బాలినేనిపై వైసీపీ ఎమ్మెల్యేల గుస్సా!

ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీ‌నివాస‌రెడ్డిపై సొంత పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు తీవ్ర ఆగ్ర‌హంగా ఉన్నారు. వైసీపీకి న‌ష్టం క‌లిగించేలా బాలినేని ఉద్దేశ పూర్వ‌కంగానే వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నేది వారి ఆరోప‌ణ‌. మీడియా ముందుకొచ్చి త‌న‌ను సొంత పార్టీ…

ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీ‌నివాస‌రెడ్డిపై సొంత పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు తీవ్ర ఆగ్ర‌హంగా ఉన్నారు. వైసీపీకి న‌ష్టం క‌లిగించేలా బాలినేని ఉద్దేశ పూర్వ‌కంగానే వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నేది వారి ఆరోప‌ణ‌. మీడియా ముందుకొచ్చి త‌న‌ను సొంత పార్టీ నేత‌లే టార్గెట్ చేస్తున్నార‌ని, పార్టీ మార్పుపై ప్ర‌చారం సాగ‌డాన్ని బాలినేని ప్ర‌స్తావిస్తూ, కన్నీటిప‌ర్యంతం కావ‌డం అంతా న‌ట‌న అని అధికార పార్టీ నేత‌లు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

టీటీడీ చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డితో ఏవైనా గొడ‌వలు వుంటే ఇంట్లో చూసుకోవాలే త‌ప్ప‌, పార్టీని బ‌జారుకీడ్చ‌డం ఏంట‌నే నిల‌దీత‌లు ఎదుర‌వుతున్నాయి. వైవీ సుబ్బారెడ్డి, బాలినేని బావాబామ్మ‌ర్దుల‌న్న సంగ‌తి తెలిసిందే. అయిన‌ప్ప‌టికీ రాజ‌కీయంగా ఇద్ద‌రి మ‌ధ్య తీవ్ర‌మైన వైరం వుంది. వైవీ సుబ్బారెడ్డి సిఫార్సుతో డీఎస్పీ వ‌చ్చాడ‌నే ఉద్దేశంతో, బాలినేని ర‌చ్చ ర‌చ్చ చేయ‌డాన్ని వైసీపీ ప్ర‌జాప్ర‌తినిధులు గుర్తు చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యేగా త‌న‌కు తెలియ‌కుండా ఎవ‌రైనా వ‌స్తే, నేరుగా సీఎం జ‌గ‌న్ లేదా ప్ర‌భుత్వ పెద్ద‌ల‌కు చెప్పొచ్చ‌ని వారు అంటున్నారు.

కానీ ఉద్దేశ పూర్వ‌కంగానే వైసీపీ కోఆర్డినేట‌ర్ ప‌ద‌వికి రాజీనామా చేయ‌డం, అల‌క‌లో ఉన్న‌ట్టు టీడీపీ అనుకూల మీడియాకు లీకులు ఇవ్వ‌డం, అలాగే ప్ర‌కాశం జిల్లాలో త‌న‌కు న‌చ్చ‌ని ఎమ్మెల్యేల‌కు వ్య‌తిరేకంగా ప‌ని చేయ‌డం వాస్త‌వం కాదా? అని అధికార పార్టీ నేత‌లు నిల‌దీస్తున్నారు. రెండురోజుల క్రితం మీడియా ఎదుట క‌న్నీళ్లు పెట్టుకోవ‌డం, ప‌రోక్షంగా వైవీ సుబ్బారెడ్డి, మంత్రి ఆదిమూల‌పు సురేష్‌పై ఘాటు విమ‌ర్శ‌లు చేయ‌డం దేనికి సంకేతం అంటూ ప్ర‌శ్నిస్తున్నారు.

దివంగ‌త వైఎస్సార్ రాజ‌కీయ భిక్ష పెట్టార‌ని అంటున్న బాలినేని… ఇప్పుడు ఆయ‌న త‌న‌యుడికి చేస్తున్న లాభం ఏంటో చెప్పాల‌ని అధికార పార్టీ నేత‌లు ప్ర‌శ్నిస్తున్నారు. సీఎం జ‌గ‌న్‌తో వైసీపీ ఎమ్మెల్యేల స‌మావేశాల్లో కూడా బాలినేని వ్యూహాత్మ‌కంగా న‌డుచుకోవ‌డాన్ని గుర్తు చేస్తున్నారు. సీఎంకు దూరంగా ఉంటూ, ఆయ‌న‌తో ప‌దేప‌దే పిలిపించుకోవ‌డం ద్వారా, త‌న ప‌లుకుబ‌డిని అందరికీ తెలియ‌జేసేందుకు బాలినేని చిల్ల‌ర‌గా ప్ర‌వ‌ర్తించ‌డాన్ని అధికార పార్టీ నేత‌లు గుర్తు చేస్తున్నారు.

వాస‌న్నా, వాస‌న్నా అని సీఎం పిలిపించుకోవ‌డం ద్వారా, అధికార పార్టీకి చెందిన మిగిలిన ఎమ్మెల్యేలు, మంత్రుల్లో ఒక ర‌క‌మైన భ‌యాన్ని సృష్టించాల‌నే ఎత్తుగ‌డ‌కు బాలినేని తెర‌లేప‌డాన్ని వారు గుర్తు చేస్తున్నారు. సీఎంకు స‌మీప బంధువుగా వైసీపీని బ‌లోపేతం చేయాల్సిన బాధ్య‌త పెట్టుకుని, అందుకు విరుద్ధంగా బాలినేని వ్య‌వ‌హ‌రించ‌డాన్ని పార్టీ ముఖ్య‌నేత‌లు అంత‌ర్గ‌త స‌మావేశాల్లో త‌ప్పు ప‌డుతున్నారు. ఇప్ప‌టికైనా వైసీపీకి ప్ర‌యోజ‌నం క‌లిగించేలా బాలినేని వ్య‌వ‌హ‌రించాల‌ని వారు కోరుకుంటున్నారు.