కల్యాణ్ రామ్ తో అనీల్ రావిపూడి మళ్లీ చేయడా?

అనీల్ రావిపూడికి స్టార్ డైరక్టర్ హోదా వచ్చేసింది. ఏకంగా మహేష్ బాబుతో సినిమా చేశాడు. ఎఫ్3తో బిజీగా ఉన్నారు. త్వరలోనే బాలకృష్ణతో సినిమా చేయబోతున్నాడు. ఈ క్రమంలో తన మొదటి హీరో కల్యాణ్ రామ్…

అనీల్ రావిపూడికి స్టార్ డైరక్టర్ హోదా వచ్చేసింది. ఏకంగా మహేష్ బాబుతో సినిమా చేశాడు. ఎఫ్3తో బిజీగా ఉన్నారు. త్వరలోనే బాలకృష్ణతో సినిమా చేయబోతున్నాడు. ఈ క్రమంలో తన మొదటి హీరో కల్యాణ్ రామ్ తో అనీల్ రావిపూడి ఇక సినిమా చేయకపోవచ్చంటూ గతంలో చాలా ప్రచారం జరిగింది. దీనిపై తాజాగా స్పందించాడు అనీల్ రావిపూడి. తన తొలి హీరో కల్యాణ్ రామ్ తో పటాస్-2 చేస్తానని ప్రకటించాడు.

“పటాస్ హిట్ తర్వాత కలిసి ఇంకో సినిమా చేద్దాం అనుకున్నాం. మా మధ్య చాలా కథలు చర్చకొచ్చాయి కూడా. సైన్స్ ఫిక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఓ కథ కూడా చెప్పాను. ఆయన కూడా ఓకే అన్నారు. నా కెరీర్ లో మూడో సినిమా కల్యాణ్ రామ్ తోనే చేయాలి. కానీ దురదృష్టవశాత్తూ సెట్ అవ్వలేదు. కచ్చితంగా కల్యాణ్ రామ్ తో సినిమా చేస్తాను. పటాస్-2 చేద్దామని ఇద్దరం అనుకున్నాం. ప్రస్తుతం మా కెరీర్ ప్రాసెస్ లో ఏదైనా మంచి స్లాట్ చూసుకొని కచ్చితంగా సినిమా చేస్తాం.”

ఇలా కల్యాణ్ రామ్ తో సినిమా చేస్తానంటూ ప్రకటించాడు అనీల్ రావిపూడి. ప్రస్తుతం ఎఫ్3 పనుల్లో బిజీగా ఉన్న దర్శకుడు.. కల్యాణ్ రామ్ కు తనకు మధ్య ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నాడు. తనకు, కల్యాణ్ రామ్ కు మధ్య ఎప్పుడూ గ్యాప్ రాదంటున్నాడు.

“పటాస్ రిలీజై పెద్ద హిట్టయింది. ఆ టైమ్ లో చేసిన సక్సెస్ టూర్ లో కల్యాణ్ రామ్, నేను మరింత బాగా కలిసిపోయాం. ఇప్పటికీ మా ఇద్దరి మధ్య బాండింగ్ అంతే స్వచ్ఛంగా ఉంది. మేం కలిసి సినిమాలు చేయకపోయినా మా మధ్య ఆ కనెక్ట్ ఉంది. మొన్న కూడా ఆయన వివాహ వార్షికోత్సవానికి ఫోన్ చేసి మాట్లాడాను. చాలా సరదాగా మాట్లాడుకున్నాం. మా మధ్య ఉన్న ఆ అనుబంధం ఎప్పటికీ పోదు.”

ఇటు కల్యాణ్ రామ్ కూడా వరుసగా సినిమాలు చేస్తున్నాడు. బింబిసార, డెవిల్ సినిమాలు రెడీ అవుతున్నాయి. మరో 2 ప్రాజెక్టులు పైప్ లైన్లో ఉన్నాయి. మళ్లీ వీళ్లిద్దరి కాంబోలో పటాస్-2 ఎప్పుడు తెరపైకొస్తుందో చూడాలి.