పాచిమాటలతో ఎలా ఆకట్టుకుంటావ్ లోకేష్!

‘‘నారా లోకేష్ బాబు కర్నూలు ప్రజలకు ఒక అతి పెద్ద వరం ప్రసాదించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే.. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేసేస్తామని ఆయన వరం ప్రకటించారు. ఆయన హామీతో కర్నూలులోని…

‘‘నారా లోకేష్ బాబు కర్నూలు ప్రజలకు ఒక అతి పెద్ద వరం ప్రసాదించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే.. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేసేస్తామని ఆయన వరం ప్రకటించారు. ఆయన హామీతో కర్నూలులోని న్యాయవాదులు అందరూ మురిసిపోయారు. ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా తెలిపారు.’’ ఇలాంటి వార్త చూసినప్పుడు ఎవరికైనా సరే చాలా కామెడీగా అనిపిస్తుంది. 

2019 ఎన్నికల్లో తమ తెలుగుదేశం పార్టీకి సంపూర్ణంగా క్షవరం చేసిన కర్నూలు జిల్లాలో ప్రస్తుతం పాదయాత్ర సాగిస్తున్న లోకేష్ కు ఏం మాటలు చెబితే.. అక్కడి ప్రజలను ఆకట్టుకోవచ్చునో పాపం, స్పష్టత ఉన్నట్టు లేదు. 

తన పాదయాత్ర జిల్లా కోర్టు దాకా రాగానే, ఏదో ఆ సమయానికి కొందరు న్యాయవాదులు వచ్చి ఆయన నడకకు సంఘీభావం చెప్పగానే.. ఆవేశం తెచ్చేసుకుని.. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేసేస్తాం అని ప్రకటించేశారు.

ఈ హామీ ద్వారా.. ఎవరిని కొత్తగా బురిడీ కొట్టించాలని లోకేష్ అనుకుంటున్నారో ప్రజలకు క్లారిటీ లేదు. జగన్ కంటె లోకేష్ చెప్పిన పాచి మాట ఎలా ప్రజలను ఆకర్షించే గొప్ప హామీ అవుతుందో అర్థం కావడం లేదు. ఎందుకంటే, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాను అధికారంలోకి వచ్చిన తర్వాత.. అధికార వికేంద్రీకరణ ద్వారా రాష్ట్రంలోని మూడు ప్రాంతాల సమాన అభివృద్ధిని లక్ష్యించారు. అందులో భాగంగానే కర్నూలును న్యాయరాజధానిగా చేస్తామని ప్రకటించారు. దానికి సంబంధించిన కసరత్తు కూడా ప్రారంభించారు. కేంద్రం నుంచి అనుమతులు రావాల్సిన దశలో ఆగింది. 

ఒకవైపు అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి జగన్ చీఫ్ జస్టిస్ తో కూడిన హైకోర్టునే కర్నూలులో ఏర్పాటు చేయడానికి, తద్వారా న్యాయరాజధాని అనే అపూర్వమైన హోదాను కట్టబెట్టడానికి చేస్తున్న ప్రయత్నానికి రకరకాలుగా అడ్డుపడుతున్న తెలుగుదేశం.. వారు అధికారంలోకి వస్తే.. అంతకంటె తక్కువ స్థాయిలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తాం అని చెప్పడం కర్నూలు ప్రజలకు పెద్ద ఆకర్షణ ఎలా అవుతుంది? 

జగన్ ప్రయత్నం కంటె చిన్న హామీ ఇస్తూ, అందుకోసం మా పార్టీని గెలిపించండి అనే అవివేకమైన డిమాండ్ తో ప్రజల ముందుకు రావడం చినబాబు నారా లోకేష్ కుమాత్రమే చేతనైన విద్య అని జనం నవ్వుకుంటున్నారు. ఇలాంటి పాచి హామీలు, ఇతరులు చేస్తున్న ప్రయత్నం కంటె చిన్న హామీలు చేస్తూ ప్రజల నుంచి ఓట్లు దండుకోవాలనుకుంటే కుదరదని కూడా అంటున్నారు.