నెల్లూరు నగర జనసేన నాయకుడు కేతంరెడ్డి వినోద్‌రెడ్డికి పిచ్చి బాగా ముదిరినట్టుంది. ఆలు లేదు, చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్న చందంగా వినోద్ రాజకీయ వ్యవహార శైలి వుందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రానున్న ఎన్నికల్లో సీఎంగా పవన్‌కల్యాణ్ బాధ్యతలు చేపడతారని, సర్వేపల్లి అభివృద్ధి పనుల శంకుస్థాపనకు వస్తారంటూ ఏకంగా ఆయన శిలాఫలకం వేసి ప్రచారం చేసుకోవడం సొంత పార్టీ శ్రేణుల్ని సైతం ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
ఇతని వ్యవహారం ఇవాళ నెల్లూరులో గొడవకు దారి తీసిందన్న వార్తలొస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జలవనరులు, మౌళిక సదుపాయాల శాఖ వారు ఓ శిలాఫలకాన్ని ఏర్పాటు చేసినట్టు అతను తయారు చేశాడు. నెల్లూరు సిటీ నియోజకవర్గంలోని సర్వేపల్లి కాలువపై మినీ బైపాస్ రోడ్డు, బాలాజీనగర్‌లను కలిపే బ్రిడ్జి నిర్మాణాన్ని కోటి రూపాయలతో చేపట్టేందుకు బుధవారం తన నేతృత్వంలో శంకుస్థాపన చేస్తున్నట్టుగా కేతంరెడ్డి వినోద్‌రెడ్డి శిలాఫలకాన్ని తయారు చేసుకున్నారు.
అలాగే ఇందులో ఇంకా ఏముందంటే… ఈ నిర్మాణ పనులు రానున్న సార్వత్రిక ఎన్నికల అనంతరం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ నేతృత్వంలో ఏర్పడే ప్రజాప్రభుత్వంలో ఎలాంటి ఆలస్యం చేయకుండా పూర్తి చేస్తారని రాసుకొచ్చారు. నిజంగా ఏదో ఊహించుకుని ఇవాళ అక్కడికి కేతంరెడ్డి వినోద్‌రెడ్డి వెళ్లినట్టు సమాచారం. దీంతో ఆయనపై కొందరు రాళ్లు విసిరారని సమాచారం. ఈ ఘటనలో వినోద్‌రెడ్డికి గాయాలు కూడా అయినట్టు జనసేన నేతలు చెబుతున్నారు.
వినోద్‌పై దాడిని ఖండిస్తున్నట్టు జనసేన నేతలు పోస్టులు పెడుతున్నారు. బహుశా ఇతని పిచ్చి చేష్టలే గొడవకు దారి తీసి వుంటుందనే ప్రచారం జరుగుతోంది. పవన్ ఎమ్మెల్యేగా గెలిచేందుకే దిక్కులేదు. అలాంటిది సీఎం అవుతారని ఏదేదో ఊహించుకుని అనవసరంగా కోరి సమస్యలు కొని తెచ్చుకోవడం అంటే ఇదే కాబోలు. కాస్త నేలవిడిచి సాము చేస్తే ఇలాంటివి చోటు చేసుకోవని కొందరు హితవు చెబుతున్నారు.