పీపుల్స్ మీడియా..పారా హుషార్!

టాలీవుడ్ లో పాపులర్ ప్రొడక్షన్ హౌస్ మాత్రమే కాదు, మంచి ప్రొడక్షన్ హౌస్ గా పేరు తెచ్చుకుంది పీపుల్స్ మీడియా. ఈ ప్రొడక్షన్ హౌస్ చేతిలో దాదాపు డజనుకు పైగా సినిమాలు వున్నాయి. ప్రభాస్..పవన్…

టాలీవుడ్ లో పాపులర్ ప్రొడక్షన్ హౌస్ మాత్రమే కాదు, మంచి ప్రొడక్షన్ హౌస్ గా పేరు తెచ్చుకుంది పీపుల్స్ మీడియా. ఈ ప్రొడక్షన్ హౌస్ చేతిలో దాదాపు డజనుకు పైగా సినిమాలు వున్నాయి. ప్రభాస్..పవన్ కళ్యాణ్..లాంటి టాప్ హీరోల సినిమాలు షూటింగ్ లో వున్నాయి. ఇంకా చాలా సినిమాలు డిస్కషన్ లో, పైప్ లైన్ లో వున్నాయి. ఇప్పుడు ఇండస్ట్రీ దృష్టి అంతా పీపుల్స్ మీడియా పైనే. ఎవరు కథ చెప్పాలన్నా, ఎవరు సినిమా కోసం ప్రయత్నిస్తున్నా కేరాఫ్ అడ్రస్ పీపుల్స్ మీడియానే.

కానీ పీపుల్స్ మీడియా అధినేతల అమాయకత్వం లేదా అతి మంచితనం వాళ్ల కాళ్ల కిందకు నీళ్లు తెస్తున్నట్లు కనిపిస్తోంది. ఆ మాట ఈ మాట చెప్పి పీపుల్స్ మీడియా అధినేతలను బుట్టలో పడేయడం సులువు అన్న టాక్ మొదలైంది. రిజెక్టెడ్ సబ్జెక్ట్ లు పీపుల్స్ మీడియాను వెదుక్కుంటూ వెళ్తున్నాయనే టాక్ వినిపిస్తోంది. ఎవరైనా కథ చిన్న లైన్ చెప్పి ఒప్పించగలిగితే చాలు, ఆఫీసు తీసి, అసిస్టెంట్ లను జతచేసి మరీ కూర్చో పెట్టేస్తున్నారని చెప్పుకుంటున్నారు. ఓ పెద్ద హీరో ప్రాజెక్ట్ పీపుల్స్ మీడియాను వెదుక్కుంటూ వెళ్లింది. పెద్ద ప్రాజెక్ట్ కాబట్టి ఫరవాలేదు.

ఈ మధ్య ఓ చిన్న హీరో సినిమా రెండు మూడు సినిమా ఆఫీసులు తిరిగింది. ఎవరికీ ఆ కథ నచ్చలేదు. అది ఇప్పుడు పీపుల్స్ మీడియాలో వర్కవుట్ అవుతోందని బోగట్టా. రామబాణం సినిమా చూసిన వారు ఆ ఖర్చు ఏమిటి అని ప్రశ్నిస్తున్నారు. ఎంత డైరక్టర్ చెబితే మాత్రం నిర్మాతలు గుడ్డిగా ఊ కొట్టేసి, ఖర్చు పెట్టేస్తారా అంటున్నారు. ఒక్కో సీన్ లో అంత మంది జనాలు, సెట్ లు, భారీ పిక్చరైజేషన్ లు కలిసి ఆ సినిమా బడ్జెట్ ను 45 కోట్లకు పెంచేసాయి.

దర్శకుడు ఎన్ని చెప్పినా, సినిమా చూసిన తరువాత గోపీచంద్ సినిమా మీద అంత ఖర్చు అవసరమా అంటున్నారు. సినిమా నాన్ థియేటర్ హక్కులు 30 కోట్ల మేరకు వచ్చాయి. సినిమాను కనుక 35 కోట్లలో ఫినిష్ చేసి వుంటే వేరుగా వుండేది.

అతి మంచి తనం వల్ల పీపుల్స్ మీడియా అధినేతలు ఖర్చును కంట్రోలు చేయలేకపోతున్నారనే టాక్ వుంది. టాలీవుడ్ లో భారీ నిర్మాణం సంస్థలు ఏవి వచ్చినా, టాలీవుడ్ జనం అహో..ఒహో అంటూ ఆకాశానికి ఎత్తేస్తారు. తడి వున్నంత వరకు భజనలు సాగుతూనే వుంటాయి. ఆ మత్తులో కనుక బ్లయిండ్ గా ముందుకు వెళ్తే, ఓడలు బళ్లుగా మారిపోతాయి. 

గతంలో వచ్చిన అనేక సంస్ధలు ఇలా దుడుకుగా ముందుకు వెళ్లి, కనుమరుగయ్యాయి. వీటి అనుభవాన్ని పీపుల్స్ మీడియా పరిగణనలోకి తీసుకోవాల్సి వుంది.

ఇప్పటికే ఇబ్బడిముబ్బడిగా అడ్వాన్స్ లు ఇచ్చారు. ముందు ఇవన్నీ వర్కవుట్ చేసుకోవాలి. అవసరమైనవి వుంచుకోవాలి. అక్కరలేనివి వదుల్చుకోవాలి. లేదూ అంటే వడ్డీల భారం తప్ప ఒరిగేది ఏమీ లేదు. సంస్థకు మంచి పేరు వుంది. మంచి వ్యక్తులనే పేరు వుంది. కాస్త రీజనబుల్ గా ఖర్చు చేస్తూ, జాగ్రత్తగా ముందుకు వెళ్తే పీపుల్స్ మీడియా లాంటి సంస్థల పది కాలాలు మనగలుగుతాయి. ఎందుకంటే టాలీవుడ్ కు అది చాలా అవసరం.