వెండితెరపై పంచ్ డైలాగ్స్ కొట్టినోళ్లు చాలామంది ఉన్నారు. కానీ రియల్ లైఫ్ లో కూడా పంచ్ లు విసిరేవాళ్లు చాలా తక్కువమంది కనిపిస్తారు. మోహన్ బాబు అలాంటి రేర్ పీస్. ఉన్నదున్నట్టు మాట్లాడ్డం, తనకు నచ్చని వాళ్లను కడిగి పారేయడం ఈయన నైజం.
ఈ విషయంలో ఆయన ముందువెనక ఆలోచించరు. ఆయన ప్రేమించినా అలానే ఉంటుంది, ద్వేషించినా అదే స్థాయిలో ఉంటుంది. ఇలాంటి వ్యక్తి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. సరిగ్గా ఇక్కడే అందరికీ ఓ అనుమానం మొదలైంది.
రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానంటే దానర్థం ఇకపై ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనని. మోహన్ బాబు కూడా అదే చెప్పారు. అయితే ఆయన కేవలం ఎన్నికల బరి నుంచే తప్పుకున్నారా లేక రాజకీయాల గురించి మాట్లాడ్డం కూడా తగ్గించేస్తారా అనేది చాలామంది అనుమానం.
అనుమానం వెనక అసలు రీజన్
చాలామంది జనాల్లో ఈ అనుమానం రావడానికి ఓ రీజన్ ఉంది. మోహన్ బాబు మాట్లాడితే చెంప ఛెళ్లుమంటుంది. మరీ ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు గురించి ఆయన మాట్లాడితే గూబ గుయ్ మంటుంది. ఎవరికి ఎలా తగలాలో అలా తగులుతుంది. తెరవెనక కథలు చాలా బయటకొస్తుంటాయి. ఇదే ఇప్పుడు కొందరి అనుమానం. ఇకపై మోహన్ బాబు నుంచి చంద్రబాబుకు సెటైర్లు పడతాయా పడవా? మునుపటి పంచ్ లు రిపీట్ అవుతాయా అవ్వవా అనేది కొందరి డౌట్.
అయితే మోహన్ బాబు మాత్రం దీనిపై క్లారిటీ ఇవ్వలేదు. ఈ జీవితానికి ఇది చాలు, ప్రత్యక్ష రాజకీయాలు ఇక లేవు అనే సింగిల్ లైన్ డైలాగ్ మాత్రమే కొట్టారు. ఇకపై ఆయన రాజకీయాలపై స్పందిస్తారా, స్పందించరా? మరీ ముఖ్యంగా చంద్రబాబుపై ఆయన పంచ్ లు కొనసాగుతాయా, సాగవా అనే అనుమానాలు అలానే ఉన్నాయి.
అయితే మోహన్ బాబు గురించి తెలిసిన వాళ్లకు మాత్రం ఇలాంటి అనుమానాల్లేవ్. ఎందుకుంటే, ఒక్కసారి మైక్ పట్టుకుంటే మోహన్ బాబులో ఆవేశం కట్టలు తెంచుకుంటుంది. ఆయన విరుచుకుపడడం ప్రారంభిస్తే, దాన్ని ఎవ్వరూ ఆపలేరు. గతంలో ఎన్నో సందర్భాల్లో అది నిరూపితమైంది. కాబట్టి రాజకీయాల నుంచి తప్పుకున్నప్పటికీ, మోహన్ బాబులో ఆ ఫైర్ మాత్రం ఎప్పటికీ పోదని, సమయానుకూలంగా అది బయటపడుతుందని చెబుతున్నారు.