కొత్త అవ‌తారానికి ఆనం సిద్ధ‌మ‌య్యారా?

ఉమ్మ‌డి నెల్లూరు జిల్లా రాజ‌కీయాల్లో ఆనం కుటుంబానికి నిన్న‌మొన్న‌టి వ‌ర‌కూ తిరుగులేదు. మారిన రాజ‌కీయ ప‌రిస్థితుల్లో వంశాలు క‌నుమ‌రుగ‌వుతున్నాయి. నెల్లూరు రాజ‌కీయాల్లో ఆనం కుటుంబానిది కూడా అదే ప‌రిస్థితి. ప‌దేప‌దే పార్టీలు మారుతూ అవ‌కాశ‌వాద…

ఉమ్మ‌డి నెల్లూరు జిల్లా రాజ‌కీయాల్లో ఆనం కుటుంబానికి నిన్న‌మొన్న‌టి వ‌ర‌కూ తిరుగులేదు. మారిన రాజ‌కీయ ప‌రిస్థితుల్లో వంశాలు క‌నుమ‌రుగ‌వుతున్నాయి. నెల్లూరు రాజ‌కీయాల్లో ఆనం కుటుంబానిది కూడా అదే ప‌రిస్థితి. ప‌దేప‌దే పార్టీలు మారుతూ అవ‌కాశ‌వాద రాజ‌కీయాల‌కు ఆనం కుటుంబ స‌భ్యులు పాల్ప‌డుతున్నార‌నే చెడ్డ‌పేరు తెచ్చుకున్నారు. ఈ నేప‌థ్యంలో ఒక్కో ఎన్నిక‌కు ఒక్కో పార్టీని ఎంచుకోవ‌డం మాజీ మంత్రి ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డికి అల‌వాటుగా మారింది.

ప్ర‌స్తుతం ఆయ‌న వెంక‌ట‌గిరి నుంచి ప్రాతినిథ్యం వ‌హిస్తున్నారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో టీడీపీ అభ్య‌ర్థికి ఓటు వేశార‌న్న కార‌ణంగా వైసీపీ నుంచి ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డిని స‌స్పెండ్ చేశారు. టీడీపీలో చేరుతార‌నే ప్ర‌చారం ఊపందుకుంది. 

ఏపీలో టీడీపీ, లేదంటే వైసీపీ మాత్ర‌మే ఆప్ష‌న్స్‌గా మారాయి. ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి విష‌యానికి వ‌స్తే నెల్లూరు పార్ల‌మెంట్ స్థానం నుంచి టీడీపీ త‌ర‌పున పోటీ చేస్తార‌నే ప్ర‌చారం ముమ్మ‌రంగా సాగుతోంది. అలాగే ఆయ‌న కుమార్తె కైవ‌ల్యారెడ్డి ఆత్మ‌కూరు నుంచి బ‌రిలో నిలుస్తార‌ని చెబుతున్నారు.

బ‌ద్వేలు మాజీ ఎమ్మెల్యే విజ‌య‌మ్మ కోడ‌లే కైవ‌ల్యారెడ్డి. బ‌ద్వేలు నియోజ‌క‌వ‌ర్గానికి అతి స‌మీపంలో ఆత్మ‌కూరు వుంటుంది. ఆత్మ‌కూరు నుంచి ఆనం గ‌తంలో ప్రాతినిథ్యం వ‌హించారు. కాంగ్రెస్ హ‌యాంలో మంత్రిగా ఆత్మ‌కూరు అభివృద్ధికి ఆనం కృషి చేశారు. ప్ర‌తి ఊళ్లో ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డికి స‌త్పంబంధాలున్న‌ట్టు టీడీపీ న‌మ్ముతోంది. ఆత్మ‌కూరులో కుమార్తెను నిల‌బెట్ట‌డం ద్వారా మ‌రోసారి ప‌ట్టు నిరూపించుకోవ‌చ్చ‌ని ఆయ‌న భావిస్తున్నార‌ని తెలిసింది. దీంతో ఆత్మ‌కూరులో చాప‌కింద నీరులా కైవ‌ల్యారెడ్డి రాజ‌కీయ కార్య‌క‌లాపాలు సాగించేందుకు ప్ర‌ణాళిక ర‌చిస్తున్నార‌ని స‌మాచారం.

ఆనం రాక‌తో ఉమ్మ‌డి నెల్లూరు జిల్లాలో టీడీపీ బ‌ల‌ప‌డుతుంద‌ని ఆ పార్టీ నేత‌లు న‌మ్మ‌కంతో ఉన్నారు. నెల్లూరు పార్ల‌మెంట్ బ‌రిలో ఆనం నిలిస్తే, గెలుపు అవ‌కాశాలుంటాయ‌నే ధీమాతో వున్నారు. నెల్లూరు ఎంపీ ఆదాల ప్ర‌భాక‌ర్‌రెడ్డి నెల్లూరు రూర‌ల్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేయ‌నున్నారు. ప్ర‌స్తుతానికి టీడీపీకి త‌గిన అభ్య‌ర్థి లేరు. ఆనం అయితే బాగుంటుంద‌ని, ఆయ‌న్ను పోటీ చేయించే ఆలోచన‌తోనే టీడీపీలో చేర్చుకునేందుకు చ‌ర్చ‌లు జ‌రుగుతున్న‌ట్టు స‌మాచారం. రానున్న రోజుల్లో నెల్లూరు రాజ‌కీయం రంజుగా మార‌నుంది.