ఆ డైరక్టర్ గురించి మాట్లాడడం వేస్ట్

దర్శకుడు పరుశురామ్-హీరో నాగ్ చైతన్య సినిమా మల్లగుల్లాల సంగతి తెలిసిందే. చైతన్యతో సినిమా ఓకె చేసుకుని, లాస్ట్ మినిట్ లో మహేష్ బాబు దగ్గరకు జంప్ అయ్యారు. మళ్లీ ఈ మధ్య మరోసారి అదే…

దర్శకుడు పరుశురామ్-హీరో నాగ్ చైతన్య సినిమా మల్లగుల్లాల సంగతి తెలిసిందే. చైతన్యతో సినిమా ఓకె చేసుకుని, లాస్ట్ మినిట్ లో మహేష్ బాబు దగ్గరకు జంప్ అయ్యారు. మళ్లీ ఈ మధ్య మరోసారి అదే పని చేసారు. ఈసారి విజయ్ దేవరకొండ దగ్గరకు జంప్ అన్నారు. ఇప్పుడు ఆ సమస్య నలుగుతోంది. పరుశురామ్ కు భారీగా అడ్వాన్స్ ఇచ్చి వడ్డీలు కట్టుకుంటున్న 14రీల్స్ అధినేతలు ఈ విషయంలో గట్టిగా పట్టుకున్నారు. ఇప్పుడు ఆ సమస్య అలా నలుగుతోంది.

ఇదిలా వుంటే పరుశురామ్ గురించి మాట్లాడుకోవడమే వేస్ట్ అంటున్నారు హీరో నాగ్ చైతన్య. కస్టడీ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా చైతన్య ‘గ్రేట్ ఆంధ్ర’తో మాట్లాడారు. ఈ సందర్భంగా ఓ ప్రశ్నకు సమాధానం ఇస్తూ,’’ ఏం జరిగిందో మీకు తెలుసు…ఆయన నా టైమ్ వేస్ట్ చేసారు. అలాంటి వ్యక్తి గురించి మాట్లాడుకోవడం టైమ్ వేస్ట్ ‘’ అని అన్నారు. త్వరలో ఓ సినిమాను శివనిర్వాణ డైరక్షన్ లో చేయబోతున్నట్లు చెప్పారు.

కస్టడీ సినిమా తన కెరీర్ లో మంచి సినిమా అవుతుందని, కస్టడీ అనేది ఈ సినిమాకు యాప్ట్ టైటిల్ అవుతుందని చైతన్య అన్నారు. అరవింద్ స్వామి, శరత్ కుమార్ ల క్యారెక్టర్లు ఈ సినిమాలో చాలా కీలకం అని చెప్పారు. అరవింద్ స్వామి క్యారెక్టర్ లో అన్ని రకాల ఎమోషన్లు వుంటాయన్, కొత్తగా వుంటుందని అన్నారు. ఈ రెండు బలమైన క్యారెక్టర్ల మధ్యన తన క్యారెక్టర్ ఏ విధంగా వుంటుందన్నదే ఇంటస్ట్రింగ్ పాయింట్ అన్నారు.

హీరోయిన్ కృతిశెట్టి పాత్ర కూడా థ్రూ అవుట్ ట్రావెల్ అవుతుందని, సినిమా సీరియస్ అవుతోంది అనుకున్నపుడల్లా ఈ పాత్ర ఫన్ పండిస్తుందని అన్నారు. ఈ సినిమాకు ఇళయరాజా ఒకేసారి నాలుగు ట్యూన్ లు ఇచ్చారని, ఆయన వర్కింగ్ స్టయిల్ ఎలా వుంటుంది అన్న క్యూరియాసిటీతో తాను తొలిసారి మ్యూజిక్ సిట్టింగ్స్ కు వెళ్లా అన్నారు. సినిమాకు ఆయన ఇచ్చిన బ్యాక్ గ్రవుండ్ స్కోర్ చాలా కొత్తగా వుంటుందన్నారు.

అక్కినేని ఫ్యాన్స్ కు ఓ మాంచి హిట్ ఇవ్వాలనే ప్రెజర్ తన మీద కచ్చితంగా వుందని చైతన్య అన్నారు. ఫ్యామిలీ, లవ్, ఎంటర్ టైన్ మెంట్ సినిమాలు చూస్తున్నారు, కానీ థియేటర్ కు రప్పించాలంటే కొత్త పాయింట్ తో సమ్ థింగ్ వుండాల్సిన అవసరం ఏర్పడిందని చైతన్య అన్నారు.

థాంక్యూ సినిమా కథ విన్నపుడు చాలా బాగా అనిపించిందని, కానీ ఎడిట్ లో చూసిన తరువాత డౌట్ కొట్టిందని చైతన్య వెల్లడించారు. ఇది ఎవరి తప్పూ కాదని, అందరు కలిసి ఓకె చేసిన కథ,అందరూ కలిసి చేసిన సినిమా. బాగా రాలేదని తెలిసినా, సినిమాను బయటపడేయక తప్పదని అన్నారు.

సినిమా బాగా లేదని తెలిసిన తరువాత అదే సినిమాకు ప్రమోట్ చేయడం కాస్త కష్టమైన పనే అని చైతన్య ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ప్రస్తుతం తన జీవితం హ్యాపీగా వుందని, కానీ అప్పుడప్పుడు ఓ సెక్షన్ ఆఫ్ మీడియా కావాలని ఏదో ఒకటి రాసి, వేరే వాళ్లను తనతో ముడిపెట్టి, అనవసరపు రాద్దాంతం చేస్తోందని చై ఫీలయ్యారు.