గత కొన్ని నెలలుగా కామ్ గా ఉండి, తెలుగుదేశం పార్టీలో ఉంటారా? అనే సందేహాలను రేకెత్తించిన అనంతపురం జిల్లా ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఆ సందేహాలకు సమాధానం ఇచ్చినట్టేనేమో! ఆయన తెలుగుదేశం పార్టీలోనే ఉండబోతున్నట్టుగా సంకేతాలు ఇచ్చినట్టేనేమో! .
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పయ్యావుల కేశవ్ స్పందించిన తీరుతో ఆయన తెలుగుదేశం పార్టీ విధివిధానాలకు కట్టుబడినట్టుగానే కనిపిస్తూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరతారా? అనే ప్రశ్నలకు ఇన్నాళ్లూ ఆస్కారం ఇచ్చినట్టుగా వ్యవహరించిన కేశవ్ ఇప్పుడు తను తెలుగుదేశంలోనే ఉండబోతున్నట్టుగా అసెంబ్లీలో స్పందన ద్వారా తెలియజేసినట్టుగా అయ్యింది.
గత ఎన్నికల్లో రాయలసీమ నుంచి టీడీపీ తరఫన గెలిచిన ముగ్గురే ముగ్గురు ఎమ్మెల్యేల్లో ఒకరు పయ్యావుల కేశవ్. ఉరవకొండ నియోజకవర్గం నుంచి ఆయన గెలిచారు. ఉరవకొండ నియోజకవర్గానికి ఉన్న సెంటిమెంట్ ఏమిటంటే.. అక్కడ నుంచి ఏ పార్టీ నెగ్గితే అది రాష్ట్రంలో అధికారాన్ని అందుకోలేదు.
అక్కడ నుంచి నెగ్గిన పార్టీ ప్రతిపక్షంలో ఉండాల్సిందే! అనే సెంటిమెంట్ గత కొన్ని దశాబ్దాల నుంచి కొనసాగుతూ ఉంది. ఈ క్రమంలో అనంతపురం జిల్లాలో 12 స్థానాల్లో నెగ్గిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతా అనుకూలంగానే ఉన్నా ఉరవకొండలో ఓడిపోయింది.
అయితే అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వర్గాలు ఎక్కువై తెలుగుదేశం పార్టీ విజయం సాధించిందని స్పష్టం అవుతోంది. ఈ పరిణామాల్లో పయ్యావుల కేశవ్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపు వస్తే.. అప్పుడు శ్రేణుల్లో మరింత గందరగోళం ఏర్పడేది. అయితే అసెంబ్లీలో స్పందన ద్వారా తను తెలుగుదేశం పక్షమే అని పయ్యావుల కేశవ్ స్పష్టతను ఇచ్చారు.
గతంలో కూడా పయ్యావుల కేశవ్ విషయంలో ఇలాంటి ప్రచారం ఒకటి జరిగింది. 2014 అసెంబ్లీ ఎన్నికల ముందే ఆయన తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లో చేరతారని ప్రచారం జరిగింది. అప్పట్లో సంప్రదింపులు జరిగాయంటారు. అయితే తనపై జరిగిన ప్రచారానికి నిరసిస్తూ ఆయన ఎన్టీఆర్ భవన్ లో ప్రెస్ మీట్ పెట్టి ఏడ్చేశారు! మీడియా ప్రతినిధుల ముందు ఏడ్చి మరీ తను తెలుగుదేశంలోనే ఉండబోతున్నట్టుగా అప్పట్లో క్లారిటీ ఇచ్చారు.
కమ్మ సామాజికవర్గానికి చెందిన పయ్యావుల కేశవ్ 2014 ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ ఎమ్మెల్సీగా అవకాశం దక్కింది. మంత్రి పదవి కూడా దక్కుతుందని ప్రచారం జరిగింది కానీ, అప్పటికే అనంతపురం జిల్లాలో గెలిచిన ఎమ్మెల్యేలు ఉండటంతో ఈయనకు అవకాశం దక్కలేదు. ప్రస్తుతం గెలిచినా ప్రతిపక్షంలో ఉండాల్సిన పరిస్థితి.
కేశవ్ ఎప్పుడు గెలిచినా టీడీపీ ప్రతిపక్షంలోనే ఉంటుంది. ప్రస్తుతానికి అయితే ఆయన ప్రతిపక్షంలోనే కొనసాగే సంకేతాలను స్పష్టంగా ఇచ్చారు. ప్రభుత్వంపై విమర్శలు చేయడం, సభ నుంచి సస్పెండ్ కావడం ద్వారా చంద్రబాబుపై విధేయతను చూపించారు ఈ టీడీపీ ఎమ్మెల్యే!