మోడీ జ‌మానాలో తొలిసారి.. చ‌ర్చ‌లకు పిలుపు!

ఏ నిర్ణ‌యం అయినా అర్ధ‌రాత్రి ప్ర‌క‌టించ‌డ‌మో, అర్ధ‌రాత్రి అమ‌లు చేయ‌డ‌మో మోడీ మార్కు పాల‌న ఇన్నాళ్లూ! నోట్ల ర‌ద్దు ద‌గ్గ‌ర నుంచి అనేక అంశాల‌పై ఎలాంటి చ‌ర్చ‌లు లేకుండానే నిర్ణ‌యాల‌ను ప్ర‌క‌టించేశారు. ఆ నిర్ణ‌యాల…

ఏ నిర్ణ‌యం అయినా అర్ధ‌రాత్రి ప్ర‌క‌టించ‌డ‌మో, అర్ధ‌రాత్రి అమ‌లు చేయ‌డ‌మో మోడీ మార్కు పాల‌న ఇన్నాళ్లూ! నోట్ల ర‌ద్దు ద‌గ్గ‌ర నుంచి అనేక అంశాల‌పై ఎలాంటి చ‌ర్చ‌లు లేకుండానే నిర్ణ‌యాల‌ను ప్ర‌క‌టించేశారు. ఆ నిర్ణ‌యాల దెబ్బ‌కు సామాన్యులు ముప్పుతిప్ప‌లు ప‌డినా.. అదంతా దేశ‌భ‌క్తికి ప్ర‌తిరూపం అని భ‌క్తులు సెల‌విచ్చారు.

ఎవ‌రితోనూ సంప్ర‌దింపులు, కాన్ఫిడెన్షియ‌ల్ గా అయినా అభిప్రాయాల‌ను కూడా తీసుకున్న చ‌రిత్ర మోడీకి ఇంత వ‌ర‌కూ లేదు. తాము చేయాల‌నుకున్న‌ది చేయ‌డం, ప్ర‌క‌టించాల‌నుకున్న‌ది ప్ర‌క‌టించ‌డం. తాంబూలాలు ఇచ్చేశాం త‌న్నుకు చావండ‌న్న‌ట్టుగా సామాన్యుల‌ను అలా వ‌దిలేస్తూ వ‌చ్చారు న‌రేంద్ర‌మోడీ.

ముడ్డి మీద తంతే మూతి ప‌ళ్లు రాలిన‌ట్టుగా నోట్ల ర‌ద్దుతో అంతిమంగా సామాన్యులు బాధితుల‌య్యారు. బ్యాంకులు ఇంకా బాగుప‌డ‌లేదు. జీఎస్టీతో దుకాణం స‌ర్దేశారు. త‌న మార్కు సంస్క‌ర‌ణ‌లుగా మోడీ చెప్పుకుంటున్న‌వి ఏవీ ఫ‌లితాలు ఇవ్వ‌డం లేదు క‌దా, తీవ్రంగా విక‌టిస్తూ ఉన్నాయి. అయినా.. ఏ అంశంలోనూ కూలంక‌మైన చ‌ర్చ‌, సంప్ర‌దింపులు, అభిప్రాయాలు తీసుకోవ‌డం వంటి వాటికి ఆస్కారం ఇవ్వ‌డం లేదు.

ఇదే క్ర‌మంలో వ్య‌వ‌సాయ బిల్లుల‌ను తీసుకొచ్చారు. మెజారిటీ ఉంది కాబ‌ట్టి.. వాటికి పార్ల‌మెంట్ చేత ఒప్పించేశారు! ఈ వ్య‌వ‌హారంపై రైతుల నుంచి తీవ్ర ప్ర‌తిఘ‌ట‌న ఎదుర‌వుతోంది. అందులోనూ ప‌ట్టుద‌ల‌కు మారు పేరైనా, ప‌ట్టిన దాన్ని తేలిక‌గా వ‌ద‌ల‌ని సిఖ్ఖు రైతుల నుంచినే ఈ బిల్లుల విష‌యంలో తీవ్ర ప్ర‌తిఘ‌ట‌న ఎదుర‌వుతోంది. దీనికి దేశ‌మంత‌టి నుంచి సంఘీభావం వెల్లువెత్తుతూ ఉంది. 

వేరే అంశం ఏదైనా అయ్యుంటే.. ఏ కాంగ్రెస్ కో ముడిపెట్టి, మ‌రెక్క‌డో ఉగ్ర‌వాదాన్ని అణ‌చ‌డానికి అని చెప్పి మోడీ ప్ర‌భుత్వం తెలివిగా దేశ‌భ‌క్తి అస్త్రాన్ని సంధించేసి త‌ను కున్న‌ది చేసేసేది! అయితే.. ఇక్క‌డ ఇంత‌క‌న్నా లాగితే తెగుతుంద‌ని స్ప‌ష్టం అవుతోంది.

అందుకే తొలి సారి.. మోడీ ప్ర‌భుత్వం నుంచి చ‌ర్చ‌లు అనే మాట వినిపిస్తోంది! రైతు సంఘాల వాళ్ల‌ను చ‌ర్చ‌ల‌కు పిలిచారు. లోక్ స‌భ అత్య‌వ‌స స‌మావేశాలు అని మోడీ స‌ర్కారు బుజ్జ‌గిస్తోంది. అయితే ముందు బిల్లులు ర‌ద్దు చేయండి, త‌ర్వాత అవ‌న్నీ అని రైతు సంఘాల ప్ర‌తినిధులు స్ప‌ష్టం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు అమిత్ షానే చ‌ర్చ‌ల‌కు దిగుతున్నార‌ట‌. 

అనుకున్న‌ది చేసేయ‌డ‌మే త‌ప్ప‌.. ఎవ‌రినీ ప‌ట్టించుకునే ర‌కం కాని పాల‌న‌లో తొలి మార్పు ఇది. రైతులతో పెట్టుకుంటే..ఆ త‌ర్వాత బీజేపీ మార్కు దేశ‌భ‌క్తికి కాలం చెల్లిపోతుంది కాబ‌ట్టి.. మారిన‌ట్టుగా ఉన్నారు. అయితే వెన‌క్కు త‌గ్గ‌డాన్ని మోడీ ప్ర‌భుత్వ చిన్న‌త‌నంగా భావించ‌వ‌చ్చు.

రైతుల కోరిక‌ల‌ను తీర్చ‌డానికి ఒప్పుకోక‌పోవ‌చ్చు. చ‌ర్చ‌ల‌తో వారిని ఒప్పించిన‌ట్టుగా ప్ర‌క‌టించేసి, స‌వ‌ర‌ణ‌లు అంటూ పార్ల‌మెంట్ స‌మావేశాలు పెట్టి, చివ‌ర‌కు త‌మ మాట నెగ్గించుకోవ‌డానికే ప్ర‌య‌త్నించ‌వ‌చ్చు. అయితే ప‌ట్టుప‌ట్టిన వాళ్లు గ‌ట్టిగా క‌నిపిస్తూ ఉన్నారు. అణిచివేత ప‌ద్ధ‌తి ద్వారా ఈ ఉద్య‌మాన్ని డీల్ చేయ‌డం సాధ్యం కాక‌పోవ‌చ్చు. ఈ వ్య‌వ‌హారంలో అంతిమంగా ఏం జ‌రుగుతుంద‌నేది మోడీ ప్ర‌భుత్వం త‌దుప‌రి ప‌నితీరు మీద కూడా ప్ర‌భావం చూపించ‌డం ఖాయం.

మళ్ళీ అదే ప్రశ్న