గౌత‌మ్ స‌వాంగ్‌కు త‌గిన శాస్తి

మాజీ డీజీపీ గౌత‌మ్ స‌వాంగ్ బ‌దిలీ వ్య‌వ‌హారంపై రాజ‌కీయ నేత‌లు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. కొంద‌రు గౌత‌మ్‌పై సానుభూతి ప్ర‌క‌టిస్తుండ‌గా, మ‌రికొంద‌రు త‌గిన శాస్తి జ‌రిగింద‌ని కామెంట్స్ చేస్తుండ‌డం గ‌మ‌నార్హం. పాల‌క వ‌ర్గాల‌కు కొమ్ము…

మాజీ డీజీపీ గౌత‌మ్ స‌వాంగ్ బ‌దిలీ వ్య‌వ‌హారంపై రాజ‌కీయ నేత‌లు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. కొంద‌రు గౌత‌మ్‌పై సానుభూతి ప్ర‌క‌టిస్తుండ‌గా, మ‌రికొంద‌రు త‌గిన శాస్తి జ‌రిగింద‌ని కామెంట్స్ చేస్తుండ‌డం గ‌మ‌నార్హం. పాల‌క వ‌ర్గాల‌కు కొమ్ము కాసిన గౌత‌మ్ స‌వాంగ్‌కు జ‌గ‌న్ ప్ర‌భుత్వం త‌గిన శాస్తే చేసింద‌ని సీపీఐ జాతీయ కార్య‌ద‌ర్శి కె.నారాయ‌ణ ఘాటు విమ‌ర్శ చేశారు.

నారాయ‌ణ మీడియాతో మాట్లాడుతూ డీజీపీ గౌత‌మ్ స‌వాంగ్ బ‌దిలీ ఒక క‌నువిప్పు కావాల‌న్నారు. పాల‌క వ‌ర్గం ఏం చెబితే అది చేయాల‌నుకుంటే చివ‌రికి ఇలాంటి ప‌రిస్థితినే ఎదుర్కోవాల్సి వుంటుంద‌న్నారు. ఒక‌ప్పుడు ఇదే గౌత‌మ్ స‌వాంగ్ చాలా ఎఫెక్టీవ్ ఆఫీస‌ర్ అని ప్ర‌శంసించారు. త‌న‌కు వ్య‌క్తిగ‌తంగా తెలుస‌న్నారు.

అలాంటి అధికారి ఏ విధంగా దిగ‌జారారో అర్థం చేసుకోవ‌చ్చ‌న్నారు. ఒక‌సారి త‌ప్పు చేయ‌డం మొద‌లు పెడితే, ఒక్క మంచి ప‌ని చేయ‌డానికి కూడా పాల‌క వ‌ర్గం అంగీక‌రించ‌ద‌న్నారు. ఇదే ప‌రిస్థితి గౌత‌మ్‌స‌వాంగ్‌కు వ‌చ్చింద‌న్నారు. ఐఏఎస్ అధికారి ఎల్వీ సుబ్ర‌హ్మ‌ణ్యం బ‌దిలీని కూడా ఆయ‌న ప్ర‌స్తావించారు. 

అలాగే పీవీ ర‌మేశ్ ఎఫెక్టీవ్ అఫీస‌ర్ అని చెప్పుకొచ్చారు. ఆయ‌న‌కు సీఎస్ ప‌దవి ఇస్తామ‌ని చెప్పార‌న్నారు. ఆ త‌ర్వాత ఆయ‌న ఏమ‌య్యార‌ని ప్ర‌శ్నించారు. గ‌తంలో టీడీపీ హ‌యాంలో ప‌ని చేసిన అధికారుల‌కు ప‌నిష్మెంట్ ఇచ్చార‌ని ఆరోపించారు. ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావు , త‌దిత‌ర అధికారుల‌ను ఇబ్బంది పెట్ట‌డాన్ని తాను త‌ప్పు ప‌ట్ట‌న‌న్నారు.

ఎందుకంటే మీకు (జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి) ఇష్టం లేదు కాబ‌ట్టి అలా చేశార‌న్నారు. కానీ మీకు అనుకూలంగా ఉండి, అన్ని దుర్మార్గాల్ని భ‌రించిన గౌత‌మ్ స‌వాంగ్ లాంటి వారిని ఇంత అన్యాయంగా తీసేయాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు. అత‌నికి త‌గిన శాస్తే జ‌రిగింద‌ని నారాయ‌ణ ఘాటు వ్యాఖ్య చేశారు. 

ఇలాంటి అధికారుల‌కు త‌గిన శాస్తి జ‌ర‌గాల్సిందే అని నారాయ‌ణ స్ప‌ష్టం చేశారు. ఈ ఘ‌ట‌న మిగిలిన ఐఏఎస్‌, ఐపీఎస్ అధికారుల‌కు క‌నువిప్పు కావాల‌ని ఆయ‌న ఆకాంక్షించారు. మీ బాధ్య‌త మీరు చేయండ‌ని ఆయ‌న అధికారుల‌కు హిత‌వు చెప్పారు. ఒక‌వేళ చేయ‌లేక‌పోతే దండం పెట్టి మారిపోవాల‌ని సూచించారు. అంతేగానీ త‌ప్పుల మీద త‌ప్పులు చేసి ఒక హీన చ‌రిత్ర‌ని భుజాన వేసుకుని ప‌ద‌వీ విర‌మ‌ణ చేయొద్ద‌ని హిత‌వు ప‌లికారు.