పదవి పోతోంది సుజనా.. ఇప్పుడేంటి పరిస్థితి?

పదవిలో ఉన్నంత వరకే గౌరవం, అధికారం. అది ఊడితే ఎవ్వరూ లెక్కచేయరు. మరీ ముఖ్యంగా రాజకీయాల్లో పదవికి ఉన్న పవర్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. ఇంకా ముఖ్యంగా కేసులు ఉన్న నేతలకు పదవే శ్రీరామరక్ష.…

పదవిలో ఉన్నంత వరకే గౌరవం, అధికారం. అది ఊడితే ఎవ్వరూ లెక్కచేయరు. మరీ ముఖ్యంగా రాజకీయాల్లో పదవికి ఉన్న పవర్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. ఇంకా ముఖ్యంగా కేసులు ఉన్న నేతలకు పదవే శ్రీరామరక్ష. ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఇలానే బండి లాగిస్తున్నారు. మరో ఎంపీ సుజనా చౌదరి కూడా చాన్నాళ్లుగా ఇలానే బండి లాగిస్తూ వస్తున్నారు. పదవిని అడ్డం పెట్టుకొని చాలా మినహాయింపులు పొందారు. అయితే సుజనా టైమ్ దగ్గరపడింది.

వచ్చే నెలలో సుజనా చౌదరి రాజ్యసభ సభ్యత్వం ముగుస్తుంది. మరి ఎంపీ పదవి పోయిన తర్వాత సుజనా పరిస్థితేంటి? ఆయన విచారణ ఎదుర్కోక తప్పదు. అయితే పదవి పోయినా ఆయన కేంద్రంలో అధికార పార్టీ సభ్యుడు కాబట్టి, మరికొన్నాళ్ల పాటు నెట్టుకురావొచ్చు. ఏదేమైనా పదవి పోవడం అనేది సుజనాకు పెద్ద దెబ్బ. మరోసారి రాజ్యసభ సీటు దక్కించుకునే అవకాశం కూడా ఆయనకు లేకపోవడం మరో పెద్ద దెబ్బ.

“అధికారాంతమున చూడవలె అయ్యగారి సౌభాగ్యముల్” అన్నట్టుంది ఇప్పుడు బీజేపీ ఎంపీ సుజనా చౌదరి పరిస్థితి. టీడీపీ నుంచి రాజ్యసభ సీటు పొంది, ఇప్పుడు బీజేపీలో ఉన్నారు సుజనా చౌదరి. కానీ ఇప్పుడు ఆ రెండు పార్టీల పరిస్థితి అధ్వాన్నంగా ఉంది. టీడీపీ నుంచి సహాయం అందదు, బీజేపీ వాడుకుని వదిలేస్తుంది కానీ పట్టించుకోదు. పట్టించుకునేంత పెద్ద నాయకుడు కూడా కాదు సుజనా చౌదరి. సొంత ఊరిలో కనీసం తన మనిషిని సర్పంచ్ గా కూడా గెలిపించుకోలేరు ఈ వ్యాపారవేత్త.

కాలం కలిసొచ్చి, పరిస్థితులు అనుకూలించి తన అర్థబలంతో సుజనా చౌదరి రాజ్యసభ సభ్యుడయ్యారు. ఆ పదవిని అడ్డు పెట్టుకుని మరిన్ని కరెన్సీ నోట్లు పోగేసుకున్నారు. అయితే ఇక్కడ అక్రమాలు, అన్యాయాలు, అవినీతి ఆయన మెడకు ఒక్కొక్కటిగా చుట్టుకుంటున్నాయి. పదవి ఊడిపోతే అవన్నీ బిగుసుకుపోతాయి. వీటిని సుజనా ఎలా తప్పించుకుంటారో చూడాలి.

ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచే సత్తా లేదు కాబట్టి, సుజనా చౌదరి వంటి వారికి పరోక్ష రాజకీయాలే దిక్కు. రాజ్యసభ సభ్యత్వం అయిపోయాక బీజేపీ ఆయనకు న్యాయం చేస్తుందని ఎవరూ అనుకోవట్లేదు. ఏపీ నుంచి అవకాశముంటే కరెన్సీ నోట్లతో పనయ్యేది, కానీ ఏపీలో బీజేపీ పవర్ నిల్. ఇతర రాష్ట్రాల నుంచి సుజనా చౌదరిని రాజ్యసభకు పంపించాలంటే ఆ లెక్కలు వేరే ఉంటాయి. 

సుజనా స్థాయి అది కాదు కాబట్టి, దాని గురించి ఆలోచించాల్సిన పనే లేదు. పోనీ టీడీపీ పరిస్థితి బాగున్నా అట్నుంచి సాయం అందేది. కానీ టీడీపీకే దిక్కు లేదు, ఇక సుజనాకి న్యాయం ఏం జరుగుతుంది. మొత్తానికి అధికారం పోయాక.. సుజనా ఎదుర్కోవాల్సింది చాలా ఉందనిపిస్తోంది.