స్కంద రిజల్ట్ సంగతి పక్కనపెడదాం. ఆ సినిమాలో ఇద్దరు రామ్ లను చూపించిన విధానం మాత్రం చాలామందికి నచ్చలేదు. రామ్ ఒకడు కాదు, ఇద్దరు అనే విషయం తెలిసేసరికి ప్రేక్షకుడు చాలా కన్ఫ్యూజ్ అయ్యాడు. అదే మరో రామ్ స్థానంలో ఇంకో స్టార్ హీరోను పెడితే, సినిమా మరింత అద్భుతంగా ఉండేదని అభిప్రాయపడే వర్గం కూడా ఉంది.
ఈ వాదనకు పెర్ ఫెక్ట్ సమాధానం ఇచ్చాడు దర్శకుడు బోయపాటి. తనకు కూడా అలాంటి ఆలోచనలు వచ్చాయని, కానీ కావాలనే మరో హీరోను తీసుకోకుండా, రామ్ తోనే ద్విపాత్రాభినయం చేయించానని అన్నాడు. దీనికి సాలిడ్ రీజన్ చెప్పాడు.
“మరో రామ్ స్థానంలో రవితేజ, అల్లు అర్జున్, బాలయ్య.. ఇలా ఎవరినైనా తీసుకోవచ్చు. వీళ్లలో ఎవరైనా ఆ పాత్రలోకి వచ్చారనుకోండి. సినిమాలో ఆ ఫైట్ చాలా భారీగా ఉంటుంది. ట్రాక్టర్ గాల్లోకి లేస్తుంది. మరి అంత హై ఉన్నప్పుడు, ఫస్ట్ నుంచి చేసిన రామ్ ఏమైపోవాలి? అప్పటివరకు రామ్ భుజాలపై ఉన్న సినిమా మొత్తం వేరే హీరో భుజాలపైకి వెళ్లిపోతుంది. అది కరెక్టా? గెస్ట్ అని చెప్పి నేను ఊరికే పైపైన తీయను కదా. భారీగానే తీస్తాను. అలాంటప్పుడు ఫస్ట్ నుంచి ఎంతో కష్టపడి చివరి వరకు కొట్టుకుంటూ వచ్చిన రామ్ ఏమైపోవాలి? నిజంగా బన్నీ లేదా బాలయ్యను పెడితే ఫస్ట్ నుంచి ఉన్న రామ్ ను ప్రేక్షకులు మరిచిపోతారు. సినిమా బాగుంటుంది, నేను బాగుంటుంది, గెస్ట్ హీరో కూడా హ్యాపీ. మరి రామ్ పరిస్థితేంటి? అది నాకిష్టం లేదు. అందుకే మరో హీరోను పెట్టలేదు, రామ్ నే మరో గెటప్ లో చూపించాను.”
బోయపాటి సినిమాలు డ్యూయల్ రోల్స్ కు పెట్టింది పేరు. మరీ ముఖ్యంగా బాలయ్యతో చేసిన ప్రతి సినిమాలో ఆ హీరోను డ్యూయల్ రోల్ లో చూపించాడు బోయపాటి. కాబట్టి అది ఆయనకు సెంటిమెంట్ గా మారిందని, అందుకే రామ్ తో కూడా ద్విపాత్రాభినయం చేయించాడని చాలామంది అన్నారు.
అయితే తనకు అలాంటి సెంటిమెంట్స్ లేవని, మరో బలమైన పాత్రకు, ఇంకో హీరోను తీసుకుంటే, ప్రారంభం నుంచి సినిమాను మోసిన హీరోను క్రెడిట్ దక్కదని, అందుకే డ్యూయల్ రోల్స్ లో చూపిస్తుంటానని క్లారిటీ ఇచ్చాడు బోయపాటి.