ఒకటి కాదు రెండు కాదు.. మతపరమైన అస్త్రాలను చాలా వాడింది భారతీయ జనతా పార్టీ కర్ణాటకలో. దాదాపు రెండేళ్ల కిందట హిజాబ్ వివాదంతో హిందుత్వ అస్త్రాలను కమలం పార్టీ సంధించింది. విద్యాలయాల్లోకి హిజాబ్ ధరించి రావడాన్ని కర్ణాటక ప్రభుత్వం నిషేధించింది. ఆ వివాదం సుప్రీం కోర్టు వరకూ వెళ్లింది. చివరకు ఈ విషయంలో బొమ్మై సర్కారు అనుకున్నది చేసింది. మరి విద్యాలయాల్లోకి మతపరమైన వస్త్రధారణ ఉండకూడదంటే.. సిక్కుల తలపాగా కూడా నిషేధించాలి. అయితే బీజేపీ టార్గెట్ అది కాదు. ఇస్లాం వస్త్రధారణే కమలం పార్టీ టార్గెట్.
ఆ వెంటనే బొమ్మై సర్కారు మతమార్పిడిలను నిషేధించే చట్టం ఒకటి తీసుకొచ్చింది. భారత రాజ్యాంగం పౌరుడికి మతస్వేచ్ఛను ఇచ్చింది. పౌరుడు తన ఇష్టం వచ్చిన మతాన్ని ఆచరించే హక్కును కలిగి ఉన్నాడు. అయితే రాజ్యాంగం ప్రకారం కర్ణాటక ప్రభుత్వ చట్టం చెల్లకపోవచ్చు, కానీ నిషేధించేస్తే అది హిందూమతానికి తమసేవగా బీజేపీ లెక్కలేసింది.
అక్కడితో మొదలుపెడితే మతపరమైన అంశాలను తీవ్రంగానే రేపారు కర్ణాటకలో. ఎన్నికల మెనిఫెస్టోలో కాంగ్రెస్ వాళ్లు భజరంగ్ దళ్ పై నిషేధం అంటూ ప్రకటించడంతో బీజేపీకి మరో అస్త్రం దొరికినట్టు అయ్యింది. భజరంగ్ దళ్ పై నిషేధం అంటే.. అది ఆంజనేయుడి పూజపై నిషేధం అనేంత స్థాయిలో స్వయంగా మోడీ హడావుడి చేశారు. భజరంగభళి అంటే మీకెందుకంత కోపం.. అంటూ మోడీ ప్రసంగాలు సాగాయి! భజరంగీ పేరును వాడు రాజకీయం చేయడం, వేలెంటైన్స్ డే రోజున యువతీయువకులపై దాడులు చేయడం, శ్రీరామ్ సేన అంటూ పబ్బులపై విరుచుకుపడటం.. ఇలాంటి వాటికీ, దేవుడికి ముడిపెట్టేసి .. వాటిపై నిషేధం అంటే అది దైవద్రోహం అన్నట్టుగా మోడీ మాట్లాడారు.
అంతేనా.. ది కేరళ స్టోరీ అనే సినిమాను కూడా మోడీ ప్రస్తావించారు. ఆ సినిమాను తప్పు పడితే.. వారు ఉగ్రవాద మద్దతుదారులు అన్నట్టుగా మోడీ ప్రకటించారు. ఆ సినిమాలో చూపిన సంగతుల్లో నిజానిజాల మాటేమిటో కానీ.. బీజేపీ ఆ సినిమాను వాడుకున్న తీరును చూస్తే.. మాత్రం ఇదేదో సరిగ్గా కర్ణాటక ఎన్నికల కోసం తీసిన సినిమాలాగా ఉందనే అనుమానాలు రేగాయి.
అయితే రెండేళ్ల నుంచి పేర్చుకుంటూ వచ్చిన ఏ అస్త్రమూ బీజేపీని కర్ణాటకలో రక్షించలేదు. కర్ణాటకను మినీ ఉత్తరప్రదేశ్ గా చూసిన బీజేపీ లెక్క తప్పింది. 40 శాతం కమిషన్ సర్కారు అనిపించుకున్నా ఫర్వాలేదు, కేవలం మతం మత్తు చల్లుతుంటే చాలని బీజేపీ అనుకుంది. మోడీ, అమిత్ షా అంతగా కర్ణాటకలో తిరిగినా… ఎంతసేపూ మతం గురించి మాట్లాడారు, కాంగ్రెస్-జేడీఎస్ లు అవినీతి-ఉగ్రమద్దతుదారు పార్టీలంటూ నిందలేశారు కానీ, ఎక్కడా తమ సర్కారు అంతకు మూడేళ్ల నుంచి ఎలాంటి అవినీతికీ పాల్పడలేదంటూ మాత్రం చెప్పలేకపోయారు.
మరి ఇందుమూలంగా బీజేపీ గ్రహించాల్సినది ఏమిటంటే.. దేనికైనా ఎక్స్ పైరీ డేట్ ఉంటుంది. మతం పేరుతో చెప్పే కబుర్లు కూడా అలాంటి సమయానికి దగ్గరపడ్డాయి. ఈ రోజు మినీ ఉత్తరప్రదేశ్ అనుకున్న కర్ణాటకలో రేపు ఉత్తరప్రదేశ్ లోనే కావొచ్చు! ప్రజాసమస్యల మీద దృష్టి పెట్టకుండా .. ఎంతసేపూ ఇలాంటి మాటలు చెబుతుంటే మూడేది బీజేపీకే! కర్ణాటక ఎన్నికల నుంచి ఆ పార్టీ అర్థం చేసుకోవాల్సిన ఇలాంటి నీతి చాలానే ఉంది.