అదే నిజ‌మైతే… జ‌గ‌న్ స‌ర్కార్‌ది త‌ప్పే!

బీజేపీ రాజ‌కీయ ఎజెండా ఏంటో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ప్ర‌స్తుతం క‌ర్నాట‌క‌లో హిందూమ‌తం పేరుతో సెంటిమెంట్‌ను ఏ విధంగా ర‌గిల్చేందుకు ప్ర‌య‌త్నిస్తున్న‌దో చూడొచ్చు. తాజాగా ఏపీ స‌ర్కార్‌పై బీజేపీ నేత‌లు తీవ్ర ఆరోప‌ణ‌లు చేస్తున్నారు.…

బీజేపీ రాజ‌కీయ ఎజెండా ఏంటో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ప్ర‌స్తుతం క‌ర్నాట‌క‌లో హిందూమ‌తం పేరుతో సెంటిమెంట్‌ను ఏ విధంగా ర‌గిల్చేందుకు ప్ర‌య‌త్నిస్తున్న‌దో చూడొచ్చు. తాజాగా ఏపీ స‌ర్కార్‌పై బీజేపీ నేత‌లు తీవ్ర ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. గుంటూరులో రాత్రికే రాత్రే ఏటీఅగ్రహారాల్ని ఫాతిమాపురంగా మార్చారంటూ బీజేపీ తీవ్ర ఆరోప‌ణ‌లు గుప్పిస్తోంది. బీజేపీ ఆరోపిస్తున్న‌ట్టు ఏపీ స‌ర్కార్ చేసి వుంటే…. నిజంగా ఇది త‌ప్పే.

బీజేపీ కోరుకుంటున్న‌దే వైసీపీ చేస్తున్న‌ట్టుగా అనుమానించాల్సి వుంటుంది. మ‌తం పేరుతో విద్వేషాలు ర‌గ‌ల‌కుండా చూసుకోవాల్సిన బాధ్య‌త జ‌గ‌న్ స‌ర్కార్‌పై వుంటుంది. అలాకాకుండా మ‌త‌ప‌ర‌మైన విద్వేషాల‌కు దారి తీసేలా ప్ర‌భుత్వ‌మే  వివాదాస్ప‌ద నిర్ణ‌యాలు తీసుకుంటే, క్ష‌మించ‌రాని త‌ప్పిద‌మ‌వుతుంది. 

ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మీడియాతో మాట్లాడుతూ హిందువుల మ‌నోభావాల్ని దెబ్బ‌తీయాల‌ని వైసీపీ అదే ప‌నిగా పెట్టుకుంద‌ని ఆరోపించారు. గుంటూరులో అగ్ర‌హారం పేరును తీసేసి రాత్రికి రాత్రి ఫాతిమా పేరుతో బోర్డు పెట్ట‌డంలో జ‌గ‌న్ ప్ర‌భుత్వ ఉద్దేశం ఏంట‌ని ఆయ‌న నిలదీశారు.

విశాఖ నగరంలో సీతమ్మ కొండ పేరు మార్చడం, అలాగే ప్రొద్దుటూరులో టిప్పుసుల్తాన్ విగ్రహం పెట్టాలనే ప్రయత్నం ఈ తరహా సంఘటనలకు ఎవరు సూత్రధారి అంటూ ఆయ‌న‌ నిలదీశారు. ముస్లింల కోసం చట్టాలు మారుస్తామని ప్రకటిస్తున్నారని ధ్వ‌జ మెత్తారు. హిందూ ఎస్సీలకు వ్యతిరేకంగా ప్రభుత్వ వైఖ‌రి చూస్తే… హిందువులపై దాడులకు తెగబడే విధంగా వైసీపీ వ్యవహరిస్తోందని దుయ్య‌బ‌ట్టారు. ఓటు బ్యాంకు రాజకీయాల‌ కోసం ప్రజలను విడదీయడం దుర్మార్గమని విరుచుకుప‌డ్డారు.

ఏపీ బీజేపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విష్ణువ‌ర్ధ‌న్‌రెడ్డి వెలువ‌రించిన ప్ర‌క‌ట‌న‌లో పేరు మార్పుపై ధ్వ‌జ‌మెత్తారు. ఇప్పుడు కొందరు ప్రభుత్వ అండతో కాలనీలకు కాలనీలనే మతం దురహంకారంతో పేర్లు మార్చేస్తున్నారని విమ‌ర్శించారు. రాత్రికి రాత్రే గుంటూరులో ఏటీ అగ్రహారం… ఫాతిమాపురంగా ఎలా మారింద‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. పాకిస్థాన్ జాతిపిత పేరు మనకెందుకంటే కేసులు పెడతార‌ని విమర్శించారు. ఇలాంటి రాజకీయాలు చేస్తే హిందూ సమాజం ఏదీ ఉంచుకోద‌ని ఆయ‌న హెచ్చ‌రించారు.