రాజకీయాల్లో నిర్ణయాలను మార్చేవి ఎపుడూ విజయాలే. ఒక విజయంతో ఎన్నో మారిపోతాయి. ఒక అపజయంతో చాలా లెక్కలు కనిపిస్తాయి. కర్నాటకలో భారీ ఓటమిని మూటకట్టుకున్న బీజేపీ తెలుగు రాజకీయాల విషయంలో రిస్క్ చేస్తుందని ఎవరూ అనుకోవడంలేదు.
దానికి తగినట్లుగానే ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు మాటలు ఉన్నాయి. విశాఖలో మీడియాతో మాట్లాడిన జీవీల్ ఏపీలో వైసీపీ వ్యతిరేక ఓట్లు చీలకూడదన్నేఅ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభిమతమని అన్నారు. దానిని ఆయన ఢిల్లీలోని తమ పార్టీ పెద్దలకు కూడా తెలియచేశారని అన్నారు.
తాము కూడా పవన్ చేసిన ప్రతిపాదనలను జాతీయ నాయకుల దృష్టికి తీసుకుని వెళ్తామని జీవీఎల్ చెప్పడాన్ని కొత్త మాటగానే చూడాలని అంటున్నారు. పవన్ ప్రతిపాదన అంటే టీడీపీతో కలసి జనసేన బీజేపీ నడవడం. ఈ విషయం మీద నిన్నటిదాకా జీవీఎల్ వంటి నాయకులు మీడియా ముందుకు వచ్చి మాకు టీడీపీతో పొత్తు అన్నదే లేదు.
మా మిత్ర పక్షం వైసీపీ మాత్రమే అని గట్టిగా ఒకటికి పదిసార్లు చెప్పేవారు. అంతే కాదు వైసీపీతో సమానంగా టీడీపీని విమర్శించేవారు. ఈ రోజు మాత్రం వైసీపీ మీదనే జీవీఎల్ విమర్శలు చేశారు. పవన్ అన్న దాంట్లో తప్పేముంది అన్నట్లుగా మాట్లాడారు.
కేంద్ర బీజేపీ నాయకత్వానికి దగ్గరివారుగా భావించే జీవీఎల్ నోటి వెంట ఈ మెత్త మెత్తని మాటలు పొత్తులో కొత్త అర్ధాన్నే సూచిస్తున్నాయని అంటున్నారు. పవన్ కోరినట్లుగా టీడీపీ బీజేపీ కలవడానికి ఏపీ లీడర్లు ఇపుడు ఓకే అంటున్నట్లుగానే ఉందా అన్న డౌట్లు వస్తున్నాయి.
జీవీఎల్ మాత్రం గడుసుగానే మీడియాకు జవాబు చెప్పారు. మేము ఏపీలో పొత్తుల గురించి అన్నీ హై కమాండ్ కి చెబుతాం, తుది నిర్ణయం వారిదే. జాతీయ నాయకత్వం ఎలా దిశానిర్దేశం చేస్తే అలా పొత్తులు ఉంటాయని ఆయన కొస మెరుపు మెరిపించారు. ఇపుడున్న పరిస్థితులు చూస్తూంటే తెలంగాణా ఎన్నికలు కూడా ఉన్న వాతావరణంతో బీజేపీ జాతీయ నాయకత్వం రెండు తెలుగు రాష్ట్రాలకు మేలు చేసేలాగానే పొత్తుల మీద కీలక నిర్ణయం తీసుకుంటుంది అని అంటున్నారు.