పుట్టిన రోజంటే ఎవరికైనా తియ్యటి జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి. తన పుట్టుకకు కారణమైన తల్లిదండ్రులు, అల్లారుముద్దుగా పెంచిన తీరు, బాల్యం, యవ్వనం, మధ్య వయసు, వృద్ధాప్యం ఇలా అనేక దశల్లో ఏర్పడిన స్నేహాలు, అనుభూతులు ఆయా వ్యక్తుల వయసును బట్టి నెమరువేసుకుంటుంటారు. నరసాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు పుట్టిన రోజు మాత్రం చేదు జ్ఞాపకాలు నీడలా వెంటాడుతున్నాయి.
ఎంతగా మరిచిపోదామన్నా, అసలు మనసులో నుంచి వెళ్లేది లేదని భీష్మించుకుని చేదు జ్ఞాపకాలు కూచున్నాయి. వైసీపీ వల్ల దక్కిన ఎంపీ పదవిని ఏ విధంగా అయితే రఘురామ విడిచిపెట్టేది లేదని మొండిగా అంటున్నారో, ఆ జ్ఞాపకాలు కూడా ఆయన్నే స్ఫూర్తిగా తీసుకుని వెంటాడుతున్నట్టున్నాయి. ఇవాళ రఘురామకృష్ణంరాజు పుట్టిన రోజు. ఈ సందర్భంగా మొదట ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు.
పుట్టిన రోజంటే ఆయనకు ఏవి గుర్తున్నాయో, లేదో తెలియదు కానీ, ఆ రోజు రాత్రి, చిమ్మ చీకట్లో… అబ్బా తలచుకుంటేనే మానని గాయం ఇంకా మనసును మెలిపెడుతోంది. ఢిల్లీలో ఆయన పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ పలు అంశాలను చెప్పుకొచ్చారు. తన పుట్టినరోజు, అలాగే ఏపీ ప్రభుత్వం తనను నిర్బంధించి కొట్టిన రోజు 14 మే 2021న అని ఆయన చెప్పారు. ఏపీ ప్రభుత్వం ఆయన మనసును గాయపరిచిందని రఘురామ ఆవేదనని బట్టి అర్థం చేసుకోవచ్చు. లేదంటే ఆయన అంతగా బాధపడేవారు కాదు.
అక్రమంగా అరెస్ట్ చేసిన ఏపీ సీఐడీ…ఆ రాత్రికి గుంటూరు తీసుకెళ్లి కొట్టిన దెబ్బలు ఇప్పటికీ మానలేదంటూ ఎంతగా గాయపరిచారో, ఏమో పాపం. మానని ఆ గాయాలు పైకి కనిపించేవి కావని అర్థం చేసుకోవాల్సి వుంటుంది. మనిషికి కాదు, మనసుకైన గాయాలు కంటికి కనిపించవు కదా! అసలు తాను ఏ పాపం చేయకుండానే చితక్కొట్టారనేది ఆయన ఆవేదన. వెంకటేశ్వర స్వామి భూములను అమ్మ వద్దని, అలాగే ఇసుక రేట్లు రెండు ఇంతలు పెంచడం వల్ల మన ప్రభుత్వానికి నష్టం కలుగుతుందని మాత్రమే తాను చేసిన నేరంగా ఆయన చెప్పుకొచ్చారు.
ఏదో అయిపోయింది, సరిపోయింది అని రఘురామ సర్దుకుపోవడం లేదు. మధ్యలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడికి ఇవాళ ఆయన కృతజ్ఞతలు చెప్పడం విశేషం. ఎందుకయ్యా అని అడిగితే… తాను కష్ట సమయంలో ఉన్నప్పుడు అండగా నిలిచినందుకని ఆయన చెప్పారు.
నరసాపురం ఎంపీ టికెట్ ఇచ్చి, అత్యున్నత చట్టసభకు పంపిన వైఎస్ జగన్ విషయంలో ఈ మాత్రం కృతజ్ఞతగా వుండి వుంటే, పుట్టిన రోజును ఎప్పటికీ మరిచిపోకుండా గిఫ్ట్ ఇచ్చేవారు కాదు కదా అని అధికార పార్టీ నేతలు అంటున్నారు. అయితే ఒక్కటి మాత్రం నిజం. పుట్టిన రోజు తనకు ఇచ్చిన ట్రీట్‌మెంట్‌తో రఘురామ మరింత రాటుదేలారు. మున్ముందు ఆయన రాజకీయాన్ని ఏ మలుపు తిప్పనుందో చూడాలి.