చంద్రబాబు నెత్తిమీద నెరిసిన వెంట్రుక కూడా పీకలేరని లోకేశ్ అన్నాడు. తండ్రి మీద గౌరవం వుండడం న్యాయమే. మనందరికంటే బాబు గురించి లోకేశ్‌కే ఎక్కువ తెలుసు కాబట్టి, ఆ మాట అనగలిగాడు.
నిజమే, బాబుని ఇన్నేళ్లలో ఎవరూ ఏమీ పీకలేకపోయారు. ఎందుకంటే ఆయన నాయకుడు కాదు, మేనేజర్. పొలిటికల్ లీడర్ని ఎదుర్కోవడం సులభం. పొలిటికల్ మేనేజర్ని ఎదుర్కోవడం చాలా కష్టం.
మేనేజ్మెంట్ స్కిల్స్‌తో ఎక్కడా దొరక్కుండా గేమ్ ఆడడం బాబు స్పెషాలిటీ. అందుకే కెరీర్ బిగినింగ్‌లోనే జెడ్పీ చైర్మన్‌గా పార్టీ అభ్యర్థిని ఓడించడానికి క్యాంపులు పెట్టగలిగాడు. సస్పెన్షన్ ఎత్తి వేయించుకున్నాడు. ఎన్టీఆర్‌కి తొడ కొట్టాడు. తర్వాత అక్కడే శరణు కోరాడు. నాదెండ్ల సంక్షోభంలో అంతా తానే చేశానని బిల్డప్ ఇచ్చాడు. 85 తర్వాత కర్షక పరిషత్ చైర్మన్‌గా చక్రం తిప్పాడు.
రెండెకరాల రైతుకి తిరుపతిలో విష్ణుప్రియ హోటల్ (ఇప్పుడు కెన్సెస్), వెంకటగిరిలో వందల ఎకరాల భూములు ఎలా వచ్చాయో ఎవరూ ప్రశ్నించకుండా చేసుకున్నాడు. లేతగా వుంటేనే ఏం పీకలేనప్పుడు ముదిరిన తర్వాత ఇంకేం పీకుతారు?
మెజార్టీ ఎమ్మెల్యేలు లేకపోయినా, ఉన్నట్టు అనుకూల మీడియాతో నాటకం ఆడించి, ఎన్టీఆర్ నుంచి పదవి లాక్కున్నాడు. లక్ష్మీపార్వతి లేకపోయినా ఏదో ఒక రోజు ఎన్టీఆర్‌కి అదే గతే! ఆమె ఒక సాకు మాత్రమే.
ప్రజలతో రాముడు, కృష్ణుడు అని పూజలందుకున్న ఎన్టీఆరే చంద్రబాబుని ఏం చేయలేక కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఊరూరా ఉపన్యాసాలు ఇచ్చి సాధించుకున్న అధికారాన్ని గద్దలా తన్నుకుపోతే బాధతో గుండె ఆగి చచ్చిపోయాడు తప్ప, ఏం పీకగలిగాడు?
బ్రీఫ్డ్ మి అని అడ్డంగా దొరికిపోతే అపర చాణక్యుడిగా పేరు గాంచిన కేసీఆర్ కూడా ఏం చేయలేకపోయాడు. జీరోతో మొదలై వేల కోట్లకి ఎదిగిన మిమ్మల్ని ఎవరు మాత్రం ఏం చేయగలరు? అవినీతి నిర్మూలన నా ధ్యేయం అంటూ ఊరూరా స్పీచ్‌లు ఇస్తుంటే ఎవరైనా ఏమైనా పీకారా?
కాలం గొప్పతనం ఏమంటే ఎప్పుడూ ఒకరి వైపే వుండదు. ప్రతి ఒక్కరి లెక్కలు తేలుస్తుంది. మహా వృక్షాల్ని కూడా వేళ్లతో పీకి పారేసే ఒకడు వస్తాడు. వేటగాళ్లకి వేటగాడు. బహుశా వచ్చాడేమో! కొంచెం నోరు జాగ్రత్త. పిల్లకాకికి ఏం తెలుసు ఉండేలు దెబ్బ?