తిరుపతిలో తొందరపాటు నిర్ణయం!

ఎంత మంచి నిర్ణయం అయినా కావచ్చు. కానీ దాని సాధ్యాసాధ్యాలు, ఆచరణ లోటు పాట్లు ముందుగా డిస్కస్ చేసుకోవాలి. అవసరం అయితే ఎలా అమలు చేయాలన్న దాని మీద ఓ కమిటీ ని ఏర్పాటు…

ఎంత మంచి నిర్ణయం అయినా కావచ్చు. కానీ దాని సాధ్యాసాధ్యాలు, ఆచరణ లోటు పాట్లు ముందుగా డిస్కస్ చేసుకోవాలి. అవసరం అయితే ఎలా అమలు చేయాలన్న దాని మీద ఓ కమిటీ ని ఏర్పాటు చేసుకోవాలి. అంతే తప్ప ఆలోచన వచ్చింది..అమలు చేసేద్దాం అని అనుకోకూడదు. 

తిరుమల కొండ మీద కేవలం అన్నప్రసాదాలు మాత్రమే అందరికీ అందించాలి. మరే ఇతర ఆహార పదార్థాలు విక్రయించకూడదు అని పాలకమండలి నిర్ణయించింది. తిరుమల కొండ మీద వున్న హోటళ్లు అన్నీ మూయించేయాలని అని డిసైడ్ అయ్యారు. బాగానే వుంది.

కానీ ఇదంతా ఆచరణ సాధ్యమేనా? తిరుమల కొండ చిన్నదేమీ కాదు. నలుమూలలా విస్తరించి వుంది. నలుమూలలా కేటేజ్ లు వున్నాయి.  ప్రస్తుతం జరుతున్న అన్నదానం అన్నది నిరంతరంగా సాగేది కాదు. దానికీ సమయా సమయాలు వున్నాయి. పైగా అది ఒక పాయింట్ లో మాత్రమే వుంటుంది.

అసలు తిరుపతిలో అన్న ప్రసాదాలు వుంటాయని సామాన్యులకు పెద్దగా తెలియదు. ఎందుకంటే పులిహొర, చక్రపొంగలి, దద్యొజనం వంటి అన్న ప్రసాదాలు విఐపి లకు మాత్రమే ప్రస్తుతం అందుతున్నాయి. ఇప్పుడు వీటిని నిరంతరంగా అందరికీ అందించాల్సి వుంటుంది.

ఉదయం ఆరు నుంచి, పది వరకు నిరంతరంగా వివిధ పాయింట్లలో వీటిని అందరికీ అందించాలి. అది కూడా ప్రసాదం అంటూ నాలుగు చెంచాలు పెడతాం అంటే అందరికీ నప్పకపోవచ్చు.  నిత్యం వేలాదిగా భక్తులు వచ్చే తిరుమల లాంటి చోట్ల ఇలాంటి కార్యక్రమం అంటే అదో బృహత్ యజ్ఞం. అలాగే సాయంత్రం వేళ కూడా అందించాల్సివుంటుంది.

ఇప్పుడు అవసరమైన వాళ్లు కొనుక్కు తింటున్నారు. భవిష్యత్ లో కొనుక్కోవాలన్నా దొరకదు. దేవస్థానం ఇవ్వదు..అమ్మనివ్వదు అంటే భక్తుల నుంచి వ్యతిరేకతను మూటకట్టుకోవాల్సి వస్తుంది. ఎక్కడో దూరంగా వుంటుంది అతిధి గృహం. మరెక్కడో వుంటుంది ప్రసాద వితరణ కేంద్రం. పిల్లలతో వచ్చిన వారు వాళ్లు ఆకలి అంటే ఏం చేయాలి? 

తిరుమలలో హోటళ్ల మాఫియా వుండి వుండొచ్చు. కానీ దాన్ని సంస్కరించాలి కానీ మొదటికే మోసం తేకూడదు. ఇలాంటి నిర్ణయం ఇప్పటి వరకు మరే దేవస్థానంలోనూ తీసుకోలేదు. మనకన్నా దశాబ్దాల కాలం ముందుగా నిత్య అన్నదానం నిర్వహిస్తున్న పలు కర్ణాటక దేవాలయాల్లో కూడా ఇలాంటి నిర్ణయం లేదు. 

నిజంగా భగవంతుడి ముందు అందరూ సమానులే అన్న ఆలోచన వుంటే విఐపి దర్శనాలకు స్వస్తి పలకాలి. అందరినీ క్యూలో రమ్మని చెప్పాలి. అప్పుడు సామాన్యుడు సంతోషిస్తాడు. 

అసలే జగన్ పాలనలో తప్పులు ఎక్కడ దొర్లుతాయో అని రెడీగా వున్నాయి ప్రతిపక్షాలు. అలాంటి నేపథ్యంలో ఇలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకుని, కొండమీద జనాలు ఆకలో వెంకటేశా అని అనుకునేలా చేయకూడదు. అంతగా కావాలనుకుంటే తిరుపతిలో మరే ఇతర విధమైన అన్న పదార్థాలు అమ్మకూడదు అని నిర్ణయం తీసుకోవచ్చు. అల్పాహారాలు మాత్రం విక్రయించడానికి అనుమతి ఇవ్వవచ్చు.