భక్తుడు తిరుమలకు ఎందుకు రావాలి? తిరుమలను దైవస్థానం కాకుండా విహారయాత్రాస్థలంగా భావించే వారికి ఈ నిబంధన అడ్డు వస్తుంది తప్ప.. పుణ్యక్షేత్రంగా భావించేవారు ఎటూ దర్శనం టికెట్ తోనే వస్తారు కదా? దర్శనం టికెట్ లేకుండా కొండ పైకి వస్తే.. అటు దర్శనమూ లేక, ఇతర వసతి సదుపాయాలూ లేక భక్తులు రోడ్లమీద పడుకుంటూ ఇబ్బందులు పడతారనే ఉద్దేశంతో చేసిన ఏర్పాటును కూడా.. కనీస ఆలోచన లేకుండా పయ్యావుల కేశవ్ తప్పుపడుతున్నారు.
నిన్నటికి ఇవాళ్టికి దర్శనాల సంఖ్య విషయంలో చాలా మారింది. లేటెస్ట్ సమాచారంతో అప్ డేట్ కాకుండా.. దేవుడును దూరం చేసేస్తున్నారని ఆరోపించడం.. లెక్కల్లో గట్టిగా ఉండాల్సిన ఈ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఛైర్మన్ కు తగదు.