ఎన్నికలను ఎదుర్కొనడానికి తమ దగ్గర తగినంత డబ్బుల్లేకపోయాయని చెబుతున్నారు కర్ణాటక మాజీ సీఎం, జేడీఎస్ లీడర్ కుమారస్వామి! తాము డబ్బుల్లేక పాతిక సీట్లలో విజయం దరిదాపుల్లోకి వచ్చి వెనకబడినట్టుగా కుమారస్వామి చెప్పుకొచ్చారు! తాము గెలిచే సీట్ల సంఖ్య చెప్పలేదు కానీ, పాతిక సీట్లలో మాత్రం తగినంత ఆర్థిక శక్తి లేక విజయం అందుకోలేకపోతున్నట్టుగా ఆయన చెప్పుకొచ్చారు!
మరి ఈ ఆర్థిక శక్తి అసలు సంగతేమిటో ఈయన చెప్పలేదు! ఎన్నికల్లో ఒక్కో అభ్యర్థి ఎంత ఖర్చు పెట్టాల్లో ఎన్నికల కమిషన్ చట్టం చేసి పెట్టింది. మరి ఆ డబ్బులు కూడా లేక ప్రచారం చేసుకోలేకపోయారో లేక పదుల కోట్ల ఖర్చులో పోటీ పడలేకపోయినట్టుగా కుమారస్వామి చెబుతున్నారో మరి!
బీజేపీ, కాంగ్రెస్ లు బాగా ఖర్చు పెట్టాయనేది కుమారస్వామి ఉద్దేశ్యం కావొచ్చు. ఆ పార్టీలతో ఎన్నికల ఖర్చులో తాము పోటీ పడలేకపోయినట్టుగా కుమారస్వామి చెబుతున్నారు. అయితే మూడేళ్ల కిందటి వరకూ కూడా కుమారస్వామే కర్ణాటక సీఎంగా నిలిచారు. కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ సర్కారులో కుమారస్వామికి అప్పుడు సీఎం పీఠం అయాచితంగా దక్కేసింది. గత రెండున్నర, మూడేళ్ల నుంచినే అధికారం చేతిలో లేదు. మరి ఇంతలోనే కుమారస్వామికి క్యాష్ తక్కువైపోయిందేమో!
అయితే.. కుమారస్వామివి ఉత్తుత్తి మాటలే అని, గెలుపు అవకాశం ఉన్న చోట జేడీఎస్ భారీగా ఖర్చు చేసిందనే అభిప్రాయాలు సర్వత్రా వినిపిస్తున్నాయి. మూడు పార్టీలూ విజయం కోసం భారీ ఖర్చులే పెట్టాయనే టాక్ నడుస్తోంది. కనీసం ముప్పై కోట్ల రూపాయల నుంచి కొన్ని సీట్లలో ఒక్కో అభ్యర్థి యాభై కోట్ల రూపాయల వరకూ ఖర్చు చేశాడనేది కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల విషయంలో ఉన్న టాక్. మొత్తానికి పోలింగ్ రోజునే కుమారస్వామి డబ్బులు చాల్లేదని నిస్సహాయత వ్యక్తం చేశారు పాపం!