తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం తీసుకువస్తానని నందమూరి బాలకృష్ణ భీషణ ప్రతిజ్ఞ చేశారు. ప్రతినెలా పార్టీ కార్యకర్తలతో సమావేశాలు సమీక్షలు నిర్వహిస్తూ, పార్టీకి మార్గ నిర్దేశం చేస్తాను అని అనేక సందర్భాలలో మాట ఇచ్చి, అలవాటుగా విస్మరిస్తూ ఉండే నారా చంద్రబాబు నాయుడు జైల్లో నుంచి ఎప్పటికీ బయటకు వస్తారో తెలియదు. బయటకు వచ్చినా కూడా.. మళ్లీ ఏ కేసులో జైల్లోకి వెళ్తారో తెలియదు.
ఇలాంటి క్లిష్ట పరిస్థితులలో.. తెలంగాణ తెలుగుదేశం సారధి కాసాని జ్ఞానేశ్వర్ నందమూరి బాలయ్యను నమ్ముకున్నట్లుగా కనిపిస్తోంది. దానికి తగ్గట్లుగానే.. పార్టీకి తాను పూర్వవైభవం తీసుకువచ్చేస్తానని బాలయ్య కూడా ప్రతిజ్ఞ చేసేశారు.
అయితే తమాషా ఏంటంటే.. బాలయ్యకు తమ పార్టీ బలాబలాల గురించి సరైన అవగాహన ఉన్నదో లేదో కానీ అన్ని స్థానాలలో పార్టీ అభ్యర్థులను నిలబెట్టడం గురించి కూడా ప్రస్తావిస్తున్నారు. అన్నిచోట్ల పోటీ చేయడమా? లేదా, పొత్తులతో ఎన్నికల బరిలోకి వెళ్లడమా అనేది కోర్ కమిటీలో చర్చించి నిర్ణయిస్తామని బాలయ్య ప్రకటించారు. సరిగ్గా ఈ మాట దగ్గరే తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున్నారు.
తెలుగుదేశంతో పొత్తు పెట్టుకునేంత సాహసం ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఏ పార్టీకైనా ఉన్నదా అనేది పలువురి సందేహం. ఎందుకంటే, 2019 ఎన్నికల్లో అంతో ఇంతో గెలుపు మీద ఆశలు పెట్టుకుని ఉన్న కాంగ్రెస్ పార్టీ.. చంద్రబాబు నాయుడు ఒత్తిడితో తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుని సర్వభ్రష్టత్వం చెందిపోయింది.
తెలుగుదేశంతో పొత్తు కారణంగా, కేసీఆర్ కాంగ్రెస్ పార్టీని ఒక రేంజ్ లో ఆడుకున్నారు. అదే వారి పతనాన్ని నిర్దేశించింది. చంద్రబాబుతో పొత్తు తెలంగాణ రాజకీయాల్లో ఐరన్ లెగ్ లాంటిదని ఒక ముద్ర పడిపోయింది. బాలయ్య బాబు ఏదో అత్యుత్సాహంతో అలా చెప్పి ఉండొచ్చు కానీ.. వారితో పొత్తు పెట్టుకోవడానికి సిద్ధంగా ఉండేది ఎవరు? కాంగ్రెస్ ఎక్కడ ప్రధానంగా తలపడుతుండగా, భారతీయ జనతా పార్టీ కూడా తాము అధికారంలోకి వచ్చేస్తాం అనే ప్రగల్భాలతోనే పోటీకి సిద్ధమవుతోంది. వీరిద్దరూ పొత్తులు కాదు కదా అసలు తెలుగుదేశాన్ని వారి సమీపానికి కూడా రానివ్వరు.
ఇకపోతే, ఏపీలో చంద్రబాబు నాయుడు పల్లకి మోస్తున్న జనసేన మిగిలి ఉంది. అయితే తెలంగాణలో తెలుగుదేశంతో జట్టు కడుతుందని అనుకోవడం భ్రమ. ఎందుకంటే వారు ఆల్రెడీ తాము పోటీ చేసే 32 స్థానాల పేర్లను ప్రకటించేశారు. తెలుగుదేశానికి పదో పాతికో ఓట్లు రాల్చే నియోజకవర్గాలు కూడా అందులో ఉన్నాయి.
తెలుగుదేశం అనుభవం, జనసేన పోరాట పటిమ కలిసి బరిలో ఉండాలని సుద్ధులు చెప్పే పవన్ కళ్యాణ్.. తెలంగాణలో ఆ నీతిని పాటిస్తారో లేదో తెలియదు. అయినా తమ బలం సున్నా అనే సంగతి గుర్తుంచుకోకుండా, బాలయ్య పొత్తుల మాట ఎత్తడమే అతిపెద్ద కామెడీ అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.