రామోజీరావు బెడ్‌పై పడుకుని …”ఇది కాలమహిమా? లేక జగన్ మహిమా?” అనడాన్ని చూస్తే తనకు ఎంతో సంతోషం కలిగిందని నందమూరి లక్ష్మీపార్వతి తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఏపీ సీఐడీ వర్సెస్ రామోజీరావు మధ్య సాగుతున్న పోరు, తాజా పరిణామాలపై లక్ష్మీపార్వతి ఘాటైన సుదీర్ఘ లేఖను సాక్షి పత్రికలో రాశారు.
నేరుగా రామోజీరావుకే రాసిన బహిరంగ లేఖ కావడం విశేషం. స్వయంగా చంద్రబాబు, రామోజీరావు బాధితురాలైన లక్ష్మీపార్వతి తన ఆవేదన, ఆక్రోశాన్ని వెళ్లగక్కారు. పదునైన అక్షర కత్తులతో రామోజీని తనివితీరా ఆమె పొడిచారు. అన్నిటికంటే కాలం గొప్పదని , అది అందరి సరదా తీరుస్తుందనే కోణంలో ఆమె లేఖ సాగింది.
“కాలః ప్రసారిత కరోదీర్ఘాదపి గృహ్ణాతి” అని పంచతంత్రంలో విష్ణు శర్మ చెప్పడాన్ని గుర్తు చేశారు. కాలం చేతులు చాలా పొడవుగా ఉంటాయని రామోజీకి మరీమరీ గుర్తు చేశారామె. ఆ సమయం వచ్చినప్పుడు ఒంటి స్తంభం మేడలో ఉన్నా విడచిపెట్టదనే వార్నింగ్ ఇవ్వడం విశేషం.
ఇప్పటి మీ పరిస్థితి చూస్తుంటే ఇది రాయక తప్పడం లేదంటూ లక్ష్మీపార్వతి రాసిన సుదీర్ఘ లేఖలో పాత గాయాల్ని తెరపైకి తెచ్చారు. రామోజీ ప్రస్తుత దుస్థితికి నాటి పాపాలే కారణమని ఆమె చెప్పుకొచ్చారు. కేవలం మీ అండదండలతో ఎదిగిన వారికి మీ పట్ల సానుభూతి ఉంటుందే తప్ప, సామాన్య ప్రజల్లో ఏ మాత్రం లేదని తేల్చి చెప్పారు. ఇన్నాళ్లకైనా మీ పాపాలు పండి నిజాలు బయటకు వస్తున్నాయని జనం సంతోషిస్తున్నారని ఆమె రాయడం విశేషం. కాలం గొప్ప తీర్పరి కదా. మీకంటే పెద్ద పెద్ద నాజీలకే శిక్షలు వేసిందంటూ దెప్పి పొడిచారు.
“మీ రాజ శాసనం ఇన్నేళ్ళు బాగానే అమలు చేసుకున్నారు కదా. అటువంటి మీరు మీ మనువడి వయస్సులో ఉన్న ఒక చిన్న కుర్రాడిని చూసి 'ఇది జగన్ మహిమా! అంటూ మంచం ఎక్కటం ఏంటని మీరన్నట్టు కాలమూ, జగనూ ఇద్దరూ గొప్పవారే, ఈ రోజు మీ వలన నష్టపోయిన నాలాంటి అభాగ్యులెందరో సంతోషపడుతుంటారు”
వైఎస్ జగన్ అనే యువకుడి దెబ్బకు రామోజీ పాపాలు పండాయని, శిక్ష అనుభవిస్తున్నాడని లక్ష్మీపార్వతి నిర్మొహమాటంగా రాసుకొచ్చారు. ఇలా అనేక అంశాలను ఈ లేఖలో ఆమె ప్రస్తావించారు. ఇప్పుడనుభవిస్తున్న క్షోభకు గతం తాలూకూ పాపాలు ఎలా కారణం అయ్యాయో ఆమె వివరించారు. ఈ లేఖను ఆంధ్రప్రదేశ్ తెలుగు అకాడమీ చైర్ పర్సన్ హోదాలో రాయడం విశేషం.