విశాఖను ఎవరు నాశనం చేశారో చెప్పిన మంత్రి…?

విశాఖను మేము అభివృద్ధి చేశాం, వైసీపీ వారు పూర్తిగా నాశనం చేశారు. ఇదీ తెలుగుదేశం పార్టీ రొడ్డకొట్టుడు రొటీన్ డైలాగ్. విశాఖను తామే ఎంతగానో ముందుకు తీసుకెళ్ళామని కూడా తరచూ తమ్ముళ్ళు చెబుతారు. మరి…

విశాఖను మేము అభివృద్ధి చేశాం, వైసీపీ వారు పూర్తిగా నాశనం చేశారు. ఇదీ తెలుగుదేశం పార్టీ రొడ్డకొట్టుడు రొటీన్ డైలాగ్. విశాఖను తామే ఎంతగానో ముందుకు తీసుకెళ్ళామని కూడా తరచూ తమ్ముళ్ళు చెబుతారు. మరి టీడీపీలో ఎన్టీయార్ నుంచి మొదలుపెడితే చంద్రబాబు జమానా వరకూ రెండు దశాబ్దాలకు పైగా అధికారంలో ఉంది.

విశాఖకు నిఖార్సుగా ఏం చేశారు అంటే చెప్పుకోవడానికి మీకు ఏమైనా ఉందా అన్నదే వైసీపీ నేతల ప్రశ్న. విశాఖను విద్యాపరంగా అభివృద్ధి చేశామని అంటారు. కానీ విశాఖ బ్రిటిష్ వారి టైమ్ లో అంటే 1926లోనే ఘనత వహించిన ఆంధ్రా యూనివర్శిటీతో విద్యల నగరం అయింది అన్నది ఎక్కడా  చెప్పరు.

సరే అలాంటి ప్రతిష్టాత్మకమైన ఏయూని టీడీపీ ఇంకా ఏమైనా బాగు చేసిందా అంటే అదీ లేదు కదా అంటున్నారు మంత్రి అవంతి శ్రీనివాస్. ఏయూకు పోటీగా గీతం వర్శిటీ పేర ఒక ప్రైవేట్ వర్సిటీ వస్తే దాని బాగు కోసం టీడీపీ పెద్దలు పూర్తి స్థాయిలో  పనిచేసి ఏయూని తగ్గించాలని చూశారని ఆయన ఆరోపించారు.

మరి విశాఖను ఇది బాగు చేయడమా నాశనం చేయడమా అని నిలదీస్తున్నారు. విశాఖలో భూములను కూడా దందా చేసే పరిస్థితులు ఉన్నది గత పాలనలో కాదా అని కూడా వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. విశాఖకు ఫ్లై ఓవర్ వేయమని ఉమ్మడి ఏపీకి సీఎం గా బాబు ఉండగా అడిగితే పట్టించుకోలేదని, వైఎస్సార్ ఏలుబడిలోనే తొట్ట తొలి ఫ్లై ఓవర్ వచ్చిందని గుర్తు చేస్తున్నారు. అలాగే, ఇక ఐటీ రాజధానిగా విశాఖను చేయాలని నాడు వైఎస్సార్ కృషి చేశారని చెబుతున్నారు.

ఇలా విశాఖ కోసం వైఎస్సార్ నుంచి తమ ప్రభుత్వం వరకూ పాటుపడుతూంటే విశాఖను నాశనం చేశారు అని ఊకదంపుడు విమర్శలు చేయడమేంటి అని ఫైర్ అవుతున్నారు. విశాఖను రాజధానిగా చేసి దేశంలోనే మేటి నగరంగా చేయాలన్నది జగన్ ఆలోచన అని అవంతి అన్నారు. అంతే కాదు, విశాఖ మీద ప్రేమ ఉండబట్టే విశాఖ నుంచి భోగాపురం దాకా ఆరు లైన్ల రోడ్లకు ప్రతిపాదిస్తున్నారని మరిన్ని కొత్త ప్రాజెక్టులను కూడా తీసుకువస్తున్నారని మంత్రి గారు టీడీపీ నేతలకు గట్టిగానే కౌంటర్ ఇచ్చారు.

మరి విశాఖ నాశనం అయిపోతోంది అని పెద్ద నోరు చేసుకుంటున్న వారు విశాఖకు తమ హయాంలో ఏం చేశారో ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని కూడా సూచిస్తున్నారు. ఇవన్నీ ఇలా ఉంటే విశాఖలో బీచ్ కారిడార్ తో పాటు, మరిన్ని ఫ్లై ఓవర్స్, సినీ పరిశ్రమతో పాటు హైదరాబాద్ కి ధీటుగా అన్ని రకాలైన ప్రాజెక్టులు త్వరలో వస్తాయని వైసీపీ నేతలు ధీమాగా చెబుతున్నారు.