వెండితెరపై విజయశాంతి ఓ వెలుగు వెలిగిన హీరోయిన్. కర్తవ్యం సినిమాతో ఆమె మహిళలకు స్ఫూర్తిదాయకంగా నిలిచారు. ఆ సినిమాలో విజయశాంతి పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్‌ను ఇన్‌స్పిరేషన్‌గా తీసుకుని చాలా మంది అమ్మాయిలు ఆ డిపార్ట్‌మెంట్‌ను ఎంపిక చేసుకున్నారు.
పురుషాధిక్యత రాజ్యమేలే చిత్రపరిశ్రమలో ఓ హీరోయిన్ లీడ్ రోల్ చేయడం నిజంగా అద్భుతమే. అందుకే విజయశాంతికి లేడీ అమితాబ్ అనే పేరు వచ్చింది.
అలాంటి విజయశాంతి ఆ తర్వాత కాలంలో రాజకీయాల్లో ప్రవేశించారు. గొప్పనటిగా పేరున్న విజయశాంతి తాజాగా తన కంటే నటనలో గొప్ప ఎవరో తేల్చి చెప్పారు. బీజేపీలో చేరిన తర్వాత తొలిసారిగా హైదరాబాద్‌లో ఆ పార్టీ కార్యాలయం వేదికగా కేసీఆర్‌పై పంచ్ డైలాగ్‌లతో విరుచుకుపడ్డారు.
కేసీఆర్ తనకంటే గొప్ప నటుడని విజయశాంతి వ్యంగ్యంగా అన్నారు. కేసీఆర్ తెలంగాణ ప్రజల రక్తం కూడు తింటున్నారని తీవ్రస్థాయిలో విమర్శించారు. అమరవీరుల శవాలపై కూచుని కేసీఆర్ పాలన చేస్తున్నారని విజయశాంతి ధ్వజమెత్తారు.
కేసీఆర్ పతనం మొదలైందని, టీఆర్ఎస్ కనుమరుగవటం ఖాయమని ఆమె జోస్యం చెప్పారు. టీఆర్ఎస్‌తో కాంగ్రెస్ మ్యాచ్ ఫిక్సింగ్ అయిందని, భవిష్యత్ బీజేపీదేనని ఆశాభావం వ్యక్తం చేశారు.