ఎన్నేళ్లు డేటింగ్‌లో ఉన్నామన్నది ముఖ్యం కాదు. పెళ్లి చేసుకుంటారా? లేదా? అనేదే ప్రధానం. ముఖ్యంగా పెళ్లి అనేది మహి ళలకు కొండంత భరోసా, గౌరవాన్ని ఇస్తుంది. ఏ దేశమేగినా ప్రియురాలి మొట్టమొదటి ప్రాధాన్యం పెళ్లే. అయితే 8 ఏళ్లుగా ఓ ప్రేమ జంట డేటింగ్‌లో ఉంటోంది. వాళ్లిద్దరి మధ్య అనురాగానికి ప్రతీకగా ఓ బిడ్డ కూడా జన్మించింది.
అయితే పెళ్లి చేసుకోవాలని ఆ ప్రియురాలి వేడుకోలును ప్రియుడు పెడచెవిన పెట్టాడు. దీంతో తనకు ప్రియుడు అన్యాయం చేశాడని, తగిన న్యాయం చేయండి మహాప్రభో అంటూ ఆ ప్రియురాలు న్యాయన్థానాన్ని ఆశ్రయించింది. ఇంతకూ ఆ ధర్మాసనం ఏం చెప్పిందో తెలుసుకుందాం.
జాంబియా దేశంలో గెర్టూన్ నోమా (26), హెర్బర్ట్ సలాలికి (28) మధ్య 8 సంవత్సరాల క్రితం ప్రేమ చిగురించింది. అది కాస్తా ఇంతింతై అన్నట్టు రోజుల గడుస్తున్న కొద్ది బలపడింది. వాళ్ల ప్రేమ పండంటి బిడ్డను కనింది. తనను పెళ్లి చేసుకోవాలని ఆమె కోరుతూ వచ్చింది. అంతేకాదు, ఆ యువతి తల్లిదండ్రులు అతనికి వరకట్నం కూడా ఇచ్చారు. కానీ పెళ్లి ప్రస్తావన వస్తే మాత్రం అతను తప్పించుకు తిరుగుతున్నాడు.
దీంతో గెర్టూన్ నోమాకు అతనిపై అనుమానం కలిగింది. తనను మోసం చేశాడేమో అనే భావన వేధించసాగింది. పెళ్లి చేసుకోవాలని ప్రాథేయపడినా పట్టించుకోని ప్రియుడి నిర్లక్ష్యంపై ఆమెకు కోపం వచ్చింది. ఓపిక నశించిన ఆ యువతి ఈ విషయమై న్యాయస్థానంలోనే తేల్చుకోవాలని నిర్ణయించుకొంది. దీంతో ఆమె కోర్టుకెక్కింది.
గతంలో తన వేలికి ఉంగరం తొడుగుతానని మాటిచ్చాడని, కానీ అది ఇంతవరకు జరగలేదని పిటిషన్‌లో పేర్కొంది. ఇంతకాలం తన సమయాన్ని వృధా చేశాడని, ప్రియుడి వ్యవహారం చూస్తుంటే తనను మోసం చేస్తున్నాడేమోనన్న అనుమానం కలుగుతోందని కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. తన భవిష్యత్ ఏంటో తేల్చాలని న్యాయస్థానాన్ని ఆమె అభ్యర్థించింది.
ప్రియుడు సలాలికి వాదన మరోలా ఉంది. ప్రియురాలైన గెర్టూన్ నోమా తనను సరిగా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రేమ జంట వాదనల్ని విన్న న్యాయమూర్తి ఆసక్తికర సలహా ఇచ్చారు. అసలు ఈ సమస్యపై న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సిన అవపరం లేదన్నారు.
దీనికి కోర్టు వెలుపలే సమాధానం , పరిష్కారం లభిస్తుందన్నారు. కావున సమస్యను బయటే పరిష్కరించుకోవాలని సూచించారు. ఈ మొత్తం ఎపిసోడ్‌లో ట్విస్ట్ ఏంటంటే …. భార్యాబిడ్డల్ని పోషించే ఆర్థిక స్తోమత లేకపోవడం వల్లే పెళ్లికి అతను నిరాకరిస్తున్నాడని తేలింది.