ఆంధ్రప్రదేశ్‌ను టీడీపీ మాత్రమే పరిపాలించాలి, అది కూడా తన శిష్యుడైన చంద్రబాబే ముఖ్యమంత్రిగా ఉండాలనేది రాజగురువు రామోజీరావు ఆకాంక్ష. ఏపీ సీఎంగా వైఎస్ జగన్ ఉండడం రాజగురువు ఏ మాత్రం ఇష్టపడడం లేదు. ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచే బాధ్యతను రామోజీ మీడియా భుజాన వేసుకోంది. ఈ నేపథ్యంలో రాజగురువు తన అక్కసు, ఆగ్రహాన్ని ప్రజలపై రుద్దేందుకు ప్రయత్నించారు.
కొందరు మేధావులను తెరపైకి తెచ్చి, వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడించి, వాటినే జనాల్లోకి విస్తృతంగా తీసుకెళ్లే ప్రయత్నాల్ని వేగవంతం చేశారు. “ఇలాంటి ప్రభుత్వమే మళ్లీ వస్తే మహా ప్రమాదం” అంటూ ప్రముఖ ఆర్థిక రంగ నిపుణుడు డాక్టర్ జీవీరావు హెచ్చరికలకు అధిక ప్రాధాన్యం ఇవ్వడం గమనార్హం. కేవలం ప్రమాదం అని హెచ్చరించడం కాదు, మహాప్రమాదం అంటున్నారాయన.
ఇంతకూ వైసీపీ ప్రభుత్వం మళ్లీ వస్తే… రాష్ట్రానికేమో గానీ, రామోజీరావుకు మాత్రం మహా ప్రమాదమనే సెటైర్స్ సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి. ఈనాడు-ఈటీవీ ముఖాముఖిలో నిర్వహించిన చర్చావేదికలో ఏపీ ఆర్థిక పరిస్థితిపై ఆర్థిక నిపుణుడు డాక్టర్ జీవీరావు వెల్లడించిన అభిప్రాయాల్ని ఈనాడు పత్రిక ప్రముఖంగా ప్రచురించింది. డాక్టర్ జీవీ రావు ఏమన్నారంటే…
“దేశ చరిత్రలో ఎప్పుడూ ఏ రాష్ట్ర ప్రభుత్వమూ ఇలా అప్పులు చేయలేదు. కేంద్రప్రభుత్వం లేదా ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు అప్పులు తెచ్చి ప్రాజెక్టులు నిర్మిస్తున్నాయి. మౌలిక సౌకర్యాలు కల్పిస్తున్నాయి. పరిశ్రమలు పెట్టి ఉపాధి సృష్టిస్తున్నాయి. ఒక్క ఆంధ్రప్రదేశ్ మాత్రమే అప్పులు తెచ్చి ఉచిత పథకాలకు పంచి పెడుతోంది. రోజువారీ నిర్వహణ ఖర్చులకు కూడా అప్పులు చేయాల్సి వస్తోందంటే అది అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి అని అర్థం చేసుకోవాలి. మన రాష్ట్రం దివాలా అంచుల్లో వుంది. రాష్ట్రంలో మరోసారి ఇలాంటి ప్రభుత్వమే వస్తే… మహాప్రమాదం”
అప్పు చేసి పప్పు కూడు ఎప్పటికీ మంచిది కాదు. అయితే అప్పులు చేయడం నేరమైతే, ఆ పని చేస్తున్న ప్రతి ప్రభుత్వ తప్పిదాన్ని మీడియా ఎత్తి చూపాలి. ఒక్క వైసీపీ సర్కార్‌ను మాత్రమే టార్గెట్ చేయడం వల్లే రామోజీరావు పక్షపాత వైఖరి విమర్శలకు దారి తీస్తోంది. మిగులు బడ్జెట్‌తో ఉన్న తెలంగాణ సర్కార్ ఆర్థిక పరిస్థితి ఇప్పుడేంటి? ఏనాడైనా ఈటీవీలో చర్చకు పెట్టారా? ఈనాడులో కథనాలు రాశారా? రాయరు, రాయలేరు.
ఎందుకంటే మార్గదర్శి అక్రమాలపై కేసీఆర్ సర్కార్ సుప్రీంకోర్టులో ఇంప్లీడ్ కాలేదు కాబట్టి. కేసీఆర్ సర్కార్, రామోజీరావు పరస్పరం క్విడ్‌ప్రోకో ఒప్పందం అన్నమాట. తన కేసుల్లో కేసీఆర్ సర్కార్ జోక్యం చేసుకోకుండా, ఆ ప్రభుత్వాన్ని ఆకాశానికి ఎత్తుతూ ప్రచారం చేసే బాధ్యతను రాజగురువు నెత్తిన ఎత్తుకున్నారు.
కానీ ఏపీలో భిన్నమైన పరిస్థితి. మార్గదర్శి అక్రమాలపై సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేస్తున్న ఉండవల్లి అరుణ్‌కుమార్‌కు సపోర్ట్‌గా జగన్ సర్కార్ ఇంప్లీడ్ అయ్యింది. దీంతో రామోజీరావు మరింత చిక్కుల్లో పడ్డారు. ఇప్పటికే రెండుసార్లు రామోజీరావు, ఆయన కోడలు శైలజాకిరణ్‌లను ఏపీ సీఐడీ అధికారులు విచారించారు. ఏకంగా రామోజీని బెడ్ ఎక్కించిన ఘనత జగన్ సొంతం చేసుకున్నారు. తనకిలాంటి దుస్థితి వస్తుందని ఏనాడూ ఊహించలేదని, అంతా జగన్ మాయ అని నిర్వేదంతో రామోజీరావు అన్న మాటల వీడియో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే.
ఐదేళ్లు జగన్ అధికారంలో ఉంటేనే రామోజీరావు భ్రష్టు పట్టారు. మళ్లీ జగనే సీఎం అయితే ముఖ్యంగా రామోజీరావు ఆర్థిక దుస్థితిని ఊహించలేం. మార్గదర్శి వ్యవహారంలో రామోజీరావుకు ఏమైనా జరగొచ్చు. జగన్ రూపంలో మహా ప్రమాదం రాజగురువు మెడపై వేలాడుతోంది. తన భయాన్ని, ఆందోళనను జనంలో కూడా కలిగించి, వైసీపీ ప్రభుత్వ రాకను నిరోధించేందుకు కొన్ని రంగాల్లోని నిపుణులను తీసుకొచ్చి మాట్లాడిస్తున్నారు.