‘బండ్ల’..తివిక్రమ్..అదే నిజ‌మైంది

నిర్మాత బండ్ల గణేష్ కు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కు మధ్య పొసగడం లేదని ‘గ్రేట్ ఆంధ్ర’ ఏనాడో వెల్లడించింది. ఒక లాండ్ డీల్ కు సంబంధించి ఈ ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయని…

నిర్మాత బండ్ల గణేష్ కు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కు మధ్య పొసగడం లేదని ‘గ్రేట్ ఆంధ్ర’ ఏనాడో వెల్లడించింది. ఒక లాండ్ డీల్ కు సంబంధించి ఈ ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయని అప్పట్లోనె వివరించాం. ఆ తరువాత మెలమెల్లగా బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ -త్రివిక్రమ్ దగ్గర కనిపించడం మానేసారు. ఓ దశలో ఆ వార్తలు తప్పు అని ఆయన గ్రేట్ ఆంధ్రతో అన్నారు కూడా.

కానీ ఇప్పుడు అవే నిజ‌మని తేలింది. గుర్తు తెలియని పవన్ అభిమాని ఒకరితో బండ్ల మాట్లాడిన ఫోన్ సంభాషణ బయటకు వచ్చింది. అది ఫేక్ అని చాలా మంది అనుకుంటే అనుకోవచ్చు. కానీ బండ్ల వాయిస్, మాడ్యులేషన్, స్వభావం తెలిసిన వారందరికీ అది ఒరిజినల్ అనే అర్థం అయిపోతోంది.

పవన్ కళ్యాణ్ సినిమా భీమ్లానాయక్ అడియో ఫంక్షన్ సోమవారం జ‌రగాల్సి వుంది. సాధారణంగా అడియో ఫంక్షన్లలో బండ్ల స్పీచ్ లు ప్రత్యేకం. వకీల్ సాబ్ అడియో ఫంక్షన్ లో బండ్ల స్పీచ్ భయంకరంగా వైరల్ అయింది. కానీ భీమ్లా నాయక్ ఫంక్షన్ కు బండ్లకు పిలపు లేదని విశ్వసనీయ వర్గాల బోగట్టా. బండ్లకు కూడా అది అర్థమైంది. అందుకే గత రెండు రోజులుగా నర్మగర్భంగా ట్వీట్ లు వేస్తూ వస్తున్నాడు.

ఇలాంటి నేపథ్యంలో ఎవరో అభిమాని ఫోన్ చేస్తే, తన లోపల వున్నది కక్కేసాడు. అది కాస్తా వైరల్ అయిపోతోంది. సరే, త్రివిక్రమ్ కు తనకు మధ్య విబేధాలు వున్నాయని బయటకు వచ్చినా బండ్లకు వచ్చిన నష్టం లేదు. కానీ వైకాపా వాళ్లతో కలిసి త్రివిక్రమ్ ఏదో చేస్తున్నారనే అర్థం వచ్చెేలా ఓ మాట వుంది. అది ఇప్పుడు అసలు సిసలు పాయింట్. ఆ పాయింట్ నే ఈ వీడియో ఫేక్ అని అనుమానం కలిగేలా చేసింది. 

కానీ బండ్లతో పరిచయం వున్న ప్రతి ఒక్కరూ అది బండ్ల వీడియో అనే నమ్ముతున్నారు. కానీ ఇక్కడ తేలాల్సి ఒక్కటే వైకాపాతో కలిసి త్రివిక్రమ్ ఏం చేస్తున్నారని బండ్ల మనసులో వుందో..అది తెలియాలి.